SP Sailaja
-
సరిగమప 16వ సీజన్‌కు ముహూర్తం ఫిక్స్
సంగీత పరిశ్రమలో ముద్రపడిపోయిన ట్రెండ్లను అనుకరించడం కన్నా సృజనాత్మకతతో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్లను సృష్టించేవారు చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రముఖ సంగీత దర్శకులు కోటి తెలిపారు. జీ తెలుగు వేదికగా ప్రేక్షకాదరణ పోందిన ప్రముఖ షో సరిగమప 16 వ సీజన్ ఈ నెల 29న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమంలో సరిగమప న్యాయనిర్ణేత కోటీ మాట్లాడుతూ., దాదాపు 5 వేల మందిలో అత్యుత్తమ కళా నైపుణ్యాలున్న 26 మందిని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ఏఐ వంటి మాధ్యమాలు వచ్చి నకిలీ సంగీతాన్ని సృష్టిస్తున్నాయని., ఇలాంటి ఎన్ని సాంకేతికతలు వచ్చినా స్వచ్చమైన, సహజమైన నంగీతం ఎప్పుడూ తన ప్రశస్తిని పెంచుకుంటూ పోతుందన్నారు.ప్రముఖ లిరిసిస్ట్ శ్యామ్ క్యాసర్ల ఈ సీజన్లో జడ్జిగా వ్యవహారించనున్నారు. మట్టిలో మాణిక్యాలను ప్రముఖ సింగర్లుగా వెలుగొందేలా సానబెడతామన్నారు. రెండు తరాలకు మధ్య వారధిలా సంగీత, సాహిత్య అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని శ్యామ్ అన్నారు. ఈ సీజన్లో విలేజ్ వోకల్స్, సిటీక్లాసిక్స్, మెట్రో మెలోడీస్ అనే 3 జట్లుగా పోటీలు కొనసాగుతాయని మరో జడ్జి ఎస్పీ శైలజ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్లు రువంత్, రమ్య, అనుధీప్ తదితరులు పాల్గొన్నారు. -
మాపై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ.. కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
'శుభలేఖ' సుధాకర్, ఆ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇండస్ట్రీలో ఆయన రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజకు ‘శుభలేఖ’ సుధాకర్ భర్త అనే విషయం తెలిసిందే. ఆయన నటుడిగానే కాకుండా డబ్బింగ్‌తోనూ ప్రేక్షకులను అలరించడం విశేషం. తాజాగా యాత్ర -2 చిత్రంలో రెడ్డి పాత్రలో ఆయన నటనకు వంద మార్కులు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఆయన పాత్రను మరిచిపోవడం కష్టం.. అంతలా ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్ ఛానల్స్ తన పట్ల వ్యవహిరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఎమోషనల్ అయ్యారు. 'సుధాకర్‌కు అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి' శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్ ఇలా తప్పుడు రాతలు ఎందుకు రాస్తారంటూ ఆయన ఆవేదన చెందారు. 'చిరంజీవితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54రోజుల పాటు ఆయన నిత్యం ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే వారు. మెగాస్టార్ నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్ వాళ్లు చాలా ఏళ్లుగా తప్పుగానే నా గురించి చూపిస్తూ వస్తున్నారు. నేను, శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు.. అందులో నిజం లేదని ఇప్పటికే మేము ఇద్దరం కలిసి చెప్పాం. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ గారు శైలజను ఒకరోజు ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా..? అని అప్పుడు నేను కలుగచేసుకుని అలాంటివి ఏమీ లేవని చెప్పాను. తర్వాత మళ్లీ రోజు నిద్రలోనే ఆమె మరణించారు. ఇలాంటి సమయంలో నేను ఏం అనుకోవాలి..? ఇలాంటి వీడియోలతో యూట్యూబ్ ఛానల్స్ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అత తక్కువ వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. వాళ్లకు కూడా మంచి ఎథిక్స్ ఉంటాయి. కానీ వీళ్లకు మాత్రం అలాంటివి ఏమీ లేవు అంటూ సుధాకర్ కన్నీరు పెట్టుకున్నారు. ఒక్కోసారి శుభలేఖ సుధాకర్ చనిపోయారని వీడియో పెడతారు.. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. కనీసం నేను ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టను. మీ పొట్ట నింపుకోవాడానికి మరోకరిని ఇలా చంపడం ఎందుకు..? అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా..? ఇలాంటి వీడియోలు చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు.' అని ఆయన క్షోభించారు. -
డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం
అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్‌లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్విల్లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్‌లు ప్రారంభించారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు. రోజుకు ఒక పేజీ తెలుగు చదవాలని, తద్వారా మాతృభాషకు దూరం కాకుండా ఉండగలమని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే డాక్టర్లు గుర్తుకు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనంత్ వంటి రియల్టర్లతో పాటు సమాజంలోని విభిన్న కోణాలకు చెందిన ఎందరో అమెరికా వస్తున్నారని తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అమెరికాలో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్టిన్లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో తెలుగు కోర్సుల నిర్వహణ నిమిత్తం తానా నిధుల సేకరణ చేపట్టినప్పుడు ఎస్పీ బాలు విభావరితో అలరించాలని ఆయన ఆశ ధ్యాస శ్వాస తెలుగు భాష అని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటాలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని శైలజ-చరణ్‌ల చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బహుకరించారు. త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని ప్రసాద్ తెలిపారు. “ట్యాంక్‌బండ్‌పై తెలుగు విగ్రహాల ప్రశస్తి” పేరిట చెన్నపూరి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఈ సభలో ఆవిష్కరించారు. వేముల లెనిన్, మద్దుకూరి చంద్రహాస్, అనంత్ మల్లవరుపులు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన “పాడరా ఓ తెలుగువాడా” గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. అతిథులకు అనంత్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పేరిట స్వదేశంలో పాఠశాల కట్టించానని, అమెరికాలో తన తల్లి పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారద సింగిరెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పరమేష్ దేవినేని, రాజేష్ అడుసుమిల్లి, బీరం సుందరరావు, సురేష్ మండువ, లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు. -
కమల్ హాసన్ ని నేను కాలు తో తన్నడం ఏంటి..?
-
మా అన్నయ్య నాకు అవకాశాలు ఇప్పించి ఉంటే... ఇప్పుడు నా పరిస్థితి..!
-
మా ఆయన ఆ పాట నాతో ఎక్కువ పాడించుకుంటారు
-
వరల్డ్ మ్యూజిక్ డే.. టాప్ 10 పాటల్ని గుర్తుచేసుకుందామా
ఎండలు మండితే పాటలు ఓదార్పు. తొలకరి కురిస్తే పాటలు కాఫీకి తోడు.చలి చక్కిలిగిలి పెడితే పాటే కదా వెచ్చటి రగ్గు.సంగీతమూ సినిమా పాట లేకుండా జీవితం సాగేది ఎలా. నేడు వరల్డ్ మ్యూజిక్ డే. రావు బాల సరస్వతి, పి.లీల, జిక్కి,భానుమతి రామకృష్ణ, పి.సుశీల, ఎస్.జానకి,ఎల్.ఆర్.ఈశ్వరి, వాణి జయరాం, శైలజ, చిత్ర...వీరంతా మన సినీ కోయిలలుగా మన జీవన సందర్భాలను సంగీతమయం చేశారు.నేడు వీరి పాటలను తలుచుకోవడం మన విధి.వీరికి చేరేలా కృతజ్ఞత ప్రకటించడం మన సంతోషం. నేడు వరల్డ్ మ్యూజిక్ డే తానే మారెనా గుణమ్మే మారెనా దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా... రావు బాలసరస్వతి గొంతు మంచురాలిన దారిలో హంస నడకలా ఉంటుంది. నటీనటులే పాటలు పాడుకోవాలి అనుకునే రోజుల్లో ఆమె దాదాపుగా మన తొలి ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్. సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఆమె పాటలు రెక్కలు విప్పాయి. సువాసనలు చిమ్మాయి. ఆమె తన సినిమా కెరీర్‌ను కొనసాగించి ఉంటే లతా అంతటి గాయనిగా గుర్తింపు పొందేది. ఆమె మనకు పంచిన అమృతం తక్కువ. కాని దాని రుచి ఎంతో మక్కువ. తెల్లవార వచ్చె తెలియక నాసామీ మళ్లీ పరుండేవు లేరా... అప్రయత్నంగా వీచే గాలిలా, అనాయాసంగా తాకే ‘మళయ’మారుతంలా ఉంటుంది పి.లీల గొంతు. తెలుగు ఆమె మాతృభాష కాదు. కాని ప్రతి తెలుగు గృహిణి నాలుక మీద ఆమె పాట చర్విత చరణం అయ్యింది.‘సడిచేయకోగాలి సడి చేయబోకే’, ‘ఓహో మేఘమాల.. నీలాల మేఘ మాల’, ‘కలనైనా నీ వలపే... కలవరమందైన నీ తలపే’... పి.లీల సంగీతలీల అద్భుతం. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న తెలుగు పాటల్లో తన ఏరువాకతో కొత్త నారును వేసి సమృద్ధికర పైరును శ్రోతలకు అందించిన గాయని జిక్కి. పిట్ట కొంచమే. కూత పది వర్ణాల పింఛమే. అల్లరి పాటైనా ఆర్ద్ర గీతమైనా జిక్కి చేత చిక్కిందంటే హిట్. ‘ఛాంగురే బంగారు రాజా’, ‘పులకించని మది పులకించు’... ఆమెకు శ్రీలంకలో కూడా ఫ్యాన్స్ ఉండేవారు. అందమైన పాటలు పాడి ‘జీవితమే సఫలము’ చేసుకున్న ప్రియమైన గాయని జిక్కి. ఓహోహోహో పావురమా ఓ... ఓహోహో పావురమా వెరపేలే పావురమా ఓహోహో ఓహో పావురమా ఈ పావురం డేగల్ని కూడా వేటాడగలదు. భానుమతి రామకృష్ణ సకల కళావల్లభురాలు. నాటి తెలుగు మహిళలకు పెద్ద ధైర్యం. ఇండస్ట్రీలో గొప్ప తెగువ. అలాంటి గొంతు, ఆ పాట తీరు రిపీట్ కాలేవు. కాబోవు. ‘ఎందుకే నీకింత తొందర’, ‘నేనే రాధనోయి’, ‘సావిరహే తవదీన’... ఎన్ని పాటలని. ఇక ‘మల్లీశ్వరి’ ఆమె ప్రతి పాట గండుమల్లె, రెక్కమల్లె. ‘మనసున మల్లెల మాలలూగెనే’.. ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ ముత్తయిదు కుంకుమ బతుకెంతొ ఛాయ తెలుగు పాటకు వంద సంవత్సరాల ఛాయను తెచ్చింది సుశీల. ఆమె రాకతో నటిని, గాయనిని దృష్టిలో పెట్టుకోకుండా ΄ాటకు అవసరమైన రేంజ్‌తో బాణీ కట్టడం మొదలెట్టారు సంగీత దర్శకులు. సుశీల ΄ాటలో నిష్ఠ ఉంటుంది. క్రమశిక్షణ ఉంటుంది. శ్రేష్టమైన ఉచ్చారణ. నూరుశాతం కచ్చితత్వం. ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’, ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘ఇది మల్లెల వేళయనీ’... ఈ కెరటాలకు అంతులేదు. ఈ గాన సముద్రానికి ఉప్పదనం లేదు. అమృత సాగరం. నీలిమేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునేవేళా నూనె రాసి గట్టిగా బిగించి కట్టిన జడది అందమే. అది సుశీలమ్మ పౠటది. తల స్నానం చేసి వదులుగా వదిలన ముంగురులదీ అందమే. అది జానకమ్మ పౠటది. తెలుగు ΄ాట ఊపిరి పీల్చుకోవడానికి తెరిచిన పెద్ద గవాక్షం జానకి. తల్లిదండ్రులను చనువుగా ఒకమాటనగల చిన్న కూతురిలా ఉంటుందామె పాట. సరదా. హుషారు. అద్దంలో ఇమడగల కొండంత ప్రతిభ. ‘పగలే వెన్నెల’, ‘మనసా తుళ్లి పడకే’, ‘అందమైన లోకమని రంగురంగులున్నాయనీ’... ఇక నాదస్వరం ఎదుట పడగ ఎత్తి నిలిచిన పాట ‘నీలీల పాడెద దేవా’... మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు మాగమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు ఆగేదెట్టాగ అందాక ఏగేదెట్టాగ గజ్జె కట్టి, బిగుతు దుస్తులు ధరించి, స్టేజ్ ఎక్కి జానపద శృంగారం ఒలికించిన ΄ాట ఎల్.ఆర్. ఈశ్వరిది. ఊరంటే గుళ్లు, ఇళ్లు మాత్రమే కాదు.. పొలాలుంటాయి.. మంచెలూ ఉంటాయి. ‘మసక మసక చీకటిలో’, ‘నందామయా గురుడ నందామయా’, ‘తీస్కో కోకకోలా’... ప్రతి పాటా సంపెంగ పొదలో పూసిన పువ్వు.అది మగాళ్లని ‘బలేబలే మగాడివోయ్’ చేసింది. విధి చేయు వింతలన్ని మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో వాణి జయరామ్‌ది పక్కింట్లో నుంచి వినిపించే పరిచిత గీతంలా ఉంటుంది. అదే సమయంలో దానికో వ్యక్తిత్వం ఉంటుంది. వాణి జయరామ్ పాటల మీద జోకులేయలేం. గౌరవించడం ప్రేమించడం తప్ప. ‘పూజలు సేయ పూలు తెచ్చాను’, ‘నేనా పాడనా పాట... మీరా అన్నదా మాట’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’... అద్భుతం. లాలు దర్వాజ్ లష్కర్ బోనాల్కొస్తనని రాకపోతివి లక్డీకాపూలు పోరికి రబ్బరు గాజులు తెస్తనని తేకపోతివి ఎస్.పి.శైలజ పాటను ఒక పల్లవి ఒక చరణం వరకే అనుమతించింది తెలుగు పరిశ్రమ. ప్రతిసారి మైక్ అందలేదు. అందినప్పుడు ఆమె గొంతులో అందం దాగలేదు. ‘మాటే మంత్రము’, ‘నాంపల్లి టేషన్కాడి’, ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’... ఆమె పాట, మాట రెండూ మృదురమే. రానేల వసంతాలె శృతి కానెల సరాగాలే నీవే జీవన రాగం... స్వరాల బంధం చిత్ర రాకతో మళ్లీ తెలుగు పాటకు టీనేజ్ వచ్చింది. కొత్త తరానికి ΄ాటను అందించింది చిత్ర. కాలేజీకెళ్లే అమ్మాయిలు ‘తెలుసా మనసా’ అని... ‘కన్నానులే కలలు’ అని... ‘ఎన్నెన్నో అందాలు’ అని పాడుకున్నారు. ‘మనసున ఉన్నది చె΄్పాలనున్నది’ అని కూనిరాగం తీసుకున్నారు. మన గాయనులు మనకు బుట్టల కొద్ది పాటలు పంచినందుకు కృతజ్ఞతలు. -
అలా ఆ స్టార్ హీరోని నా కాలితో తన్నాల్సి వచ్చింది: ఎస్పీ శైలజ
ఎస్పీ శైలజ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. దాదాపు నాలున్నర దశాబ్దాలుగా ఆమె తన గాత్రంతో సంగీత ప్రియులను అలరిస్తోంది. ఆమె పాట ఎంత మధురంగా ఉంటుందో.. మనసు కూడా అంతే సున్నితంగా ఉంటుంది. కేవలం పాటల్లోనే కాకుండా.. డబ్బింగ్ ఆరిస్ట్‌గా, నటిగా కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న శైలజ.. తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నేను ఇంత పెద్ద సింగర్ అవుతానని అనుకోలేదు. బహుషా ఒక్క పాట పాడతానేమో అనుకున్నా. మా ఇంట్లో నేను, అన్నయ్య(ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) తప్ప అందరూ సంగీత వాయిద్యాలు నేర్చుకున్నారు. మా అమ్మకు ఒక్క ఆడపిల్ల అయినా స్జేజ్మీద పాడాలని కోరిక ఉండేది. కానీ మా నాన్నకు అది నచ్చేది కాదు. మొదట్లో నన్ను బయటకు పంపడానికి అంగీకరించలేదు. కానీ ఆ తర్వాత ఆయన ఓకే చెప్పారు. వారి ప్రోత్సాహంతో మొదటి సారి ‘మార్పు’ సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఆ పాట విన్నాక అన్నయ్యకు నాపై నమ్మకం కలిగింది. దీంతో ప్రతి ప్రోగ్రామ్స్‌కు నన్ను తీసుకెళ్లాడు. ఆ తర్వాత చక్రవర్తి గారు వరుసగా అవకాశాలు ఇచ్చాడు. నేను పాడిన పాటలు విజయవంతం కావడంతో అన్ని భాషల్లో అవకాశాలు వచ్చాయి. ఇక సినిమాలో నటించే అవకాశం కూడా అనుకోకుండా వచ్చింది. నేను భరత నాట్యంలోకి అరంగేట్రం చేసినప్పుడు తీసిన ఫోటోలు విశ్వనాథ్‌గారు చూశారు. అలా ‘సాగరసంగమం’లో చాన్స్ వచ్చింది. మొదట నటించడానికి నేను అంగీకరించలేదు. ఇంట్లో అందరూ చేయమని చెప్పిన.. నేను నో చెప్పాను. కానీ విశ్వనాథ్ గారు మా నాన్న దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడి బలవంతంగా ఒప్పించారు. షూటింగ్ సమయంలో విశ్వనాథ్‌గారితో చాలా విషయాలు పంచుకున్నాను. ఒక అన్నయ్యలా నాకు క్లోజ్ అయ్యాడు. ‘సాగరసంగమం’ సినిమాలో కమల్ హాసన్ గారిని కాలితో తన్నే సన్నివేశం ఉంది. దానికి నేను ఎంత ప్రయత్నించినా.. నా కాలు వెనక్కి వచ్చేసిది. అప్పుడు విశ్వనాథ్‌గారు పిలిచి ఇవి పాత్రలు మాత్రమే.. నిజంగా కమల్ హాసన్‌ని తన్నడం లేదు.. ఆయన పోషించిన పాత్రను మాత్రమే నువ్వు కాలితో తన్నుతున్నావు అని చెప్పి చేయించాడు. అలా ఇష్టం లేకున్నా.. ఆ హీరోని తన్నాల్సి వచ్చింది అని శైలజ చెప్పుకొచ్చారు. -
స్వరార్చన
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎస్ పి శైలజ
-
చాముండేశ్వరీదేవి సేవలో ఎస్పీ శైలజ
గంగపట్నం(ఇందుకూరుపేట): మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారిని ప్రముఖ సినీ గాయని ఎస్పీ శైలజ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
అమ్మ ఆ రోజు అలా ఉండబట్టే...మేము ఈ రోజు ఇలా ఉన్నాం!
పల్లవీ చరణం కలిస్తేనే పాట... ఆశలూ ఆశయాలూ కుదిరితేనే జీవితం... అవును! ఎస్పీ శైలజకు తన పాటలపై, జీవితంపై చాలా స్పష్టత ఉంది. నిండు కుండ తొణకదు అన్నట్టుగా కనబడతారామె. ఈ స్థితప్రజ్ఞత, స్మిత ప్రజ్ఞత అంతాఈ అయిదుగురి వల్లనే అని చెబుతారామె. తనపై ప్రగాఢమైన ముద్ర వేసిన అయిదుగురు వ్యక్తుల గురించి, తనలో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన పుస్తకాల గురించి ఎస్పీ శైలజ హృదయావిష్కరణ... 1- ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకున్నది అమ్మను చూసే... ఎవరికైనా తొలి గురువు అమ్మే. నాక్కూడా అంతే. అమ్మ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా అక్కచెల్లెళ్లందరికీ సంగీతం నేర్పించింది. అయితే నాన్నగారికి మేం వేదికలెక్కి పాడడం అస్సలు ఇష్టం లేదు. అమ్మకేమో మాలో ఒక్కరైనా జనాల మధ్య పాడుతుంటే చూడాలని కోరిక. ఆ అదృష్టం నాకు దక్కింది. ఎక్కడ చిన్న పాటల పోటీ జరిగినా అమ్మ నన్ను పంపించేది. నాన్నగారు కేకలేస్తారని తెలిసినా ధైర్యం చేసేది. అప్పుడలా పోటీల్లో పాల్గొన్నాను కాబట్టే నాలో స్టేజ్ ఫియర్ పోయింది. అమ్మ నుంచి నేర్చుకున్న గొప్ప అంశం... ఆర్థిక క్రమశిక్షణ. డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలో అమ్మను చూసి నేర్చుకోవాల్సిందే. ప్రతి రోజూ రాత్రి ఎంత ఆలస్యమైనా... ఆ రోజు చేసిన ఖర్చంతా లెక్కలేసి చూసుకునేది. చదువు విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్. ఆడపిల్లకు మినిమమ్ విద్యార్హత ఉండాలని చెబుతుండేది. అలాగే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలని, హద్దులు తెలుసుకుని ప్రవర్తించాలని చెప్పేది. అమ్మ ఎప్పుడూ ఇలా కట్టడి చేస్తుందేంటని మాలో మేం గొణుక్కునే వాళ్లం. కానీ ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే అమ్మ పెంపకం ఎంత కరెక్టో అర్థమవుతుంది. అసలు అమ్మ ఆ రోజు అలా ఉండబట్టే, మేమందరం ఈ రోజు ఇలా ఉన్నామేమో. ఇప్పటికీ అమ్మ దగ్గర నుంచీ ఏదో ఒక అంశం నేర్చుకుంటూనే ఉంటాను. 2-ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది అన్నయ్యను చూసి తెలుసుకున్నాను! అన్నయ్య అంటే నాకు మరో అమ్మ కింద లెక్క! అంత కేరింగ్ తనది. తను పక్కనుంటే కొండంత భరోసాగా అనిపిస్తుంది. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ అన్నయ్య నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అన్నయ్యలో ఉండే జిజ్ఞాస చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి తనెంతో కుతూహలం కనబరుస్తారు. పుస్తకాలు అయితే ఎప్పుడు ఖాళీ దొరికినా చదువుతారు. మాకూ అదే అలవాటు వచ్చింది. అసలు సినిమాల్లో ఎలా పాడాలో ఆ ఒడుపులన్నీ అన్నయ్య వల్లే చిక్కాయి నాకు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరు, మనుషులతో ప్రవర్తించే పద్ధతి, కెరీర్‌ని మలుచుకున్న విధానం, ముఖ్యంగా టైమ్ మేనేజ్మెంట్... ఇవన్నీ అన్నయ్యను చూసే నేర్చుకున్నాను. 3-చిన్నా పెద్దా అందర్నీ ఒకేలా గౌరవించడం ఆయన నుంచే నేర్చుకున్నాను! అప్పట్లో చెన్నైలోని పాండీ బజార్లో ఓ చెట్టు కింద కూర్చుని ఓ పెద్దాయన అందరికీ హోమియోపతి మాత్రలు ఇస్తుండేవారు. ఆయనే డాక్టర్ గోపాలకృష్ణ. పాతతరం సినిమా వాళ్లందరికీ ఆయన బాగా తెలుసు. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌గారి భార్య జలంధరగారి ద్వారా నాకాయన పరిచయభాగ్యం కలిగింది. ఆయనలోని గొప్ప విషయం ఏమిటంటే... అంతపెద్ద డాక్టరయి ఉండీ, సమాజానికి తన సేవలు ఉపయోగపడాలని ప్రతి క్షణం తపించేవారు. అక్కడుండే రిక్షా వాళ్లకి, చిన్న చిన్న కార్మికులకి ఉచితంగా మందులిచ్చేవారు. ఒక్క వైద్యం అనే కాదు, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఓపిగ్గా విని, తనకు తోచిన సలహాలిచ్చేవారు. ఆయన్లో నాకు అన్నింటికన్నా నచ్చిన విషయం... చిన్నా పెద్దా అందర్నీ ఒకేలా గౌరవించడం. అదే నేను ఆయను నుంచి నేర్చుకున్నాను... సాధ్యమైనంత వరుకు పాటిస్తాను. 4- నా ఆధ్యాత్మిక గురువు ఆయనే! కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నా ఆధ్యాత్మిక గురువు. మా నాన్నగారికి ఆయనంటే ప్రాణం! తరచుగా ఆయనను కలుస్తుండేవారు. మేమూ వెళ్తుండేవాళ్లం కానీ, అప్పట్లో ఆ తత్వాలు మాకు అర్థం కాలేదు. వయసు పెరిగే కొద్దీ ఆ ఆధ్యాత్మిక సౌందర్యం అవగతైమై, నేను కూడా ఆయన్ను గురువుగా భావించడం మొదలెట్టాను. ఆయన రాసిన పుస్తకాలు చదివితే చాలు... జీవితం తాలూకు కొత్త కోణాలు కనిపిస్తాయి. అలా నేను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గత 20 ఏళ్లుగా ఆయన నేర్పిన ఆధ్యాత్మిక మార్గాన్నే అనుసరిస్తున్నాను. 5- సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనిపించేది ఆవిడ వల్లే! మదర్ థెరీసా అంటే రాన్రానూ తెలీకుండానే ఒక ఇష్టం పెరిగిపోయింది. మంచి వయసులో ఉన్నప్పుడే సర్వం వదిలేసుకుని సేవామార్గాన్ని ఎంచుకోవడమంటే మాటలు కాదు. అందుకే ఆవిణ్ణి ప్రపంచమంతా దేవతలా పూజిస్తుంది. మదర్ థెరీసాను గుర్తు చేసుకున్నప్పుడల్లా సమాజానికి మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలనిపిస్తుంది. - పులగం చిన్నారాయణ రెండు కథలు రాశా... నాకు పాటలు ఒక ప్రపంచమైతే, పుస్తకాలు ఇంకో ప్రపంచం. ఆ పుస్తక ప్రపంచంలోకి అడుగుపెడితే వెనక్కు రావాలనిపించదు. ఇదంతా మొదట మా నాన్నగారి చలవే. హరికథలు చెబుతూ బిజీగా ఉండే రోజుల్లో కూడా ఆయన ఏమాత్రం ఖాళీ దొరికినా పుస్తకాలు చదివేవారు. ఆయన పోయాక లైబ్రరీ మొత్తం నేనే తీసుకున్నాను. ఇప్పటికీ పుస్తకాలు బాగా కొంటుంటాను. మంచి పుస్తకం అనిపిస్తే, అయిదు కాపీలు కొని, ముఖ్యులకి బహుమతిగా ఇస్తుంటాను. అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ! మాలతీ చందూర్‌గారి ‘భూమిపుత్రి’ నవల నాకు చాలా ఇష్టమైన నవల. ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక స్ఫూర్తినిచ్చే అంశం గోచరిస్తూనే ఉంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ ‘పర్ణశాల’ నవల కూడా ఎక్కువసార్లే చదివాను. అలాగే కొడవటిగంటి కుటుంబరావుగారి ‘చదువు’ కూడా. ఎన్నో ఏళ్ల క్రితం ఆయన రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ సమాజానికీ కనెక్టవుతుంది. నాకు తెలిసి ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా అలాగే అనిపిస్తుంది. అదీ ఆ పుస్తకంలోని ప్రత్యేకత! శ్రీపాదవారి, విశ్వనాథ సత్యనారాయణగారి రచనలూ అంతే... ఎప్పటికీ పాతబడవు! ఇంగ్లీషులో అయాన్‌ర్యాండ్ రాసిన ‘ఫౌంటెన్హెడ్’ నవల కూడా ఎప్పుడు చదివినా కొత్తగా అనిపిస్తుంది. రాబిన్‌శర్మ పుస్తకాలు కూడా బాగా చదువుతాను. చదవడమే కాదు... కొంచెంగా రాస్తాను కూడా! ఎప్పుడో టీనేజ్‌లో ఉన్నప్పుడు రెండు కథలు రాశాను. ఆ రెండూ ‘వనిత’ మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. నా చుట్టూ ఉండే వ్యక్తుల ప్రవర్తన, అనుభవాలతో ఆ కథలు రాశాను. మళ్లీ ఎప్పుడూ రాయలేదు కూడా. అలాగే కొడవటిగంటి కుటుంబరావుగారి కథలపై ‘వనిత’లో సమీక్ష కూడా రాశాను. ఇప్పటికీ నా మనసు స్పందించినపుడు చిన్న చిన్న కవితలు రాస్తుంటాను. అలాగని నేను రచయిత్రిని కాదు. (నవ్వుతూ) ‘ఈ రోజు చందమామ బాగున్నాడు, వెన్నెల బాగుంది...’ ఇలాంటి ఫీలింగ్స్‌తో చిన్న చిన్న కవితలు రాస్తుంటాను. అయినా నాకు రాయడం కన్నా చదవడమంటేనే ఆసక్తి! ప్రస్తుతం ఇవి నన్ను బిజీగా ఉంచుతున్నాయి... మనకు ఒక్కో స్టేజ్‌లో ఒక్కో అంశం రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మికం! లిండా గుడ్‌మెన్ రాసిన కొత్త పుస్తకం ఇటీవలే కొన్నాను. ఆధ్యాత్మికంగా మీరు చిరంజీవత్వం సంపాదించుకోవచ్చనేది ఆ పుస్తక సారాంశం. మొన్నీమధ్యనే తిరుపతి బుక్ ఫెస్టివల్లో ఆచంట జానకిరామ్‌గారి ‘నా స్మృతిపథంలో’ పుస్తకం కొన్నా. ప్రస్తుతం అది కూడా చదువుతున్నాను. -
ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది : ఎస్.పి.శైలజ
‘అలివేణీ... ఆణిముత్యమా...’ ‘ముద్దమందారం’లోని ఈ పాట వినగానే... అంతులేని ఆనందోద్వేగం గుండెల్లో ఉబికి... కళ్లలోంచి నీటిముత్యాలుగా దొర్లుతాయి. ‘శివరంజనీ... నవరాగినీ...’ ‘తూర్పుపడమర’లోని ఈ గీతం చెవిన పడితే... హృదయం ఉప్పొంగుతుంది. శరీరం రోమాంచితం అవుతుంది. ‘మనసా... తుళ్లిపడకే...అతిగా ఆశపడకే..’ వేటూరి అక్షరాలు స్వరాలంకృతమై ఈ రీతిగా పలకరిస్తే... వయసు కలవరిస్తుంది. మనసు పలవరిస్తుంది. మనిషిలోని అన్ని ఉద్వేగాలనూ ఇలా స్వరాలతో తట్టిలేపడం అందరికీ సాధ్యం కాదు. ఆ మేజిక్ కొందరికే సాధ్యం. ఆ కొందరిలో అగ్రగణ్యుడు రమేష్‌నాయుడు. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాకు రాగాభిషేకం చేసిన సంగీత జ్ఞాని ఆయన. అమ్మమాట, తాతామనవడు, దేవుడు చేసిన మనుషులు, దేవదాసు, తూర్పు పడమర, శివరంజని, ముద్దమందారం, మేఘసందేశం, శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందభైరవి, స్వయంకృషి... ఇలా చెప్పుకుంటూ పోతే... రమేష్‌నాయుడు హార్మోనియం నుంచి ఉద్భవించిన అద్భుతాలు ఎన్నో ఎన్నో ఎన్నెనో... నేడు ఆ సంగీత స్రష్ట జయంతి. రమేష్‌నాయుడు బయట ఎలా ఉన్నా... రికార్డింగ్ థియేటర్లో చండశాసనుడు. అనుకున్నట్టు అవుట్‌పుట్ రాకపోతే... ఎస్పీ బాలుని కూడా ఉపేక్షించేవారు కాదు. కానీ... ఎస్పీ శైలజ మాత్రం ఇందులో మినహాయింపు. ఆమెను మాత్రం ఏమీ అనేవారు కాదాయన. కారణం ఏంటో తెలుసా? శైలజ అచ్చం రమేష్‌నాయుడు అమ్మలా ఉంటారట. అందుకే.. ధైర్యాన్నిచ్చి, బుజ్జగించి మరీ నెమ్మదిగా పాడించేవారు. శైలజ అంటే రమేష్‌నాయుడుకి ఎంత ఇష్టమంటే... చివరిఘడియల్లో శైలజ చేతులమీదుగా తులసితీర్ధం తీసుకొని కన్నుమూయాలనుకునేంత. అందుకే... ఆ సంగీతచక్రవర్తి జయంతి సందర్భంగా ‘సాక్షి’ రమేష్‌నాయుడు గురించి శైలజతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఆ వివరాలివి. రమేష్నాయుడుగారితో మీ తొలి పరిచయం ఎలా జరిగింది ? అప్పుడు నేను చాలా చిన్నదాన్ని. నెల్లూరులో పాటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నయ్య సంగీత విభావరి కూడా ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమానికి అన్నయ్యతో పాటు రమేష్‌నాయుడుగారు కూడా వచ్చారు. అనుకోకుండా ఆ వేదికమీదే నేను పాట పాడాను. నా పాట ఆయనకు బాగా నచ్చేసింది. ‘అవకాశం వస్తే.. సినిమాల్లో పాడతావా తల్లీ...’ అనడిగారు. పాడతానని చెప్పాను. అన్న మాట ప్రకారం ఆయన స్వరాలందించిన ‘సూర్యపుత్రులు’ సినిమా కోసం తొలిసారి నాతో పాడించారు. సినీగాయనిగా నా రెండో సినిమా అది. నా కెరీర్ మొత్తంమీద రమేష్‌గారి నేతృత్వంలో దాదాపు ఓ 40 పాటలు పాడి ఉంటానేమో. రమేష్‌నాయుడుగారి సహచర్యంలో మీకు గుర్తుండి పోయిన అంశాలేమైనా ఉన్నాయా? ఒకటి కాదు. ఆయన సహచర్యంలో అన్నీ గొప్ప అనుభూతులే. ఆయన రికార్డింగ్ అంటే చాలు.. చాలా హ్యాపీగా ఫీలయ్యేదాన్ని. కారణం.. అందరితో ఆయన ఎలా ఉన్నా... నా విషయంలో మాత్రం కూల్‌గా ఉండేవారు. నాకు ఏ ఇబ్బందీ కలక్కుండా చూసుకునేవారు. ఓ సారి అన్నయ్య ఆయన్ను సూటిగానే అడిగేశారు. ‘ఏంటండీ... చిన్న చిన్న తప్పులకు కూడా మా అందర్నీ కోప్పడతారు.. కానీ మా చెల్లెల్ని మాత్రం ఏమీ అనరు. దేనికి?’ అని. అప్పుడు చెప్పారు... నేను అచ్చం వారి అమ్మగారిలా ఉంటానట. అందుకే.. నాతో కోపంగా మాట్లాడలేకపోయేవారాయన. ఆ విషయం మీకెప్పుడు తెలిసింది? తర్వాత అన్నయ్య ద్వారా తెలిసింది. రమేష్‌నాయుడుగారు కూడా తర్వాత నాకు ఆ విషయం చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆయన చివరి ఘడియల్లో మీ చేతుల ద్వారా తులసితీర్థం తీసుకొని కన్నుమూయాలని కోరుకున్నారట. కారణం అదేనా? అదే కావచ్చు. అయితే... అప్పుడు నేను ఆయన వద్దకు వెళ్లలేకపోయాను. ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా బాధ అనిపిస్తుంది. కారణం... అప్పుడు నాకు టైఫాయిడ్. 104 జ్వరంతో ఉన్నాను. రమేష్‌నాయుడు చివరి ఘడియల్లో ఉన్నారని, పైగా నా చేతుల ద్వారా ఆయన వెళ్లిపోవాలనుకుంటున్నారని తెలిసి మా అన్నయ్య సహాయకులు విఠల్‌గారిని అడిగి... ఎలాగోలా ఆయన వద్దకు వెళ్లాను. అయితే... అప్పటికే జరగకూడనిది జరిగిపోయింది. రమేష్‌నాయుడు స్వరాలందించిన పాటల్లో మీకు నచ్చిన పాట? చాలా ఉన్నాయి. కృష్ణగారి ‘దేవదాసు’ సినిమాలోని ప్రతి పాట ఓ ఆణిముత్యమే. అలాగే ఆయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాల్లో ‘మేఘసందేశం’ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో నాతో పాడించకపోయేసరికి చాలా బాధపడ్డాను. నా బాధ గమనించి ఆ సినిమా రీ-రికార్డింగ్ జరుగుతున్నప్పుడు నాతో కొన్ని హమ్మింగులు అనిపించారు. టైటిల్స్‌లో కూడా నా పేరు వేయించారు. ఆ విధంగా ఆ బాధను పోగొట్టారాయన. అలాగే.. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘రావు గోపాలరావు’ సినిమాలో అన్ని పాటలూ నాతోనే పాడించారు. అలాగే.. ‘ఆనందభైరవి’లోని ‘సుడిగాలిలో దీపం’ పాట కూడా నాకు మంచి పేరు తెచ్చింది. మీరు పాడిన పాటల్లో ఆయనకు ఇష్టమైన పాట? ‘మయూరి’లో నేను పాడిన ‘నీ పాదం ఇలలోన నాట్యవేదం’ పాటంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ సినిమాకు అన్నయ్య ఎస్పీబాలు సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఎప్పుడు కనిపించినా... ఆ పాట గురించే నాతో మాట్లాడేవారాయన. - బుర్రా నరసింహ