అమ్మ ఆ రోజు అలా ఉండబట్టే...మేము ఈ రోజు ఇలా ఉన్నాం! | I do that day undabatte ... we're like this! | Sakshi
Sakshi News home page

అమ్మ ఆ రోజు అలా ఉండబట్టే...మేము ఈ రోజు ఇలా ఉన్నాం!

Published Sun, Mar 2 2014 12:09 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

I do that day undabatte ... we're like this!

పల్లవీ చరణం కలిస్తేనే పాట...
 ఆశలూ ఆశయాలూ కుదిరితేనే జీవితం...
 అవును! ఎస్పీ శైలజకు తన పాటలపై,
 జీవితంపై చాలా స్పష్టత ఉంది.
 నిండు కుండ తొణకదు అన్నట్టుగా కనబడతారామె.
 ఈ స్థితప్రజ్ఞత, స్మిత ప్రజ్ఞత అంతాఈ అయిదుగురి వల్లనే అని చెబుతారామె.
 తనపై ప్రగాఢమైన ముద్ర వేసిన అయిదుగురు వ్యక్తుల గురించి, తనలో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించిన పుస్తకాల గురించి ఎస్పీ శైలజ హృదయావిష్కరణ...

 
 1- ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకున్నది అమ్మను చూసే...


ఎవరికైనా తొలి గురువు అమ్మే. నాక్కూడా అంతే. అమ్మ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. మా అక్కచెల్లెళ్లందరికీ సంగీతం నేర్పించింది. అయితే నాన్నగారికి మేం వేదికలెక్కి పాడడం అస్సలు ఇష్టం లేదు. అమ్మకేమో మాలో ఒక్కరైనా జనాల మధ్య పాడుతుంటే చూడాలని కోరిక. ఆ అదృష్టం నాకు దక్కింది. ఎక్కడ చిన్న పాటల పోటీ జరిగినా అమ్మ నన్ను పంపించేది. నాన్నగారు కేకలేస్తారని తెలిసినా ధైర్యం చేసేది. అప్పుడలా పోటీల్లో పాల్గొన్నాను కాబట్టే నాలో స్టేజ్ ఫియర్ పోయింది. అమ్మ నుంచి నేర్చుకున్న గొప్ప అంశం... ఆర్థిక క్రమశిక్షణ. డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలో అమ్మను చూసి నేర్చుకోవాల్సిందే. ప్రతి రోజూ రాత్రి ఎంత ఆలస్యమైనా... ఆ రోజు చేసిన ఖర్చంతా లెక్కలేసి చూసుకునేది. చదువు విషయంలో అమ్మ చాలా స్ట్రిక్ట్. ఆడపిల్లకు మినిమమ్ విద్యార్హత ఉండాలని చెబుతుండేది. అలాగే ఆడపిల్లలు పద్ధతిగా ఉండాలని, హద్దులు తెలుసుకుని ప్రవర్తించాలని చెప్పేది. అమ్మ ఎప్పుడూ ఇలా కట్టడి చేస్తుందేంటని మాలో మేం గొణుక్కునే వాళ్లం. కానీ ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే అమ్మ పెంపకం ఎంత కరెక్టో అర్థమవుతుంది. అసలు అమ్మ ఆ రోజు అలా ఉండబట్టే, మేమందరం ఈ రోజు ఇలా ఉన్నామేమో. ఇప్పటికీ అమ్మ దగ్గర నుంచీ ఏదో ఒక అంశం నేర్చుకుంటూనే ఉంటాను.
 
 2-ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది అన్నయ్యను చూసి తెలుసుకున్నాను!


 అన్నయ్య అంటే నాకు మరో అమ్మ కింద లెక్క! అంత కేరింగ్ తనది. తను పక్కనుంటే కొండంత భరోసాగా అనిపిస్తుంది. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ అన్నయ్య నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అన్నయ్యలో ఉండే జిజ్ఞాస చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఏదైనా కొత్త విషయం తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి తనెంతో కుతూహలం కనబరుస్తారు. పుస్తకాలు అయితే ఎప్పుడు ఖాళీ దొరికినా చదువుతారు. మాకూ అదే అలవాటు వచ్చింది. అసలు సినిమాల్లో ఎలా పాడాలో ఆ ఒడుపులన్నీ అన్నయ్య వల్లే చిక్కాయి నాకు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తీరు, మనుషులతో ప్రవర్తించే పద్ధతి, కెరీర్‌ని మలుచుకున్న విధానం, ముఖ్యంగా టైమ్ మేనేజ్‌మెంట్... ఇవన్నీ అన్నయ్యను చూసే నేర్చుకున్నాను.
 
 3-చిన్నా పెద్దా అందర్నీ ఒకేలా గౌరవించడం ఆయన నుంచే నేర్చుకున్నాను!


 అప్పట్లో చెన్నైలోని పాండీ బజార్‌లో ఓ చెట్టు కింద కూర్చుని ఓ పెద్దాయన అందరికీ హోమియోపతి మాత్రలు ఇస్తుండేవారు.  ఆయనే డాక్టర్ గోపాలకృష్ణ. పాతతరం సినిమా వాళ్లందరికీ ఆయన బాగా తెలుసు. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌గారి భార్య జలంధరగారి ద్వారా  నాకాయన పరిచయభాగ్యం కలిగింది.  ఆయనలోని గొప్ప విషయం ఏమిటంటే... అంతపెద్ద డాక్టరయి ఉండీ, సమాజానికి తన సేవలు ఉపయోగపడాలని ప్రతి క్షణం తపించేవారు. అక్కడుండే రిక్షా వాళ్లకి, చిన్న చిన్న కార్మికులకి ఉచితంగా మందులిచ్చేవారు. ఒక్క వైద్యం అనే కాదు, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఓపిగ్గా విని, తనకు తోచిన సలహాలిచ్చేవారు. ఆయన్లో నాకు అన్నింటికన్నా నచ్చిన విషయం... చిన్నా పెద్దా అందర్నీ ఒకేలా గౌరవించడం. అదే నేను ఆయను నుంచి నేర్చుకున్నాను... సాధ్యమైనంత వరుకు పాటిస్తాను.
 
 4- నా ఆధ్యాత్మిక గురువు ఆయనే!


 కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నా ఆధ్యాత్మిక గురువు. మా నాన్నగారికి ఆయనంటే ప్రాణం! తరచుగా ఆయనను కలుస్తుండేవారు. మేమూ వెళ్తుండేవాళ్లం కానీ, అప్పట్లో ఆ తత్వాలు మాకు అర్థం కాలేదు. వయసు పెరిగే కొద్దీ ఆ ఆధ్యాత్మిక సౌందర్యం అవగతైమై, నేను కూడా ఆయన్ను గురువుగా భావించడం మొదలెట్టాను. ఆయన రాసిన పుస్తకాలు చదివితే చాలు... జీవితం తాలూకు కొత్త కోణాలు కనిపిస్తాయి. అలా నేను ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గత 20 ఏళ్లుగా ఆయన నేర్పిన ఆధ్యాత్మిక మార్గాన్నే అనుసరిస్తున్నాను.
 
 5- సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనిపించేది ఆవిడ వల్లే!


 మదర్ థెరీసా అంటే రాన్రానూ తెలీకుండానే ఒక ఇష్టం పెరిగిపోయింది. మంచి వయసులో ఉన్నప్పుడే సర్వం వదిలేసుకుని సేవామార్గాన్ని ఎంచుకోవడమంటే మాటలు కాదు. అందుకే ఆవిణ్ణి ప్రపంచమంతా దేవతలా పూజిస్తుంది. మదర్ థెరీసాను గుర్తు చేసుకున్నప్పుడల్లా సమాజానికి మనం కూడా ఎంతో కొంత సేవ చేయాలనిపిస్తుంది.
 
 - పులగం చిన్నారాయణ

 
 రెండు కథలు రాశా...

 నాకు పాటలు ఒక ప్రపంచమైతే, పుస్తకాలు ఇంకో ప్రపంచం. ఆ పుస్తక ప్రపంచంలోకి అడుగుపెడితే వెనక్కు రావాలనిపించదు. ఇదంతా మొదట మా నాన్నగారి చలవే. హరికథలు చెబుతూ బిజీగా ఉండే రోజుల్లో కూడా ఆయన ఏమాత్రం ఖాళీ దొరికినా పుస్తకాలు చదివేవారు. ఆయన పోయాక లైబ్రరీ మొత్తం నేనే తీసుకున్నాను. ఇప్పటికీ పుస్తకాలు బాగా కొంటుంటాను. మంచి పుస్తకం అనిపిస్తే, అయిదు కాపీలు కొని, ముఖ్యులకి బహుమతిగా ఇస్తుంటాను.
 
అప్పుడూ... ఇప్పుడూ... ఎప్పుడూ!

మాలతీ చందూర్‌గారి ‘భూమిపుత్రి’ నవల నాకు చాలా ఇష్టమైన నవల. ఎన్నిసార్లు చదివినా ఏదో ఒక స్ఫూర్తినిచ్చే అంశం గోచరిస్తూనే ఉంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ ‘పర్ణశాల’ నవల కూడా ఎక్కువసార్లే చదివాను. అలాగే కొడవటిగంటి కుటుంబరావుగారి ‘చదువు’ కూడా. ఎన్నో ఏళ్ల క్రితం ఆయన రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ సమాజానికీ కనెక్టవుతుంది. నాకు తెలిసి ఇంకో 50 ఏళ్ల తర్వాత కూడా అలాగే అనిపిస్తుంది. అదీ ఆ పుస్తకంలోని ప్రత్యేకత! శ్రీపాదవారి, విశ్వనాథ సత్యనారాయణగారి రచనలూ అంతే... ఎప్పటికీ పాతబడవు! ఇంగ్లీషులో అయాన్‌ర్యాండ్ రాసిన ‘ఫౌంటెన్‌హెడ్’ నవల కూడా ఎప్పుడు చదివినా కొత్తగా అనిపిస్తుంది. రాబిన్‌శర్మ పుస్తకాలు కూడా బాగా చదువుతాను.
 
చదవడమే కాదు... కొంచెంగా రాస్తాను కూడా!
 
ఎప్పుడో టీనేజ్‌లో ఉన్నప్పుడు రెండు కథలు రాశాను. ఆ రెండూ ‘వనిత’ మాసపత్రికలో ప్రచురితమయ్యాయి. నా చుట్టూ ఉండే వ్యక్తుల ప్రవర్తన, అనుభవాలతో ఆ కథలు రాశాను. మళ్లీ ఎప్పుడూ రాయలేదు కూడా. అలాగే కొడవటిగంటి కుటుంబరావుగారి కథలపై ‘వనిత’లో సమీక్ష కూడా రాశాను.  ఇప్పటికీ నా మనసు స్పందించినపుడు చిన్న చిన్న కవితలు రాస్తుంటాను. అలాగని నేను రచయిత్రిని కాదు. (నవ్వుతూ) ‘ఈ రోజు చందమామ బాగున్నాడు, వెన్నెల బాగుంది...’ ఇలాంటి ఫీలింగ్స్‌తో చిన్న చిన్న కవితలు రాస్తుంటాను. అయినా నాకు రాయడం కన్నా చదవడమంటేనే ఆసక్తి!
 
ప్రస్తుతం ఇవి నన్ను బిజీగా ఉంచుతున్నాయి...
 
మనకు ఒక్కో స్టేజ్‌లో ఒక్కో అంశం రుచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మికం! లిండా గుడ్‌మెన్ రాసిన కొత్త పుస్తకం ఇటీవలే కొన్నాను. ఆధ్యాత్మికంగా మీరు చిరంజీవత్వం సంపాదించుకోవచ్చనేది ఆ పుస్తక సారాంశం. మొన్నీమధ్యనే తిరుపతి బుక్ ఫెస్టివల్‌లో ఆచంట జానకిరామ్‌గారి ‘నా స్మృతిపథంలో’ పుస్తకం కొన్నా. ప్రస్తుతం అది కూడా చదువుతున్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement