ఓ బంధం... ఓ పుస్తకం... ఓ ప్రదేశం... ఓ సంఘటన... ఓ పాట...
తన జీవితాన్ని ఎలా మలుపు తిప్పాయో, ఎంతలా రీచార్జ్ చేశాయో...
నాని తన మనసుని ఇలా ఆవిష్కరిస్తున్నారు...
అంత మంచి మనిషిని ఇప్పటివరకూ నా జీవితంలో చూడలేదు
నా బలం మా అమ్మే (పేరు విజయలక్ష్మి). షూటింగ్స్ నుంచి ఎంత ఆలస్యంగా ఇంటికెళ్లినా, భోజనం చేసేవరకు ఊరుకోదు. నేనేమో తనని కనీసం ‘తిన్నావా’ అని కూడా అడగను. నేను చేసే సినిమాలు, నా సంపాదన, జయాపజయాలు.. ఇవేవీ తనకు ముఖ్యం కాదు. గంటకోసారి ఫోన్ చేసి, ‘తిన్నావా’ అని అడుగుతుంది. వర్క్‌లో పడిపోయి ఒక్కోసారి తన ఫోన్ కూడా తియ్యను. ఒకవేళ తీసినా చిరాకుపడతాను. నా బాగోగులు పట్టించుకునే తనని నేనస్సలు పట్టించుకోను. కానీ, మనసులో మాత్రం ‘మన వెనకాల అమ్మ అనే శక్తి ఉంది’ అనే నమ్మకం, భద్రతాభావం మాత్రం నాలో ఉంటుంది. మా అమ్మ ఎంత మంచిదంటే, అంజూని తన కోడలిలా కాకుండా కూతురిలా చూసుకుంటుంది. కేవలం ఇంట్లో వాళ్లతోనే కాదు... ఇతరులతో కూడా అమ్మ కలివిడిగా ఉంటుంది. పనివాళ్లను కూడా బాగా చూసుకుంటుంది. మంచి చేస్తే స్వర్గానికి, చెడు చేస్తే నరకానికి వెళతాం అంటారు. మనందరం ఏదో సందర్భంలో అబద్ధాలాడతాం. తప్పులు చేస్తాం. అందుకని, ఎవరూ లేక స్వర్గం తుప్పు పట్టిపోయిందేమో అనిపిస్తోంది. కానీ, స్వర్గానికి వెళ్లగల అర్హత ఉన్న వ్యక్తి మా అమ్మ. ఎందుకంటే, మా అమ్మ అబద్ధం చెప్పడం, నెగటివ్‌గా మాట్లాడటం, తప్పు చేయడం ఇప్పటివరకూ నేను చూడలేదు. అంత మంచి మనిషిని ఇప్పటివరకూ నా జీవితంలో చూడలేదు. చిన్నప్పట్నుంచీ తన దగ్గర పెరిగినందువల్ల, తనలో ఉన్న కొన్ని మంచి గుణాలు నాకూ వచ్చాయి. అది నా అదృష్టం. కానీ, పూర్తిగా అమ్మలా ఉండాలని అనుకున్నా అది నా వల్ల కాదు.
సినిమాల మీద నాకు మమకారం ఏర్పడటానికి ఒక కారణం ఆ పుస్తకమే
పుస్తకం చదవడం మొదలుపెడితే నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అందుకే చదవను. ఈ కారణంగానే చదువులో నాకు అత్తెసరు మార్కులు వచ్చేవి. కానీ, చిన్నప్పుడు నన్ను ప్రభావితం చేసిన పుస్తకం ఒకటుంది. దాని పేరు ‘టింకిల్ డెజైస్ట్’. అదొక్కటే చదివేవాణ్ణి. ఆ పుస్తకంలోని కథల్లో ఒక్కో పాత్ర తాలూకు బొమ్మ, సంభాషణలు ఉంటాయి. పిల్లలు పంపించిన కథలను అందులో ప్రచురించేవారు. ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి చదివే పిల్లలు ఎక్కువగా రాసేవాళ్లు. ఆ కథలు చదువుతూ, వాటిని విజువలైజ్ చేసుకునేవాణ్ణి. అది ఎంతవరకు డెవలప్ అయ్యిందంటే, ఎవరైనా ఏదైనా సంఘటన గురించి చెబితే, వెంటనే దాన్ని విజువలైజ్ చేసుకోవడం మొదలుపెట్టేస్తాను. చివరికి ఎక్కడో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగిందని వింటే, ‘ఇలా జరిగి ఉంటుందేమో’ అని విజువల్‌గా ఊహించేసుకుంటా. బేసిక్‌గా సినిమాల మీద నాకు మమకారం ఏర్పడటానికి ఒక కారణం ఆ పుస్తకమే. ఏదైనా కథ విన్నప్పుడు, వెంటనే తెరపై ఇలా ఉంటుందని ఊహించేసుకోవడం కూడా టింకిల్ డెజైస్ట్ వల్లే సాధ్యపడింది.
ఆ ప్లేస్‌కి వెళ్లగానే ఫుల్ రీచార్జ్ అయిపోతాను
తిరుమలతో నాదో ప్రత్యేకమైన అనుబంధం. పైకి నేను భక్తుడిలా కనిపించను కానీ, తిరుమలలో నన్ను చూసినవాళ్లు పరమభక్తుడనుకుంటారు. గర్భగుడిలో నిలబడ్డప్పుడు నిజంగానే దేవుడి ముందు నిలబడినట్లుగా భావిస్తాను. తిరుమల ప్రయాణం అనుకోగానే ఏమేం అడగాలి? ఏ విషయంలో సారీ చెప్పాలి? ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? అని ఓ లిస్టు రాసుకుంటాను. తీరా దేవుడి ముందు నిలబడగానే అన్నీ మర్చిపోతాను. బయటికి రాగానే ‘అయ్యో చెప్పలేదే’ అనుకుంటాను. చిన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్లేవాళ్లం. ఇప్పుడు మాత్రం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళుతున్నాను. ఎప్పుడు వెళ్లినా నడిచే వెళతాను. ఆ మధ్య నేను, నా భార్య అంజు కూడా కాలినడకన వెళ్లాం. తిరుమలలో ఉంటే ఓ స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది. వెళ్లి రాగానే, ఏదో భారం దిగినట్లుగా అనిపిస్తుంది. ఫుల్‌గా రీచార్జ్ అయిపోతా.
ఆ పాట నన్ను ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది
నన్ను ఎప్పటికీ వెంటాడే పాట ఒకటుంది. ఆ పాట పెట్టుకుంటే చాలు ‘ఆడపిల్లల పాట ఇష్టపడుతున్నావ్’ అంటూ ఫ్రెండ్స్ ఏడిపించేవాళ్లు. ‘సీతారామయ్యగారి మనవరాలు’లో ‘కలికి చిలకల కొలికి..’ అనే పాట అది. అద్భుతంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో ఉండే అనుబంధం గురించి చెప్పే పాట కాబట్టి నాకిష్టం. ఆ పాట వింటుంటే, ఫంక్షన్‌కి వెళ్లినట్లుగా, పండగ చేసుకుంటున్నట్లుగా, బంధువులందరితో కలిసి ఉన్నట్లుగా నాకనిపిస్తుంది. ఆ పాటకు కీరవాణిగారి ట్యూన్, వేటూరిగారి సాహిత్యం, చిత్రగారి గాత్రం అద్భుతం.
చిన్న విషయాలకు పెద్దగా రియాక్ట్ కాకూడదనే పాఠం నేర్పింది
‘రైడ్’ సినిమా విడుదలైన నాలుగో రోజు... నేను, నా స్నేహితులు ప్రయాణం చేస్తున్న వాహనాన్ని హైవేలో ఓ లారీ ఢీ కొంది. అంతా పోయారనే అనుకున్నారు. కానీ బతికి బయటపడ్డాం. కొద్ది స్పృహతోటే అంబులెన్స్‌కి ఫోన్ చేశాం. రాగానే, అందులో ఎక్కాం. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మాకే వచ్చినట్లుగా తెగ ఫీలైపోయాం. అంబులెన్స్ వెళుతుంటే, హఠాత్తుగా ఓ పెద్ద శబ్దం. ఏంటని చూస్తే, ఓ పెళ్లి బృందం ప్రయాణం చేస్తున్న వాహనం మరో వాహనాన్ని ఢీ కొంది. ముందు వరుసలో కూర్చున్నవాళ్లు స్పాట్ డెడ్. మా అంబులెన్స్‌కి 50 అడుగుల దూరంలో ఆ ప్రమాదం జరిగింది. అందులో చిన్నపిల్లలు, పెద్దవాళ్లు ఉన్నారు. మా అంబులెన్స్ డ్రైవర్ ‘సార్.. వాళ్లని కూడా ఆస్పత్రికి తీసుకెళాల్లి’ అంటే ‘ఓకే’ అన్నాం. అందర్నీ మా వాహనంలోకి ఎక్కించారు. ఇరుక్కుని కూర్చున్నాం. నొప్పి తట్టుకోలేక పిల్లలు ఏడుస్తుంటే, వాళ్లని ఓదార్చే పరిస్థితిలో పెద్దలు లేరు. ఆస్పత్రికి చేరుకోవడానికి పట్టిన ఆ అరగంటలో నేను ప్రత్యక్ష నరకం చూశాను. వాళ్ల నొప్పి చూడలేక, ఏమీ చేయలేక బాధపడ్డాను. ఆ సంఘటన నాకో కనువిప్పు అయ్యింది. ‘జీవితంలో చిన్న చిన్న విషయాలకే పెద్దగా ఫీలైపోతుంటాం. కానీ, జీవితమే నరకం అనే స్థాయిలో కొంతమందికి ప్రమాదాలు జరుగుతుంటాయి.. సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఇకనుంచి చిన్న విషయాలకు పెద్దగా రియాక్ట్’ కాకూడదని ఆ సంఘటన నాకు పాఠం నేర్పింది.
- డి.జి. భవాని