వరల్డ్‌ మ్యూజిక్‌ డే.. టాప్‌ 10 పాటల్ని గుర్తుచేసుకుందామా | World Music Day 2023 Top 10 Telugu Songs | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ మ్యూజిక్‌ డే.. టాప్‌ 10 పాటల్ని గుర్తుచేసుకుందామా

Published Wed, Jun 21 2023 10:26 AM | Last Updated on Wed, Jun 21 2023 11:15 AM

World Music Day 2023 Top 10 Telugu Songs - Sakshi

ఎండలు మండితే పాటలు ఓదార్పు. తొలకరి కురిస్తే పాటలు కాఫీకి తోడు.చలి చక్కిలిగిలి పెడితే పాటే కదా వెచ్చటి రగ్గు.సంగీతమూ సినిమా పాట లేకుండా జీవితం సాగేది ఎలా. నేడు వరల్డ్‌ మ్యూజిక్‌ డే. రావు బాల సరస్వతి, పి.లీల, జిక్కి,భానుమతి రామకృష్ణ, పి.సుశీల, ఎస్‌.జానకి,ఎల్‌.ఆర్‌.ఈశ్వరి, వాణి జయరాం, శైలజ, చిత్ర...వీరంతా మన సినీ కోయిలలుగా మన జీవన సందర్భాలను సంగీతమయం చేశారు.నేడు వీరి పాటలను తలుచుకోవడం మన విధి.వీరికి చేరేలా కృతజ్ఞత ప్రకటించడం మన సంతోషం.

నేడు వరల్డ్‌ మ్యూజిక్‌ డే

తానే మారెనా గుణమ్మే మారెనా
దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనా...

రావు బాలసరస్వతి గొంతు మంచురాలిన దారిలో హంస నడకలా ఉంటుంది. నటీనటులే పాటలు పాడుకోవాలి అనుకునే రోజుల్లో ఆమె దాదాపుగా మన తొలి ఫిమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌. సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఆమె పాటలు రెక్కలు విప్పాయి. సువాసనలు చిమ్మాయి. ఆమె తన సినిమా కెరీర్‌ను కొనసాగించి ఉంటే లతా అంతటి గాయనిగా గుర్తింపు పొందేది. ఆమె మనకు పంచిన అమృతం తక్కువ. కాని దాని రుచి ఎంతో మక్కువ.

తెల్లవార వచ్చె తెలియక నాసామీ
మళ్లీ పరుండేవు లేరా...

అప్రయత్నంగా వీచే గాలిలా, అనాయాసంగా తాకే ‘మళయ’మారుతంలా ఉంటుంది పి.లీల గొంతు. తెలుగు ఆమె మాతృభాష కాదు. కాని ప్రతి తెలుగు గృహిణి నాలుక మీద ఆమె పాట చర్విత చరణం అయ్యింది.‘సడిచేయకోగాలి సడి చేయబోకే’, ‘ఓహో మేఘమాల.. నీలాల మేఘ మాల’, ‘కలనైనా నీ వలపే... కలవరమందైన నీ తలపే’... పి.లీల సంగీతలీల అద్భుతం. 

ఏరువాక సాగారో రన్నో చిన్నన్న
నీ కష్టమంతా తీరెనురో రన్నో చిన్నన్న

తెలుగు పాటల్లో తన ఏరువాకతో కొత్త నారును వేసి సమృద్ధికర పైరును శ్రోతలకు అందించిన గాయని జిక్కి. పిట్ట కొంచమే. కూత పది వర్ణాల పింఛమే. అల్లరి పాటైనా ఆర్ద్ర గీతమైనా జిక్కి చేత చిక్కిందంటే హిట్‌. ‘ఛాంగురే బంగారు రాజా’, ‘పులకించని మది పులకించు’... ఆమెకు శ్రీలంకలో కూడా ఫ్యాన్స్‌ ఉండేవారు. అందమైన పాటలు పాడి ‘జీవితమే సఫలము’ చేసుకున్న ప్రియమైన గాయని జిక్కి.


 

ఓహోహోహో పావురమా
ఓ... ఓహోహో పావురమా
వెరపేలే పావురమా
ఓహోహో ఓహో పావురమా

ఈ పావురం డేగల్ని కూడా వేటాడగలదు. భానుమతి రామకృష్ణ సకల కళావల్లభురాలు. నాటి తెలుగు మహిళలకు పెద్ద ధైర్యం. ఇండస్ట్రీలో గొప్ప తెగువ. అలాంటి గొంతు, ఆ పాట తీరు రిపీట్‌ కాలేవు. కాబోవు. ‘ఎందుకే నీకింత తొందర’, ‘నేనే రాధనోయి’, ‘సావిరహే తవదీన’... ఎన్ని పాటలని. ఇక ‘మల్లీశ్వరి’ ఆమె ప్రతి పాట గండుమల్లె, రెక్కమల్లె. ‘మనసున మల్లెల మాలలూగెనే’..

ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ
ముత్తయిదు కుంకుమ బతుకెంతొ ఛాయ

తెలుగు పాటకు వంద సంవత్సరాల ఛాయను తెచ్చింది సుశీల. ఆమె రాకతో నటిని, గాయనిని దృష్టిలో పెట్టుకోకుండా ΄ాటకు అవసరమైన రేంజ్‌తో బాణీ కట్టడం మొదలెట్టారు సంగీత దర్శకులు. సుశీల ΄ాటలో నిష్ఠ ఉంటుంది. క్రమశిక్షణ ఉంటుంది. శ్రేష్టమైన ఉచ్చారణ. నూరుశాతం కచ్చితత్వం. ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’, ‘జోరుమీదున్నావు తుమ్మెదా’, ‘ఇది మల్లెల వేళయనీ’... ఈ కెరటాలకు అంతులేదు. ఈ గాన సముద్రానికి ఉప్పదనం లేదు. అమృత సాగరం.


 



నీలిమేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునేవేళా 

నూనె రాసి గట్టిగా బిగించి కట్టిన జడది అందమే. అది సుశీలమ్మ పౠటది. తల స్నానం చేసి వదులుగా వదిలన ముంగురులదీ అందమే. అది జానకమ్మ పౠటది. తెలుగు ΄ాట ఊపిరి పీల్చుకోవడానికి తెరిచిన పెద్ద గవాక్షం జానకి. తల్లిదండ్రులను చనువుగా ఒకమాటనగల చిన్న కూతురిలా ఉంటుందామె పాట. సరదా. హుషారు. అద్దంలో ఇమడగల కొండంత ప్రతిభ. ‘పగలే వెన్నెల’, ‘మనసా తుళ్లి పడకే’, ‘అందమైన లోకమని రంగురంగులున్నాయనీ’... ఇక నాదస్వరం ఎదుట పడగ ఎత్తి నిలిచిన పాట ‘నీలీల పాడెద దేవా’...

మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు
మాగమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడు
ఆగేదెట్టాగ అందాక ఏగేదెట్టాగ

గజ్జె కట్టి, బిగుతు దుస్తులు ధరించి, స్టేజ్‌ ఎక్కి జానపద శృంగారం ఒలికించిన ΄ాట ఎల్‌.ఆర్‌. ఈశ్వరిది. ఊరంటే గుళ్లు, ఇళ్లు మాత్రమే కాదు.. పొలాలుంటాయి.. మంచెలూ ఉంటాయి. ‘మసక మసక చీకటిలో’, ‘నందామయా గురుడ నందామయా’, ‘తీస్కో కోకకోలా’... ప్రతి పాటా సంపెంగ పొదలో పూసిన పువ్వు.అది మగాళ్లని ‘బలేబలే మగాడివోయ్‌’ 
చేసింది.

విధి చేయు వింతలన్ని మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కథలు ఎన్నో

వాణి జయరామ్‌ది పక్కింట్లో నుంచి వినిపించే పరిచిత గీతంలా ఉంటుంది. అదే సమయంలో దానికో వ్యక్తిత్వం ఉంటుంది. వాణి జయరామ్‌ పాటల మీద జోకులేయలేం. గౌరవించడం ప్రేమించడం తప్ప. ‘పూజలు సేయ పూలు తెచ్చాను’, ‘నేనా పాడనా పాట... మీరా అన్నదా మాట’, ‘ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ’... అద్భుతం.

లాలు దర్వాజ్‌ లష్కర్‌ బోనాల్‌కొస్తనని రాకపోతివి
లక్డీకాపూలు పోరికి రబ్బరు గాజులు 
   తెస్తనని తేకపోతివి

ఎస్‌.పి.శైలజ పాటను ఒక పల్లవి ఒక చరణం వరకే అనుమతించింది తెలుగు పరిశ్రమ. ప్రతిసారి మైక్‌ అందలేదు. అందినప్పుడు ఆమె గొంతులో అందం దాగలేదు. ‘మాటే మంత్రము’, ‘నాంపల్లి టేషన్‌కాడి’, ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’... ఆమె పాట, మాట రెండూ మృదురమే.

రానేల వసంతాలె శృతి కానెల సరాగాలే
నీవే జీవన రాగం... స్వరాల బంధం

చిత్ర రాకతో మళ్లీ తెలుగు పాటకు టీనేజ్‌ వచ్చింది. కొత్త తరానికి ΄ాటను అందించింది చిత్ర. కాలేజీకెళ్లే అమ్మాయిలు ‘తెలుసా మనసా’ అని... ‘కన్నానులే కలలు’ అని... ‘ఎన్నెన్నో అందాలు’ అని పాడుకున్నారు. ‘మనసున ఉన్నది చె΄్పాలనున్నది’ అని కూనిరాగం తీసుకున్నారు. మన గాయనులు మనకు బుట్టల కొద్ది పాటలు పంచినందుకు కృతజ్ఞతలు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement