
కార్లా సోఫియా గాస్కాన్... ఆస్కార్ నామినేషన్స్‌లో మొట్టమొదటి ట్రాన్స్‌గా స్థానం దక్కించుకొని, చరిత్ర సృష్టించింది. మ్యూజికల్ క్రైమ్ ఫిల్మ్ ‘ఎమీలీయా పెరెజ్’ చిత్రంలో టైటిల్ క్యారెక్టర్ పోషించి, ఉత్తమ నటిగా కార్లా ఆస్కార్‌కు ఎన్నికైంది. మొత్తం ప్రపంచ చలన చిత్ర పరిశ్రమనే తనవైపు తిప్పుకున్న, కార్లా పుట్టింది స్పెయిన్‌లోని ఆల్కోబెండాస్‌లో. పదహారేళ్ల వయసులో నటుడిగా ఎంట్రీ ఇచ్చి, లండన్‌లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని నటిగా మారింది.
హాస్య చిత్రం ‘ది నోబుల్ ఫ్యామిలీ’ విజయంతో ఇక వెనుతిరిగి చూడలేదు. వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఎప్పటికప్పుడు తన సత్తా చాటుతూనే ఉంది. 2024లో విడుదలైన ‘ఎమిలియా పెరెజ్’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలతో పాటు, ఉత్తమ నటిగా ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు’, ‘యూరోపియన్ ఫిల్మ్ అవార్డు’లను సాధించింది. ఇప్పుడు ఇదే సినిమాకు ఆస్కార్ బరిలోనూ నిలిచింది. అయితే, కాలం మారినా, సమాజం మారలేదు అన్నట్లు సోషల్ మీడియాలో ‘ఆమె ‘ఉత్తమ నటి’ లేదా ‘ఉత్తమ నటుడు’గా నామినేట్ చేశారో తెలియటం లేదు’ అని ప్రశ్నించిన ఒక అభిమానికి కార్లా ‘‘మేడమ్, నేను నటిని! సినిమాల్లో రాక్షసుడిగా, కుక్కగా ఇలా ఏ పాత్రలో నటించినా, నేను ‘నటి’గానే నామినేట్ అవుతాను’’ అని స్పందించింది.