trans co
-
‘అపోహ వద్దు.. రెండు నెలల బిల్లులు విడిగానే’
సాక్షి, విజయవాడ: మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులపై అదనంగా వసూలు చేసే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రెండు నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులు కలిపి ఇస్తారనే అపోహలో చాలా మంది ప్రజలు ఉన్నారన్నారు. అయితే దానిపై ఎలాంటి గందరగోళం లేదని, రెండు బిల్లులు విడివిడిగా లెక్క కట్టామని ఆయన స్పష్టం చేశారు. గత అయిదేళ్లుగా మార్చిలో 46 శాతం వినియోగం, ఏప్రిల్‌లో నెలలో 54 శాతం వినియోగం ఉంటుందని, అందుకే ఏప్రిల్‌లో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు తెలిపారు. (‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ బాటలోనే’ ) ఇక రెండు నెలలకు 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వడంతో స్లాబ్ మారే అవకాశం లేదన్నారు. ఏప్రిల్‌లో అదనంగా వచ్చిన యూనిట్లను మార్చిలో కలిపామని, మార్చి కి, ఏప్రిల్‌కు బిల్లులు విడివిడిగా ఎస్ఎంఎస్లు పంపుతామని చెప్పారు. మార్చి నెలకు సంబంధించిన గత సంవత్సరం టారీఫ్ ఏప్రిల్ నెలకు సంబంధించిన కొత్త టారీఫ్ ప్రకారం బిల్లులు పెట్టామని వెల్లడించారు. వినియోగదారులకు అనుకూలంగానే బిల్లింగ్ చేయడం జరిగిందని, ఎక్కడ ఒక్క యూనిట్ కూడా అదనంగా బిల్లింగ్ జరగలేదని తెలిపారు. కాగా లాక్ డౌన్ నేపథ్యంలో గృహ వినియోగం పెరిగిందని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ఇక ప్రజలకు బిల్లులపై ఏమైనా అపోహాలు ఉంటే 1912కి డయల్ చేసి చేసి ఫిర్యాదు చేయాలని శ్రీకాంత్ సూచించారు. (వైరల్ ట్వీట్: ముంబై పోలీసులపై ప్రశంసలు) -
పవన విద్యుత్ కొనుగోలుతో నష్టాలే
పవన విద్యుత్ కొనుగోలు వల్ల డిస్కంలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3.50 చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు అవసరమైన లైన్లు వేయడానికి డిస్కంలు అప్పులు చేసి, వడ్డీలు కట్టాల్సి వస్తోందని, చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతోందని కేంద్రానికి తెలపాలని నిర్ణయించాయి. సాక్షి, అమరావతి: యూనిట్ రూ.2కే లభించే కరెంటును వదిలేసి, రూ.6.04 చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటే అది ఎంత నష్టదాయకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన విద్యుత్(విండ్ పవర్) కొనుగోలు వ్యవహారంలో అక్షరాలా ఇదే జరుగుతోంది. పవన విద్యుత్‌కు పెద్దపీట వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) భారీగా నష్టపోతున్నాయని కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించాయి. పవన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సి వస్తే రాష్ట్ర డిస్కంలకు కేంద్రం పరిహారం చెల్లించాల్సిందేనని గట్టిగా డిమాండ్ చేయాలని భావిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల(సదరన్) జోనల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 27వ తేదీన చెన్నైలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పవన విద్యుత్ కొనుగోలు షరతుపైనే ప్రధానంగా చర్చించాలని కౌన్సిల్ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన 11 అంశాల అజెండాను ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాలకు పంపింది. ఈ ఎజెండాతో ఏపీ ఇంధన శాఖ పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి చెప్పారు. పవన విద్యుత్‌పై కమిటీ సమావేశంలో చర్చించి, తీర్మానాన్ని కేంద్రానికి పంపేందుకు అన్ని విధాలా తోడ్పాటునిస్తామని స్పష్టం చేశారు. ఒక్కో యూనిట్ ధర రూ.6.04 దేశంలో పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రతిఏటా పెంచాలని కేంద్రం 2015లో నిర్ణయించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాలు కూడా పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఏపీలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇండియన్ ఎనర్జీ ఎక్ఛ్సేంజ్ లెక్కల ప్రకా>రం బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ రూ.2 లోపే లభిస్తోంది. కానీ ముందే కుదుర్చుకున్న పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) కారణంగా పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ట్రాన్స్‌కో పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్లు కూడా అవసరమైన మేర వేయలేకపోయింది. దీంతో పూర్తిస్థాయిలో ట్రాన్స్మిషన్ లైన్లు లేకుండానే పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఫలితంగా సబ్ స్టేషన్లపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు రాష్ట్ర వినియోగంలో 21 శాతం సంప్రదాయేతర ఇంధన వనరులుంటున్నాయి. మార్కెట్లో యూనిట్ రూ.2కే లభించే విద్యుత్‌ను పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా తీసుకోలేకపోతున్నారు. మరోవైపు యూనిట్ రూ.4.20కే లభించే థర్మల్ విద్యుత్‌ను కూడా ఆపేయాల్సి వస్తోంది. పైగా పీపీఏలున్న పవన విద్యుత్ కేంద్రాలకు యూనిట్‌కు రూ.1.20 చొప్పున ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పవన విద్యుత్ ధర యూనిట్‌కు ఏకంగా రూ.6.04 వరకూ పడుతోంది. రూ.2కే లభించే విద్యుత్‌తో పోలిస్తే దాదాపు ఇది రూ.4 అదనం కావడం గమనార్హం. -
ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం
-
విద్యుత్ వినియోగంలో కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ వినియోగంలో రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 7.33 గంటల సమయంలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,429 మెగావాట్లకు ఎగబాకి గత మార్చి 8న నమోదైన 10,284 మెగావాట్ల పాత రికార్డును చెరిపేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. దీనిపై మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ సౌధలో మీడియాతో మాట్లాడారు. విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోవడం రాష్ట్ర అభివృద్ధికి సూచిక అని అభివర్ణించారు. విద్యుత్ డిమాండ్ 12,500 మెగావాట్లకు పెరిగిన సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సంసిద్ధతతో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతిమాట నిజమవుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ గరిష్ట డిమాండ్ 6,660 మెగావాట్లు మాత్రమే ఉన్నా, అప్పట్లో అవసరాలకు సరిపడా విద్యుత్ లేక కోతలు విధించాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే కోతలను అధిగమించామని చెప్పారు. పవన, సౌర విద్యుత్‌కు మళ్లీ టెండర్లు లేవు.. నిబంధనల ప్రకారమే ప్రైవేటు సౌర, థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గాయని, మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పుడు టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న డెవలపర్లు గడువులోగా సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకపోయినా, రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఉన్నా మళ్లీ అవే ధరలతో గడువు పెంచారని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి బదులిస్తూ ఈ అంశం ఈఆర్సీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల కోసం మళ్లీ టెండర్లు నిర్వహించే యోచన లేదన్నారు. కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణం రెండు మూడేళ్లలో పూర్తి అయితే, సాగునీటి ప్రాజెక్టుల విద్యుత్ డిమాండ్ 10,852 మెగావాట్లకు పెరగనుందని ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 30 శాతం గృహాలు, 30 శాతం పరిశ్రమలు, 30 శాతం వ్యవసాయ రంగాల వాటా ఉండగా, మిగిలిన 10 శాతం వాటాను వాణిజ్య, ఇతర రంగాల వారు వినియోగించుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు అశోక్‌కుమార్, సచ్చిదానందం, రాధాకృష్ణ, వెంకటరాజం, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం: సీఎం కేసీఆర్ 10,000 మెగావాట్ల రికార్డు డిమాండ్ దాటిన సందర్భంగా జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును, విద్యుత్ సంస్థల సిబ్బందిని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభాకర్‌రావు అనుభవం తెలంగాణలో విద్యుత్ విజయాలకు అక్కరకొచ్చిందని సీఎం ప్రశంసించారు. జెన్ కో, ట్రాన్స్ కోలకు ఒకరే అధిపతిగా ఉంటే, సమన్వయం బాగుండి విద్యుత్ సరఫరా మెరుగవుతుందని తాను నమ్మానని, నేడు అదే నిజమైందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో చిమ్మచీకట్లు తప్పవనే జోస్యాలను అబద్ధమని తేల్చి.. నేడు అన్ని రంగాలకు 24 గంటల సరఫరా చేసే స్థితికి చేరడం అందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ తలసరి వినియోగం జాతీయ సగటుకన్నా 33 శాతం అధికంగా ఉండటం.. తెలంగాణ ప్రగతికి సంకేతమని చెప్పారు. తెలంగాణలో నాణ్యమైన కరెంటు 24 గంటల పాటు అందుబాటులో ఉండటం, భవిష్యత్తులోనూ కరెంటుకు ఢోకా లేదనే పరిస్థితి ఏర్పడడం వల్ల పలు పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. ఇది అంతిమంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 24 గంటల కరెంటు వల్ల వ్యవసాయ దిగుబడులు సైతం పెరుగుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలకు కావల్సిన విద్యుత్‌ను సరఫరా చేయడానికి గడువు కన్నా ముందే ఏర్పాట్లు పూర్తి చేశారని సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ మార్గదర్శకం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయన్నారు. ఖరీఫ్‌లో 11,500 గరిష్ట డిమాండ్ ఏర్పడుతుందనే అంచనా ఉందని, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. -
ఏసీబీకి పట్టుబడిన ట్రాన్స్‌కో డీఈ
విద్యుత్ శాఖలో మరో అవినీతి జలగ ఏసీబికి చిక్కింది. నల్లగొండ జిల్లా హుజూర్నగర్ ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాసరెడ్డి నుంచి మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో చారి అనే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు చేపట్టడంతోపాటు డీఈని విచారిస్తున్నారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
లేకుంటే ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయాన్ని ముట్టడిస్తా అధికారులకు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి హెచ్చరిక వాడపల్లి (ఆత్రేయపురం) : రైతులు ట్రాన్స్‌కో ద్వారా అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు త్వరితగతిన పరిష్కరించకపోతే ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడిస్తానని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హెచ్చరించారు. వాడపల్లి గ్రామంలో తమ దృష్టికి వచ్చిన విద్యుత్ సమస్యలపై ట్రాన్స్‌కో ఏఈ కృష్ణమూర్తిని నిలదీశారు. బొమ్మూరు నుంచి రావాల్సిన విద్యుత్ సరఫరా అమలాపురం నుంచి రావడం ద్వారా లోఓల్టేజ్ సమస్యతో రైతుల పంట పొలాల్లో మోటార్లు తిరగడం లేదని ఆయన సంబంధిత ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పాత విధానం ప్రకారం బొమ్మూరు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సబ్బిడీపై సోలార్ యంత్రాలను అందిస్తామని రైతుల నుంచి రూ.50 వేల చొప్పున డీడీలు తీయించారని ఇప్పటికే సోలార్ మోటార్లు అందకపోవడంతో ఏఈని నిలదీశారు. ట్రాన్స్‌కో అధికార పార్టీ నేతలకు తలొగ్గి వ్యవహరిస్తున్నారని, దీనిపై పోరాటం చేస్తానని హెచ్చరించారు. కడియపులంకలో ఉన్న నర్సరీలకు విద్యుత్ సరఫరా అందిస్తుండగా ఆలమూరు మండలంలో నర్సరీలకు నిర్ణీత సమయ వేళలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కరెంట్ కోత విధించడంపై జగ్గిరెడ్డి వండిపడ్డారు. పేరవరం ఎత్తిపోతల పథకం ద్వారా రైతులకు సక్రమంగా సాగునీరు సరఫరా సాగడం లేదన్నారు. మోటార్లు పాడై గొట్టాలకు రంధ్రాలు ఏర్పాడి నీరు వృథా పోతున్నా ఆ శాఖ అధికారులకు పట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం సభ్యులు చిలువూరి నాగరామసత్యనారాయణరాజు, పోచిరాజు బాబురావు, సర్పంచ్ కరిపోతు విమల పల్లయ్య పాల్గొన్నారు. -
మోయలేని భారం
రూ.120.23 కోట్లకు చేరిన పంచాయతీ కరెంటు బిల్లు బకాయిలు * వైఎస్సార్ హయాంలో ప్రభుత్వమే చెల్లించేది * నాలుగేళ్లుగా నిధులు నిలిపివేత * వసూళ్లకు ట్రాన్స్‌కో శ్రీకారం పాలమూరు : అరకొర నిధులతో అసలే అల్లాడుతున్న గ్రామపంచాయతీలకు వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ బిల్లుల బకాయిలు మోయలేని భారంగా మారనున్నాయి. గత నాలుగేళ్లుగా ఇందుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారం పంచాయతీలపై పడింది. ఈ నేపథ్యంలో బకాయిల వసూలు కోసం ట్రాన్స్‌కో పంచాయతీలపై ఒత్తిడి పెంచింది. పంచాయతీల ఆదాయం తక్కువగా ఉందని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అయితే వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ బిల్లులను చెల్లింపు అంశాన్ని మరుగున పడేశారు. అప్పటి నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయూయి. 2010 నుంచి గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల విద్యుత్ బిల్లులను ఎన్పీడీసీఎల్కు చెల్లించడం లేదు. గతంలో మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుండగా, మేజర్ పంచాయతీల బిల్లులను పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించేవారు. సర్పంచుల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఈ విధానం కొనసాగింది. అరుుతే తరువాత ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పంచాయతీలు భారీగా బకాయి పడ్డాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు రూ.120.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో మేజర్ పంచాయతీలకు సంబంధించి రూ.31.36 కోట్లు, 1331 మైనర్ పంచాయతీలకు గను రూ. 88.87 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. తడిసి మోపెడు జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో ఒక్కొక్కటి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా వీధి దీపాలు, రక్షిత నీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో బకాయిల వసూలు కోసం విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే పంచాయతీలకు ఇబ్బంది తప్పేలా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ బకాయిలను చెల్లించాలని పలువురు సర్పంచులు కోరుతున్నారు. -
‘లైన్’ కలెక్షన్!
శ్రీకాకుళం: చిన్నదైనా, పెద్దదైనా.. ఎంత శ్రమ తో కూడుకున్నదైనా ప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరికైనా ఆశే. అందుకోసం ఎన్ని కష్టనష్టాలైనా భరించి.. అప్పో సప్పో చేసి ముడుపులు కట్టేందకు వెనుకాడరు. రాజకీయ పలుకుబడి ఉంటే ఇక తిరుగే లేదు. సరిగ్గా ఈ అంశన్నే అక్రమార్కులు అందిపుచ్చుకున్నారు. రాత్రికి రాత్రి కార్లు వేసుకొని మరీ జిల్లా అంతా తిరిగి వసూ ళ్లు కానిచ్చేశారు. ఇంకొందరు రాజకీయ సిఫారసులతో పని చేయించుకున్నారు. వెరసి ఇటీవల విద్యుత్ శాఖ నిర్వహించిన జూనియర్ లైన్మెన్ నియామక ప్రక్రియ అక్రమాల పుట్టగా మారిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. తక్కువ మార్కులు వచ్చిన, అర్హత పరీక్ష లో విఫలమైన వారికి ఉద్యోగాలు దక్కడం, అన్ని రకాలుగా అర్హత సాధించినవారికి మొండి చెయ్యి చూపడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. ఇదే నిదర్శనం ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఒక ఉదాహరణను పరిశీలిస్తే.. బీసీ-డి కేటగిరీలో ఎస్‌కెఎల్‌జీ 472 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.33, ఎస్‌కెఎల్‌జీ 485 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.55, ఎస్‌కెఎల్‌జీ 488 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.25 శాతంతో మార్కులతో అర్హత పరీక్షకు హాజరయ్యారు. 472 నెంబర్ అభ్యర్థి స్తంభం ఎక్కడంలోనూ విఫలం కాగా.. 64.55 మార్కులతో ఉన్న అభ్యర్థి పోల్ ఎక్కడంలోనూ, మీటర్ రీడింగ్ తీయడంలోనూ, సైక్లింగ్‌లోనూ సఫలీకృతులయ్యారు. మార్కులు ఎక్కువ వచ్చి, అన్ని పోటీల్లో విజయం సాధించిన ఇతనికి ఉద్యోగం రాకపోగా అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన 472, 488 నెంబర్ల అభ్యర్థులు మాత్రం ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ట్రాన్స్‌కోలోని ఓ ఉన్నతాధికారి సిఫారసు మేరకే అనర్హులకు ఉద్యోగాలు దక్కాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటువంటి ఉదంతాలు మరిన్ని ఉన్నాయన్న వాదన కూడా విన్పిస్తోంది. కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి అధికారులు కొన్ని అక్రమాలు చేయగా, కొందరు అధికారుల ప్రమేయంతో మరికొన్ని అక్రమ ఎంపికలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. వీడియో చిత్రీకరణ ద్వారా ఈ పరీక్షలను జరిపినందున వాటిని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని పలువురు సూచిస్తున్నారు. రాత్రికి రాత్రే వసూళ్లు ఇదిలా ఉంటే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అర్ధరాత్రి వేళ విడుదల చేస్తామని అధికారులు చెప్పిన రోజున కొందరు ట్రాన్స్‌కో ఉద్యోగులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వీరికి కాస్త ముందుగానే తెలియడంతో రెండు కార్లలో జిల్లా వ్యాప్తంగా తిరిగి ఉదయానికల్లా ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు కొంత ముట్టజెప్పాలని చెప్పడంతో ఉద్యోగం వస్తుందన్న ఆశతో పలువురు అభ్యర్థులు పెద్ద మొత్తాల్లోనే చెల్లించినట్టు భోగట్టా. ఉదయం విడుదలైన జాబితాలో తమ పేర్లు ఉండడంతో తమ నుంచి డబ్బు తీసుకున్న వారి వల్లే ఉద్యోగం వచ్చిందని పలువురు అభ్యర్థులు ఆనందపడిపోయారు. వాస్తవానికి జరిగింది వేరని వారికి తెలియదు. కాగా ముందుగానే జాబితాలోని పేర్లు లీక్ చేయడం వెనుక కొందరు అధికారుల హస్తం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు పదేపదే చెప్పినా అక్రమాలు జరగడంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి లోతుగా దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. వివరాలు ఇస్తే పరిశీలిస్తాం:ఎస్ఈ ఈ విషయాన్ని ట్రాన్స్‌కో ఎస్ఈ సత్యనారాయణ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తక్కువ మార్కులు వచ్చిన వారికి, అర్హత పరీక్షల్లో విఫలమైన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటూనే, వివరాలు తనకిస్తే పరిశీలిస్తానన్నారు. జాబితా విడుదలైన ముందు రోజున వసూళ్లు జరిగినట్టు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని తెలిపారు. ఎంపికైన వారి పేర్లు ముందుగా తెలిసే అవకాశమే లేదని వేకువజామున తానే ఆన్లైన్లో పొందుపరిచానని పేర్కొన్నారు. -
తెలంగాణకే విద్యుత్ సౌధ!
ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలకు కొత్త భవనం గచ్చిబౌలిలో ఏర్పాటుకు ప్రయత్నం ఆంధ్ర ఉద్యోగుల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సౌధను మొత్తాన్ని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కోల కోసం కొత్త భవనం అద్దెకు తీసుకోనున్నట్టు తెలిసింది. ఇందుకోసం గచ్చిబౌలి ప్రాంతంలో లక్షా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కాంప్లెక్స్ కోసం ట్రాన్స్‌కో వర్గాలు వెదుకుతున్నాయి. ఇందుకోసం త్వరలో పేపర్ నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది. కాగా, దీనిపై సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌నే రెండు రాష్ట్రాలకు కేటాయించాలని కోరుతున్నారు. మొత్తం బిల్డింగ్‌ను తెలంగాణకే కేటాయించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉన్న విద్యుత్‌సౌధ బిల్డింగ్‌లోని ఆరు అంతస్తుల్లో, రెండు రాష్ట్రాలకు మూడు అంతస్తుల చొప్పున కేటాయించాలని వారు కోరుతున్నారు. దీనిపై అవసరమైతే గవర్నరును కలిసి విన్నవించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. తెలిసిన బిల్డర్ కోసమేనా? ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కోల కోసం గచ్చిబౌలి ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఒక బిల్డర్‌కు చెందిన కాంప్లెక్స్ ఉందని, సదరు బిల్డర్‌కే టెండర్ దక్కేలా చేసేందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనవాయితీగా లక్షా 50 వేల చదరపు అడుగుల కాంప్లెక్స్ గచ్చిబౌలి ప్రాంతంలో కావాలని పత్రికలో నోటిఫికేషన్ ఇచ్చి... సదరు బిల్డర్‌కు టెండర్ దక్కిందనేలా తంతు నడిపించేందుకు ట్రాన్స్‌కో వర్గాలు పావులు కదుపుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి. -
ఇక అధికారిక కోతలు
శ్రీకాకుళం : జిల్లాలో మంగళవారం నుంచి అధికారికంగా విద్యుత్ కోతలు అమలు కానున్నాయి.వాస్తవానికి ఇప్పటికే విద్యుత్ కోతలు అమలు చేస్తున్నా వాటిని అధికారులు లోడ్ రిలీఫ్‌గానే చెప్పుకొచ్చారు. కాగా అధికారికంగా కోతలు విధిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో ట్రాన్స్‌కో అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రోజుకు మూడు గంటలు, మండల, మున్సిపల్ కేంద్రాల్లో నాలుగు గంటలు చొప్పున కోత విధిస్తారు. జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి రెండు వరకు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు కోత ఉంటుంది. మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అమలు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ ఫీడర్లపై ఉన్న పరిశ్రమలకు ప్రతి శనివారం పవర్ హాలీడేగా ప్రకటించారు. వీటికి అదనంగా అత్యవసర సమయాల్లో ఎమర్జెన్జీ లోడ్ రిలీఫ్ అమలు చేస్తామని ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీవీ సత్యనారాయణ తెలిపారు. -
కోతలే కోతలిక
మీ ఇంట్లో స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు ఉన్నారా? అయితే ఇక నుంచి మీరు తెల్లవారు జామునే నిద్రలేవాలి. ఉదయం 8 గంటల్లోగా వంట పూర్తి చేసుకోవాలి. లేదంటే మీరు మళ్లీ స్కూళ్లకు క్యారియర్లు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఉదయం 8 గంటల తర్వాత మిక్సీలు తిరగవు. గ్రైండర్లు పనిచేయవు. అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : వేసవి ఆరంభంలోనే ప్రజలకు ట్రాన్స్‌కో షాక్ ఇస్తోంది. సాధారణంగా మార్చి నుంచి ఆరంభమయ్యే కరెంట్ కోతలు ఈ ఏడాది ముందస్తుగా అమలులోకి వచ్చాయి. జనవరిలో ఓ మోస్తరుగా కరెంట్ తీసిన అధికారులు ప్రస్తుతం భారీగా పెంచేశారు. జిల్లా కేంద్రంలో ఏకంగా నాలుగు గంటలు విద్యుత్ కోత విధించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మునిసిపాలిటీల్లో 6 గంటలు, మండలాల్లో 8 గంటలు కోత విధిస్తున్నారు. ఈ కోతలు శనివారం నుంచి జిల్లాలో అమల్లోకి వచ్చాయి. అనంతపురంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు, మునిసిపాలిటీల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు, మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రాన్స్‌కో అధికారులు అధికారికంగా ఈ సమయాలు ప్రకటించిన ప్పటికీ శనివారం జిల్లా కేంద్రంలో ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ తీశారు. దీంతో చిన్న పిల్లలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు చుక్కలు చూపిస్తాయని ప్రజలు వాపోతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో కరెంట్ కోతలు అనివార్యమవుతున్నాయని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు 13.8 మిలియన్ యూనిట్లు అవసరం కాగా ప్రస్తుతం 12.5 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతోందని ఆయన తెలిపారు. ఉత్పత్తి పెరిగే వరకూ కోతలు తప్పవని వివరించారు. -
పదోన్నతుల కోసం విద్యుత్ ఉద్యోగుల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో, జెన్కోలో పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ(హై-జాక్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా, జెన్కో ఎండీ విజయానంద్‌కు హై-జాక్ నేతలు గణేష్, నరసింహులు, రామకృష్ణుడు, మురళీ కృష్ణారెడ్డి సోమవారం వినతిపత్రం అందజేశారు. పదోన్నతులు ఆపాలని తెలంగాణవాదులు కోరడం సరికాదన్నారు. కాగా, ఉద్యోగులు 100వ నిరసన దినోత్సవాన్ని విద్యుత్ సౌధలో నిర్వహించారు. తెలంగాణకు 2 వేల మెగావాట్ల విద్యుత్‌లోటు ఉందని జైపాల్‌రెడ్డి అంగీకరించారని, ఈ నేపథ్యంలో విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా ఆయన సమైక్యాంధ్రను కోరుకోవాలని సూచించారు. ఢిల్లీలోనేతలను కలిసి సమైక్యాంధ్ర కోసం ప్రయత్నిస్తున్న జగన్మోహన్రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు హైజాక్ నేతలు తెలిపారు.