తెలంగాణకే విద్యుత్ సౌధ!
ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు కొత్త భవనం
గచ్చిబౌలిలో ఏర్పాటుకు ప్రయత్నం
ఆంధ్ర ఉద్యోగుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సౌధను మొత్తాన్ని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కోలకు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ జెన్‌కో, ట్రాన్స్‌కోల కోసం కొత్త భవనం అద్దెకు తీసుకోనున్నట్టు తెలిసింది. ఇందుకోసం గచ్చిబౌలి ప్రాంతంలో లక్షా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కాంప్లెక్స్ కోసం ట్రాన్స్‌కో వర్గాలు వెదుకుతున్నాయి. ఇందుకోసం త్వరలో పేపర్ నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది.
కాగా, దీనిపై సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌నే రెండు రాష్ట్రాలకు కేటాయించాలని కోరుతున్నారు. మొత్తం బిల్డింగ్‌ను తెలంగాణకే కేటాయించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉన్న విద్యుత్‌సౌధ బిల్డింగ్‌లోని ఆరు అంతస్తుల్లో, రెండు రాష్ట్రాలకు మూడు అంతస్తుల చొప్పున కేటాయించాలని వారు కోరుతున్నారు. దీనిపై అవసరమైతే గవర్నరును కలిసి విన్నవించాలని యోచిస్తున్నట్టు తెలిసింది.
తెలిసిన బిల్డర్ కోసమేనా?
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ జెన్‌కో, ట్రాన్స్‌కోల కోసం గచ్చిబౌలి ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఒక బిల్డర్‌కు చెందిన కాంప్లెక్స్ ఉందని, సదరు బిల్డర్‌కే టెండర్ దక్కేలా చేసేందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనవాయితీగా లక్షా 50 వేల చదరపు అడుగుల కాంప్లెక్స్ గచ్చిబౌలి ప్రాంతంలో కావాలని పత్రికలో నోటిఫికేషన్ ఇచ్చి... సదరు బిల్డర్‌కు టెండర్ దక్కిందనేలా తంతు నడిపించేందుకు ట్రాన్స్‌కో వర్గాలు పావులు కదుపుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి.