
సాక్షి, విజయవాడ: మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులపై అదనంగా వసూలు చేసే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్ వెల్లడించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రెండు నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులు కలిపి ఇస్తారనే అపోహలో చాలా మంది ప్రజలు ఉన్నారన్నారు. అయితే దానిపై ఎలాంటి గందరగోళం లేదని, రెండు బిల్లులు విడివిడిగా లెక్క కట్టామని ఆయన స్పష్టం చేశారు. గత అయిదేళ్లుగా మార్చిలో 46 శాతం వినియోగం, ఏప్రిల్‌లో నెలలో 54 శాతం వినియోగం ఉంటుందని, అందుకే ఏప్రిల్‌లో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కలిపినట్లు తెలిపారు. (‘ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా జగన్ బాటలోనే’ )
ఇక రెండు నెలలకు 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వడంతో స్లాబ్ మారే అవకాశం లేదన్నారు. ఏప్రిల్‌లో అదనంగా వచ్చిన యూనిట్‌లను మార్చిలో కలిపామని, మార్చి కి, ఏప్రిల్‌కు బిల్లులు విడివిడిగా ఎస్‌ఎంఎస్‌లు పంపుతామని చెప్పారు. మార్చి నెలకు సంబంధించిన గత సంవత్సరం టారీఫ్ ఏప్రిల్ నెలకు సంబంధించిన కొత్త టారీఫ్ ప్రకారం బిల్లులు పెట్టామని వెల్లడించారు. వినియోగదారులకు అనుకూలంగానే బిల్లింగ్ చేయడం జరిగిందని, ఎక్కడ ఒక్క యూనిట్ కూడా అదనంగా బిల్లింగ్ జరగలేదని తెలిపారు. కాగా లాక్ డౌన్ నేపథ్యంలో గృహ వినియోగం పెరిగిందని, సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ఇక ప్రజలకు బిల్లులపై ఏమైనా అపోహాలు ఉంటే 1912కి డయల్ చేసి చేసి ఫిర్యాదు చేయాలని శ్రీకాంత్ సూచించారు. (వైరల్ ట్వీట్: ముంబై పోలీసులపై ప్రశంసలు)
Comments
Please login to add a commentAdd a comment