new building hire
-
ఆన్లైన్.. ఆగమాగం
సాక్షి, చొప్పదండి : మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటికీ అప్‌గ్రేడ్ అయిన చొప్పదండిలో నూతన గృహ నిర్మాణదారులకు చిక్కులు తప్పడం లేదు. పురపాలన ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటికీ ఒక్క నూతన నిర్మాణానికి కూడా అనుమతి రాకపోవడం పురపాలనలో నూతన గృహ నిర్మాణదారులకు తెచ్చిన కష్టాలను తెలియజేస్తోంది. ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం పురపాలనలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన చొప్పదండిలోనూ దీన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో నూతన గృహ నిర్మాణ ఆశావహులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తులు గతంలో నూతన గృహ నిర్మాణదారులు పంచాయతీ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకొనేవారు. భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణం ప్రారంభించాక కూడా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో 2016 నుంచి ఆన్లైన్ ద్వారా నిర్మాణ అనుమతుల మంజూరు విధానం ప్రవేశపెట్టారు. నూతన నిర్మాణాలను చేపట్టేవారు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాకే నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్మాణాలను రూపొందించాలంటే ఇండ్లు కట్టడం పలువురికి గగనంగా మారింది. ఇబ్బందిగా నిబంధనలు మున్సిపల్ నూతన చట్టంలోని నిబంధనలు చిన్న స్థలాలు కలిగిన గృహ నిర్మాణదారులకు ఇబ్బందిగా పరిణమించాయి. జీవో 168 ప్రకారం మున్సిపాలిటీల్లో ఇండ్లు నిర్మాణం చేసే వారికి పలు నిబంధనలు రూపొందించారు. దీంతో గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తు చేసేందుకే రూ. పదివేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అనుమతి వచ్చేందుకు ఫీజులు ఏ మేరకు బాదుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు నిర్ధేశించిన ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణదారులకు వచ్చిన మొదటి ఇబ్బంది రోడ్ల వెడల్పుతోనే. గతంలో తొమ్మిది ఫీట్ల నుంచి మొదలుకొని పన్నెండు ఫీట్ల రోడ్లనే ఎక్కువగా గ్రామస్తులు ఉపయోగించేవారు. నిర్మాణ అనుమతుల సమయంలో రోడ్లు ముప్పై అడుగులు ఉంటేనే అనుమతి ఇస్తారు. పైగా మూడు అడుగులు సెట్ బ్యాక్ కోసం కూడా వదులాల్సి ఉంటుంది. దీంతో ఉన్న స్థలమంతా రోడ్లకే పోతే తాము ఎక్కడ నిర్మాణాలు చేయాలని చిన్న చిన్న ప్లాట్లు గల యజమానులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ నుంచి ఒక్క అనుమతి కూడా ఇవ్వకపోగా, దరఖాస్తులు మాత్రం అయిదు వరకు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ఏర్పడిన ఆరునెలల్లో ఒక్క అనుమతి కూడా బయటకు వెళ్లక పోవడంతో ఇండ్ల నిర్మాణాలు చేసేదెట్లా అంటూ నిర్మాణ ఆ శావహకులు లబోదిబో మంటున్నారు. రెండేళ్లుగా కొనసాగుతోంది రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. తమకు డిజిటల్ కీ రావడానికి ఆలస్యమైంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండటం వల్ల నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు దోహదపడుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం మేము వ్యవహరిస్తాం. – రాజేందర్ కుమార్, కమిషనర్ -
తెలంగాణకే విద్యుత్ సౌధ!
ఏపీ జెన్కో, ట్రాన్స్‌కోలకు కొత్త భవనం గచ్చిబౌలిలో ఏర్పాటుకు ప్రయత్నం ఆంధ్ర ఉద్యోగుల ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సౌధను మొత్తాన్ని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కోలకు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రాథమికంగా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కోల కోసం కొత్త భవనం అద్దెకు తీసుకోనున్నట్టు తెలిసింది. ఇందుకోసం గచ్చిబౌలి ప్రాంతంలో లక్షా 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన కాంప్లెక్స్ కోసం ట్రాన్స్‌కో వర్గాలు వెదుకుతున్నాయి. ఇందుకోసం త్వరలో పేపర్ నోటిఫికేషన్ జారీచేయనున్నట్టు తెలిసింది. కాగా, దీనిపై సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్‌నే రెండు రాష్ట్రాలకు కేటాయించాలని కోరుతున్నారు. మొత్తం బిల్డింగ్‌ను తెలంగాణకే కేటాయించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉన్న విద్యుత్‌సౌధ బిల్డింగ్‌లోని ఆరు అంతస్తుల్లో, రెండు రాష్ట్రాలకు మూడు అంతస్తుల చొప్పున కేటాయించాలని వారు కోరుతున్నారు. దీనిపై అవసరమైతే గవర్నరును కలిసి విన్నవించాలని యోచిస్తున్నట్టు తెలిసింది. తెలిసిన బిల్డర్ కోసమేనా? ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కోల కోసం గచ్చిబౌలి ప్రాంతాన్నే ఎందుకు ఎంచుకున్నారనే విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఒక బిల్డర్‌కు చెందిన కాంప్లెక్స్ ఉందని, సదరు బిల్డర్‌కే టెండర్ దక్కేలా చేసేందుకే ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆనవాయితీగా లక్షా 50 వేల చదరపు అడుగుల కాంప్లెక్స్ గచ్చిబౌలి ప్రాంతంలో కావాలని పత్రికలో నోటిఫికేషన్ ఇచ్చి... సదరు బిల్డర్‌కు టెండర్ దక్కిందనేలా తంతు నడిపించేందుకు ట్రాన్స్‌కో వర్గాలు పావులు కదుపుతున్నాయనే విమర్శలు వినవస్తున్నాయి.