‘లైన్’ కలెక్షన్! | Line Collection | Sakshi
Sakshi News home page

‘లైన్’ కలెక్షన్!

Published Sun, Aug 17 2014 2:36 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

‘లైన్’ కలెక్షన్! - Sakshi

‘లైన్’ కలెక్షన్!

 శ్రీకాకుళం: చిన్నదైనా, పెద్దదైనా.. ఎంత శ్రమ తో కూడుకున్నదైనా ప్రభుత్వ ఉద్యోగమంటే ఎవరికైనా ఆశే. అందుకోసం ఎన్ని కష్టనష్టాలైనా భరించి.. అప్పో సప్పో చేసి ముడుపులు కట్టేందకు వెనుకాడరు. రాజకీయ పలుకుబడి ఉంటే ఇక తిరుగే లేదు. సరిగ్గా ఈ అంశన్నే అక్రమార్కులు అందిపుచ్చుకున్నారు. రాత్రికి రాత్రి కార్లు వేసుకొని మరీ జిల్లా అంతా తిరిగి వసూ ళ్లు కానిచ్చేశారు. ఇంకొందరు రాజకీయ సిఫారసులతో పని చేయించుకున్నారు. వెరసి ఇటీవల విద్యుత్ శాఖ నిర్వహించిన జూనియర్ లైన్‌మెన్ నియామక ప్రక్రియ అక్రమాల పుట్టగా మారిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నా యి. తక్కువ మార్కులు వచ్చిన, అర్హత పరీక్ష లో విఫలమైన వారికి  ఉద్యోగాలు దక్కడం, అన్ని రకాలుగా అర్హత సాధించినవారికి మొండి చెయ్యి చూపడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి.
 
 ఇదే నిదర్శనం
 ఈ ఆరోపణలకు బలం చేకూర్చే ఒక ఉదాహరణను పరిశీలిస్తే.. బీసీ-డి కేటగిరీలో ఎస్‌కెఎల్‌జీ 472 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.33, ఎస్‌కెఎల్‌జీ 485 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.55, ఎస్‌కెఎల్‌జీ 488 నెంబరు కలిగిన అభ్యర్ధి 64.25 శాతంతో మార్కులతో అర్హత పరీక్షకు హాజరయ్యారు. 472 నెంబర్ అభ్యర్థి స్తంభం ఎక్కడంలోనూ విఫలం కాగా.. 64.55 మార్కులతో ఉన్న అభ్యర్థి పోల్ ఎక్కడంలోనూ, మీటర్ రీడింగ్ తీయడంలోనూ, సైక్లింగ్‌లోనూ సఫలీకృతులయ్యారు. మార్కులు ఎక్కువ వచ్చి, అన్ని పోటీల్లో విజయం సాధించిన ఇతనికి ఉద్యోగం రాకపోగా అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన 472, 488 నెంబర్ల అభ్యర్థులు మాత్రం ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ట్రాన్స్‌కోలోని ఓ ఉన్నతాధికారి సిఫారసు మేరకే అనర్హులకు ఉద్యోగాలు దక్కాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటువంటి ఉదంతాలు మరిన్ని ఉన్నాయన్న వాదన కూడా విన్పిస్తోంది. కొందరు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి అధికారులు కొన్ని అక్రమాలు చేయగా, కొందరు అధికారుల  ప్రమేయంతో మరికొన్ని అక్రమ ఎంపికలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి.  వీడియో చిత్రీకరణ  ద్వారా ఈ పరీక్షలను జరిపినందున వాటిని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని పలువురు సూచిస్తున్నారు.
 
 రాత్రికి రాత్రే వసూళ్లు
 ఇదిలా ఉంటే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను అర్ధరాత్రి వేళ విడుదల చేస్తామని అధికారులు చెప్పిన రోజున కొందరు ట్రాన్స్‌కో ఉద్యోగులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వీరికి కాస్త ముందుగానే తెలియడంతో రెండు కార్లలో జిల్లా వ్యాప్తంగా తిరిగి ఉదయానికల్లా ఉద్యోగం ఇప్పిస్తామని, అందుకు కొంత ముట్టజెప్పాలని చెప్పడంతో ఉద్యోగం వస్తుందన్న ఆశతో పలువురు అభ్యర్థులు పెద్ద మొత్తాల్లోనే చెల్లించినట్టు భోగట్టా. ఉదయం విడుదలైన జాబితాలో తమ పేర్లు ఉండడంతో తమ నుంచి డబ్బు తీసుకున్న వారి వల్లే ఉద్యోగం వచ్చిందని పలువురు అభ్యర్థులు ఆనందపడిపోయారు. వాస్తవానికి జరిగింది వేరని వారికి తెలియదు. కాగా ముందుగానే జాబితాలోని పేర్లు లీక్ చేయడం వెనుక కొందరు అధికారుల హస్తం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులు పదేపదే చెప్పినా అక్రమాలు జరగడంపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి లోతుగా దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
 
 వివరాలు ఇస్తే పరిశీలిస్తాం:ఎస్‌ఈ
 ఈ విషయాన్ని ట్రాన్స్‌కో ఎస్‌ఈ సత్యనారాయణ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తక్కువ మార్కులు వచ్చిన వారికి, అర్హత పరీక్షల్లో విఫలమైన వారికి ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటూనే, వివరాలు తనకిస్తే పరిశీలిస్తానన్నారు. జాబితా విడుదలైన ముందు రోజున వసూళ్లు జరిగినట్టు తన దృష్టికి రాలేదన్నారు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపిస్తామని తెలిపారు. ఎంపికైన వారి పేర్లు ముందుగా తెలిసే అవకాశమే లేదని వేకువజామున తానే ఆన్‌లైన్‌లో పొందుపరిచానని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement