మోయలేని భారం
రూ.120.23 కోట్లకు చేరిన పంచాయతీ కరెంటు బిల్లు బకాయిలు
* వైఎస్సార్ హయాంలో ప్రభుత్వమే చెల్లించేది
* నాలుగేళ్లుగా నిధులు నిలిపివేత
* వసూళ్లకు ట్రాన్స్‌కో శ్రీకారం
పాలమూరు : అరకొర నిధులతో అసలే అల్లాడుతున్న గ్రామపంచాయతీలకు వీధి దీపాలు, మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ బిల్లుల బకాయిలు మోయలేని భారంగా మారనున్నాయి. గత నాలుగేళ్లుగా ఇందుకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారం పంచాయతీలపై పడింది. ఈ నేపథ్యంలో బకాయిల వసూలు కోసం ట్రాన్‌స్కో పంచాయతీలపై ఒత్తిడి పెంచింది.
పంచాయతీల ఆదాయం తక్కువగా ఉందని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అయితే వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్ బిల్లులను చెల్లింపు అంశాన్ని మరుగున పడేశారు. అప్పటి నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయూయి. 2010 నుంచి గ్రామ పంచాయతీల పరిధిలోని వీధి దీపాల విద్యుత్ బిల్లులను ఎన్‌పీడీసీఎల్‌కు చెల్లించడం లేదు.
గతంలో మైనర్ పంచాయతీల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుండగా, మేజర్ పంచాయతీల బిల్లులను పంచాయతీల ఆదాయం నుంచి చెల్లించేవారు. సర్పంచుల విజ్ఞప్తి మేరకు వైఎస్సార్ విద్యుత్ బకాయిలను ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఈ విధానం కొనసాగింది. అరుుతే తరువాత ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ చూపకపోవడంతో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు పంచాయతీలు భారీగా బకాయి పడ్డాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పంచాయతీలు రూ.120.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో మేజర్ పంచాయతీలకు సంబంధించి రూ.31.36 కోట్లు, 1331 మైనర్ పంచాయతీలకు గను రూ. 88.87 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి.
తడిసి మోపెడు
జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో ఒక్కొక్కటి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా వీధి దీపాలు, రక్షిత నీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల విషయాన్ని పట్టించుకోకపోవడంతో బకాయిల వసూలు కోసం విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే పంచాయతీలకు ఇబ్బంది తప్పేలా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ బకాయిలను చెల్లించాలని పలువురు సర్పంచులు కోరుతున్నారు.