సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ వినియోగంలో రాష్ట్రం కొత్త రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 7.33 గంటల సమయంలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 10,429 మెగావాట్లకు ఎగబాకి గత మార్చి 8న నమోదైన 10,284 మెగావాట్ల పాత రికార్డును చెరిపేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ సంస్థల ఉద్యోగులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. దీనిపై మంత్రి జి.జగదీశ్‌రెడ్డి విద్యుత్ సౌధలో మీడియాతో మాట్లాడారు. విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో పెరిగిపోవడం రాష్ట్ర అభివృద్ధికి సూచిక అని అభివర్ణించారు. విద్యుత్ డిమాండ్ 12,500 మెగావాట్లకు పెరిగిన సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు సంసిద్ధతతో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన ప్రతిమాట నిజమవుతోందన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ గరిష్ట డిమాండ్ 6,660 మెగావాట్లు మాత్రమే ఉన్నా, అప్పట్లో అవసరాలకు సరిపడా విద్యుత్ లేక కోతలు విధించాల్సి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలలకే కోతలను అధిగమించామని చెప్పారు.
పవన, సౌర విద్యుత్‌కు మళ్లీ టెండర్లు లేవు..
నిబంధనల ప్రకారమే ప్రైవేటు సౌర, థర్మల్ విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో సౌర విద్యుత్ ధరలు బాగా తగ్గాయని, మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పుడు టెండర్ల ద్వారా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న డెవలపర్లు గడువులోగా సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయకపోయినా, రాష్ట్రానికి నష్టం కలిగించే విధంగా ఉన్నా మళ్లీ అవే ధరలతో గడువు పెంచారని విలేకరులు ప్రశ్నించారు. దీనిపై మంత్రి బదులిస్తూ ఈ అంశం ఈఆర్సీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ల కోసం మళ్లీ టెండర్లు నిర్వహించే యోచన లేదన్నారు. కొత్త ఎత్తిపోతల పథకాల నిర్మాణం రెండు మూడేళ్లలో పూర్తి అయితే, సాగునీటి ప్రాజెక్టుల విద్యుత్ డిమాండ్ 10,852 మెగావాట్లకు పెరగనుందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌లో 30 శాతం గృహాలు, 30 శాతం పరిశ్రమలు, 30 శాతం వ్యవసాయ రంగాల వాటా ఉండగా, మిగిలిన 10 శాతం వాటాను వాణిజ్య, ఇతర రంగాల వారు వినియోగించుకుంటున్నారని చెప్పారు. సమావేశంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, విద్యుత్ సంస్థల డైరెక్టర్లు అశోక్‌కుమార్, సచ్చిదానందం, రాధాకృష్ణ, వెంకటరాజం, నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ఇది తెలంగాణ ప్రగతికి సంకేతం: సీఎం కేసీఆర్
10,000 మెగావాట్ల రికార్డు డిమాండ్ దాటిన సందర్భంగా జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావును, విద్యుత్ సంస్థల సిబ్బందిని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రభాకర్‌రావు అనుభవం తెలంగాణలో విద్యుత్ విజయాలకు అక్కరకొచ్చిందని సీఎం ప్రశంసించారు. జెన్ కో, ట్రాన్స్ కోలకు ఒకరే అధిపతిగా ఉంటే, సమన్వయం బాగుండి విద్యుత్ సరఫరా మెరుగవుతుందని తాను నమ్మానని, నేడు అదే నిజమైందని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే తెలంగాణలో చిమ్మచీకట్లు తప్పవనే జోస్యాలను అబద్ధమని తేల్చి.. నేడు అన్ని రంగాలకు 24 గంటల సరఫరా చేసే స్థితికి చేరడం అందరికీ గర్వకారణమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ తలసరి వినియోగం జాతీయ సగటుకన్నా 33 శాతం అధికంగా ఉండటం.. తెలంగాణ ప్రగతికి సంకేతమని చెప్పారు. తెలంగాణలో నాణ్యమైన కరెంటు 24 గంటల పాటు అందుబాటులో ఉండటం, భవిష్యత్తులోనూ కరెంటుకు ఢోకా లేదనే పరిస్థితి ఏర్పడడం వల్ల పలు పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. ఇది అంతిమంగా తెలంగాణ అభివృద్ధికి దోహదపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. 24 గంటల కరెంటు వల్ల వ్యవసాయ దిగుబడులు సైతం పెరుగుతున్నాయని చెప్పారు. మిషన్ భగీరథ, ఎత్తిపోతల పథకాలకు కావల్సిన విద్యుత్‌ను సరఫరా చేయడానికి గడువు కన్నా ముందే ఏర్పాట్లు పూర్తి చేశారని సీఎం అభినందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ మార్గదర్శకం, ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు సాధించాయన్నారు. ఖరీఫ్‌లో 11,500 గరిష్ట డిమాండ్ ఏర్పడుతుందనే అంచనా ఉందని, దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment