శ్రీకాకుళం : జిల్లాలో మంగళవారం నుంచి అధికారికంగా విద్యుత్ కోతలు అమలు కానున్నాయి.వాస్తవానికి ఇప్పటికే విద్యుత్ కోతలు అమలు చేస్తున్నా వాటిని అధికారులు లోడ్ రిలీఫ్‌గానే చెప్పుకొచ్చారు. కాగా అధికారికంగా కోతలు విధిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో ట్రాన్స్‌కో అధికారులు పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలో రోజుకు మూడు గంటలు, మండల, మున్సిపల్ కేంద్రాల్లో నాలుగు గంటలు చొప్పున కోత విధిస్తారు. జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి రెండు వరకు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు కోత ఉంటుంది. మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అమలు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ ఫీడర్లపై ఉన్న పరిశ్రమలకు ప్రతి శనివారం పవర్ హాలీడేగా ప్రకటించారు. వీటికి అదనంగా అత్యవసర సమయాల్లో ఎమర్జెన్జీ లోడ్ రిలీఫ్ అమలు చేస్తామని ట్రాన్స్‌కో ఎస్‌ఈ పీవీవీ సత్యనారాయణ తెలిపారు.