మీ ఇంట్లో స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు ఉన్నారా? అయితే ఇక నుంచి మీరు తెల్లవారు జామునే నిద్రలేవాలి. ఉదయం 8 గంటల్లోగా వంట పూర్తి చేసుకోవాలి. లేదంటే మీరు మళ్లీ స్కూళ్లకు క్యారియర్లు తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే ఉదయం 8 గంటల తర్వాత మిక్సీలు తిరగవు. గ్రైండర్లు పనిచేయవు.
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : వేసవి ఆరంభంలోనే ప్రజలకు ట్రాన్స్‌కో షాక్ ఇస్తోంది. సాధారణంగా మార్చి నుంచి ఆరంభమయ్యే కరెంట్ కోతలు ఈ ఏడాది ముందస్తుగా అమలులోకి వచ్చాయి. జనవరిలో ఓ మోస్తరుగా కరెంట్ తీసిన అధికారులు ప్రస్తుతం భారీగా పెంచేశారు.
జిల్లా కేంద్రంలో ఏకంగా నాలుగు గంటలు విద్యుత్ కోత విధించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మునిసిపాలిటీల్లో 6 గంటలు, మండలాల్లో 8 గంటలు కోత విధిస్తున్నారు. ఈ కోతలు శనివారం నుంచి జిల్లాలో అమల్లోకి వచ్చాయి. అనంతపురంలో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు, మునిసిపాలిటీల్లో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు, మండల కేంద్రాల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రాన్స్‌కో అధికారులు అధికారికంగా ఈ సమయాలు ప్రకటించిన ప్పటికీ శనివారం జిల్లా కేంద్రంలో ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ తీశారు.
దీంతో చిన్న పిల్లలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మార్చి, ఏప్రిల్ నెలల్లో కరెంట్ కోతలు చుక్కలు చూపిస్తాయని ప్రజలు వాపోతున్నారు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో కరెంట్ కోతలు అనివార్యమవుతున్నాయని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. జిల్లాకు 13.8 మిలియన్ యూనిట్లు అవసరం కాగా ప్రస్తుతం 12.5 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతోందని ఆయన తెలిపారు. ఉత్పత్తి పెరిగే వరకూ కోతలు తప్పవని వివరించారు.
కోతలే కోతలిక
Published Sun, Feb 9 2014 2:39 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
Advertisement