ఇంటా.. బయటా నరకమే! | hell home ..! | Sakshi
Sakshi News home page

ఇంటా.. బయటా నరకమే!

Published Mon, Jun 30 2014 2:26 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

hell home ..!

 సాక్షి, అనంతపురం : అనంతపురం నగరానికి చెందిన నరేష్ ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సభ్యులతో కలసి బయటకు వెళ్లాలనుకున్నారు. సరిగ్గా ఉదయం పది గంటలకు సిద్ధమై ఇంటి బయటకొచ్చారు. ఇంతలోనే భానుడు సుర్రుమనిపించాడు. అంతే..! ‘వామ్మో..ఇంత ఎండలో బయటకా’ అంటూ నరేష్ కుటుంబ సభ్యులను ఇంటికే పరిమితం చేశారు. ఇంట్లోనైనా కాసేపు ప్రశాంతంగా ఉందామనుకుంటే.. ఎడాపెడా కరెంటు కోతలు విసుగెత్తించాయి. ఛీ..ఛీ అనుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఓ చెట్టు కింద సేదతీరారు.
 
 నరేష్‌లాగే చాలా మంది ఆదివారం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు కాస్త అటూ ఇటుగా నమోదైనా.. విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. దీనికితోడు ఎడాపెడా కరెంటు కోతలు ప్రజల సహనాన్ని పరీక్షించాయి. గ్రిడ్‌లైన్లలో విద్యుత్తు సరఫరా ఫ్రీక్వెన్సీ 50 హెడ్జ్ దాటి ఉండాలి. ఇది తగ్గితే ఆ ప్రభావం రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై పడుతుంది. ఒకవేళ ఉత్పత్తి నిలిచిపోతే మూడు రోజుల వరకు పునరుద్ధరణ సాధ్యం కాదు. దీంతో వినియోగం పెరిగినప్పుడల్లా ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. వారం రోజులుగా ఉక్కపోతలతో జిల్లాలో విద్యుత్ వినియోగం పెరిగింది. ఇదే తరుణంలో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. జల విద్యుత్తు కేంద్రాల్లోనూ ఉత్పత్తి కనిష్ట స్థాయికి పడిపోయింది.
 
 దీనివల్ల కోతలు అనివార్యమయ్యాయని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీడీసీఎల్) అధికారులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జూన్ మొదటి వారం నుంచే జిల్లాలో విద్యుత్ కోతలు అధికమయ్యాయి. ప్రకటిత కోతలతో పాటు అప్రకటిత కోతలూ ఎక్కువగానే ఉన్నాయి. వీటిపై ఎవరైనా అధికారులను నిలదీస్తే.. ‘మమ్మల్ని ఏం చేయమంటారు?! జిల్లాకు అవసరమైన మేర విద్యుత్ సరఫరా కావడం లేదు.  15 లక్షల యూనిట్లకు గాను ప్రస్తుతం తొమ్మిది లక్షల యూనిట్లే ఇస్తున్నార’ంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement