లండన్ : కాసేపట్లో హాయిగా గమ్య స్థానానికి చేరుకోవచ్చు అనుకున్న ప్రయాణికులకు విమానంలో భయానక అనుభవం ఎదురైంది. విమానం మొత్తం దట్టమైన పొగతో నిండిపోవడంతో ఊపిరాడక ప్రాణాలు బిగపట్టుకుని కూర్చున్నారు. అయితే సిబ్బంది అప్రమత్తతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన బ్రిటీష్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఫ్లైట్ బీఏ422లో చోటుచేసుకుంది. వివరాలు... 175 మంది ప్రయాణికులతో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం లండన్ నుంచి స్పెయిన్ బయల్దేరింది. ఈ క్రమంలో ల్యాండ్ అవడానికి కొన్ని నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం మొత్తం పొగలు వ్యాపించాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు.
ఈ క్రమంలో వెంటనే విమానం దిగిపోవాల్సిందిగా సిబ్బంది ప్రయాణికులకు సూచించారు. దీంతో వారంతా పరుగులు పెట్టడంతో తోపులాట జరిగింది. అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ విభాగం సిబ్బంది వారిని సురక్షితంగా బయటకు పంపివేశారు. కాగా హారర్ మూవీని తలపించిన అనుభవం అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోలను లూసీ బ్రౌన్ అనే నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన బ్రిటీష్ ఎయిర్‌వేస్ ప్రతినిధి.. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలిగిందని.. అయితే వారిని భద్రంగా గమ్యస్థానానికి చేర్చగలిగామన్నారు. తోపులాటలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని..వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment