ఒకరు గురువు.. ఒకరు శిష్యురాలు ఒకరు తెలుగు. ఒకరు మలయాళం. ఒకరు లేరు. ఒకరు ఆ జ్ఞాపకాన్ని, గానాన్ని కొనసాగిస్తున్నారు. ఒకరికి పద్మవిభూషణ్ వచ్చింది. ఒకరికి పద్మభూషణ్. పాటకు దక్కిన అంజలి ఇది. తెలుగు శ్రోతలకు ఈ ఇద్దరూ ఇచ్చిన వెలకట్టలేని గీతాలెన్నో. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్రలకు పద్మ పురస్కారాలు వచ్చిన సందర్భంగా ఆ పాటలు తలుచుకుని అభినందనలు తెలపాలి.
‘నిప్పులోన కాలదు... నీటిలోన నానదు.. గాలిలాగ మారదు... ప్రేమ సత్యము’ అని పాడతారు చిత్ర. ‘రాచవీటి కన్యవి.. రంగు రంగు స్వప్నము.. పేదవాడి కంటిలో ప్రేమరక్తము’ అని పాడతారు బాలు. వింటున్నవారందరూ ఏ వయసు వారైనా ప్రేమ స్పర్శను అనుభవిస్తారు. వారిద్దరి జోడి అలాంటిది. తెలుగు సినీ సంగీత అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. దుఃఖంగా కూడా ఉన్నారు. సంతోషం చిత్ర, బాల సుబ్రహ్మణ్యంలకు ‘పద్మ’ అవార్డులు వచ్చినందుకు. దుఃఖం.. బాలుగారు లేనందుకు. ఉండి ఉంటే ఇవాళ వీరి యుగళ గీతాలు మరింత హుషారుగా మోగిపోయేవి.
తెలుగులో బాల సుబ్రహ్మణ్యం తిరుగులేని మేల్ సింగర్. ఆయన పక్కన కొద్దిగా దస్తీ వేయగలిగినది మనో ఒక్కడే. కాని చిత్ర తెలుగులో టాప్ రేంజ్‌కు వెళ్లడం అంత సులువు కాదు. ఎందుకంటే ఆమె తెలుగులో 1985లో ‘సింధుభైరవి’తో అడుగుపెట్టే సమయానికి ఇక్కడ సుశీల, జానకిలు శక్తిమంతంగా ఉన్నారు. చక్రవర్తి, కె.వి.మహదేవన్‌లు బాలు, సుశీల, జానకీలతోటే అన్ని పాటలు పాడించేవారు. కొన్ని పాటలు శైలజ కు వెళ్లేవి. ఇందరు ఉండగా చిత్ర ప్రవేశం కష్టమే.
కాని 1986లో ‘డాన్స్ మాస్టర్’ సినిమాకు డబ్బింగ్ పాడుతున్నప్పుడు బాలు చిత్రలోని టాలెంట్‌ను దగ్గరి నుంచి గమనించారు. ఆ సినిమాలో ‘రావేల వసంతాలే’ పాట చిత్రను ఇంటింట మోగే రేడియో గొంతుగా మార్చింది. అందులోని ‘జింగిల్‌జింగా జీమూతా జింగిల్‌జింగా’, ‘కవిత చిలికింది’ పాటలు బాలు, చిత్ర పాడారు. చిత్ర మలయాళీ. ఆమెకు తమిళం బాగానే తెలుసు. కాని తెలుగు బొత్తిగా తెలియదు. బాలు ఆమెకు సాయం చేసేవారు. తెలుగు ఉచ్ఛరణ దాదాపుగా ఆమె బాలు వల్లే నేర్చుకున్నారు. ‘చెప్పి చెప్పి ఒక దశలో నేను చెప్పను నువ్వే నేర్చుకో అన్నాను. పట్టుదలగా నేర్చుకుంది’ అని బాలు ఒక సందర్భంగా మెచ్చుకోలుగా అన్నారు.
1990 వరకు చిత్రకు తెలుగులో సరైన పూనిక దొరికలేదు. ‘ఆఖరి పోరాటం’లో చిత్ర, బాలు పాడిన ‘ఎప్పుడు ఎప్పుడు’, ‘అబ్బ దీని సోకు’ హిట్ అయినా. చిత్రకు తెలుగు అవకాశాలు ఇళయరాజా ఇస్తూ వెళ్లారు. ‘మరళమృదంగం’లో బాలు, చిత్ర పాడిన ‘గొడవే గొడవమ్మా’ పెద్ద హిట్. ‘వారసుడొచ్చాడు’లో ‘నీ అందం నా ప్రేమగీతం గోవిందం’ పాట కూడా. ఆ తర్వా ఇళయరాజా చిత్ర, బాలుల గళాలతో సృష్టించిన స్వరచరిత్ర ‘గీతాంజలి’. అందులో ఇద్దరూ కలిసి అమృతం కురిపించారు. ‘ఓ ప్రియా ప్రియా’, ‘ఓం నమహ’ డ్యూయెట్లు ఎంతో ప్రియమైనవి. ఇక ‘జగదేక వీరుడు–అతిలోకసుందరి’ కోసం వీరు పాడిన విఖ్యాత డ్యూయెట్ ‘అబ్బనీ తీయని దెబ్బ’ రికార్డులు సృష్టించింది.
కీరవాణి రాకతో
1990లో ‘మనసు–మమత’ సినిమాతో కీరవాణి రాకతో బాలు, చిత్ర, కీరవాణిల పాటలు తెలుగు నేలను ఊపేశాయి. కీరవాణి చిత్రతోనే ఎక్కువ పాటలు చేశారు. బాలుకు కొత్త ఊపు తెచ్చారు. బాలు, చిత్ర కలిసి పాడిన ‘పూసింది పూసింది పున్నాగ’ కీరవాణి తెలుగువారికి ఇచ్చిన ఒక పున్నాగపువ్వు పరిమళం. ‘క్షణక్షణం’లో బాలు, చిత్ర ఆయన బాణీలకు హిట్ రేంజ్ తెచ్చారు. ‘అమ్మాయి ముద్దు ఇవ్వందే’, ‘జాము రాతిరి’... ఇప్పటికీ వింటున్నారు. ఇక కీరవాణి చేసిన ‘అల్లరి ప్రియుడు’ అచ్చంగా బాలు, చిత్రల మ్యూజికల్. ‘అహో.. ఒక మనసుకు నచ్చిన’, ‘రోజ్ రోజ్ రోజా పువ్వా’... పాటల పూలు. ఇక కీరవాణి సంగీతంలో వచ్చిన ‘క్రిమినల్’ క్లాసిక్ డ్యూయెట్ ‘తెలుసా.. మనసా’ ఎలా మరువగలం. ‘ఘరానా మొగుడు’, ‘అల్లరి అల్లుడు’, ‘పెళ్లి సందడి’.. ఇవన్నీ బాలు, చిత్రల మేజిక్‌తో నిండి ఉన్నాయి. ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా అమ్మకచెల్లా’ ఎలా మర్చిపోగలం.
రెహమాన్‌తో
బాలు, చిత్రలు ఏ.ఆర్.రెహమాన్ పాటలతో తెలుగు సంగీత ప్రియులను ఉర్రూతలూగించారు. రెహమాన్ తొలి సినిమా ‘రోజా’లో వీరిద్దరూ కలిసి పాడిన ‘పరువం వానగా’... లోని మాధుర్యం ఎంతని. ఆ తర్వాత ‘డ్యూయెట్’లో బాలు, చిత్రల ప్రతిభకు గొప్ప ఉదాహరణగా ‘అంజలి.. అంజలి.. పుష్పాంజలి’ పాట ఉంటుంది. ఆ పాట చరణంలో హైపిచ్‌లో ఇద్దరూ పాడేది వినాలి. అందులో చిత్ర ఆలాపనలూ అద్భుతం.
ఎన్నో ఆణిముత్యాలు..
చిత్ర, బాలూ లేకపోతే తెలుగులో 1990 –2000 మధ్య సినిమా సంగీతం లేదన్నంతగా వారు వందలాది గీతాలు పాడారు. ఆ తర్వాత కొత్తతరం సంగీత దర్శకులు వచ్చినా వీరి జోడుగానం కొనసాగింది. రాజ్‌కోటిల సంగీతంలో వచ్చిన ‘ప్రియరాగాలే’ (హలో బ్రదర్), ‘అందమా అందుమా’ (గోవిందా గోవిందా), ఎస్.ఏ.రాజ్‌కుమార్ సంగీతంలో వచ్చిన ‘గుండె నిండ గుడి గంటలే’, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ‘నా మనసునే మీటకే’ (మన్మథుడు)... ఆ లిస్టుకు అంతే లేదు. చిత్ర బాలూను గురువుగా భావిస్తారు. ఆ గురుపరంపరను ఆమె కొనసాగిస్తున్నారు. శిష్యురాలికి ‘పద్మభూషణ్’, గురువుకు ‘పద్మవిభూషణ్’ వచ్చిన ఈ వేళ నిజంగా సంగీతమయమైన వేళ. పాటగా వ్యాపించి ఉన్న బాలు సంతృప్తి పడేవేళ.
‘నీ జత లేక పిచ్చిది కాదా మనసంతా..
నా మనసేమో నా మాటే వినదంటా’...
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment