డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం | Telugu library started in Lewisville Dallas | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో తెలుగు గ్రంథాలయం ప్రారంభం

Published Sun, Nov 5 2023 11:29 AM | Last Updated on Sun, Nov 5 2023 11:29 AM

Telugu library started in Lewisville Dallas  - Sakshi

అమెరికాలో తెలుగువారు అధికంగా నివసించే నగరాల్లో ఒకటైన డల్లాస్‌లో శుక్రవారం సాయంత్రం తెలుగు గ్రంథాలయాన్ని ప్రారంభించారు. డల్లాస్ శివారు లూయిస్‌విల్‌లో ప్రవాసాంధ్రుడు మల్లవరపు అనంత్ R2 Realty కార్యాలయంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని గాయని ఎస్పీ శైలజ, గాయకుడు ఎస్పీ చరణ్, తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్‌లు ప్రారంభించారు.

ఎస్పీ శైలజ మాట్లాడుతూ అమెరికాలో తెలుగు గ్రంథాలయం ఏర్పాటు చేయడాన్ని హర్షించారు. రోజుకు ఒక పేజీ తెలుగు చదవాలని, తద్వారా మాతృభాషకు దూరం కాకుండా ఉండగలమని అన్నారు. ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ఒకప్పుడు అమెరికాలో తెలుగువారంటే డాక్టర్లు గుర్తుకు వచ్చేవారని, కానీ ఇప్పుడు అనంత్ వంటి రియల్టర్లతో పాటు సమాజంలోని విభిన్న కోణాలకు చెందిన ఎందరో అమెరికా వస్తున్నారని తెలుగు భాష పట్ల ఆయనకున్న మక్కువతో ఏర్పాటు చేసిన గ్రంథాలయం అమెరికాలో వెలుగులు పంచాలని ఆకాంక్షించారు. 

తానా మాజీ అధ్యక్షుడు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో తెలుగు కోర్సుల నిర్వహణ నిమిత్తం తానా నిధుల సేకరణ చేపట్టినప్పుడు ఎస్పీ బాలు విభావరితో అలరించాలని ఆయన ఆశ ధ్యాస శ్వాస తెలుగు భాష అని కొనియాడారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆరు సంపుటాలుగా వెలువరించిన సిరివెన్నెల సమగ్ర సాహిత్యాన్ని శైలజ-చరణ్‌ల చేతుల మీదుగా ఈ గ్రంథాలయానికి బహుకరించారు. త్వరలోనే తానా ఆధ్వర్యంలో కవిరత్న కొసరాజు రాఘవయ్య చౌదరి సమగ్ర సాహిత్యాన్ని వెలువరిస్తామని ప్రసాద్ తెలిపారు. “ట్యాంక్‌బండ్‌పై తెలుగు విగ్రహాల ప్రశస్తి” పేరిట చెన్నపూరి తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాన్ని కూడా ఈ సభలో ఆవిష్కరించారు.

వేముల లెనిన్, మద్దుకూరి చంద్రహాస్, అనంత్ మల్లవరుపులు కొండేపూడి లక్ష్మీనారాయణ రచించిన “పాడరా ఓ తెలుగువాడా” గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభించారు. అతిథులకు అనంత్ ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి పేరిట స్వదేశంలో పాఠశాల కట్టించానని, అమెరికాలో తన తల్లి పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శారద సింగిరెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, పరమేష్ దేవినేని, రాజేష్ అడుసుమిల్లి, బీరం సుందరరావు, సురేష్ మండువ, లక్ష్మీ పాలేటి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement