సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ టికెట్ల కోసం బీజేపీ ఆశావహుల నుంచి మొత్తం 6,003 దరఖాస్తులు అందాయి. ఇందుకు చివరి రోజైన ఆదివారం నాడే ఏకంగా 2,780 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. కాగా ఈ నెల 4 నుంచి శనివారం వరకు 3,223 దరఖాస్తులు అందడంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 6,003కు చేరుకుంది.
అయితే రాష్ట్ర పార్టీకి చెందిన ముఖ్యనేతలు జి.కిషన్‌రెడ్డి, డా.కె.లక్ష్మణ్. డీకే అరుణ, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు, ఆయా నియోజకవర్గాల్లో పట్టు ఉన్న పలువురు నాయకులు దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం. కాగా పార్టీలో, రాజకీయంగా అత్యంత సీనియర్లుగా ఉంటూ, ఆయా స్థానాల్లో తిరుగులేని నాయకులుగా ఉన్న తమను కూడా అందరిలాగే పోటీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించడంపై కొందరు ముఖ్యనేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తనకు కేంద్ర కేబినెట్ బెర్త్ దాదాపుగా ఖరారు అయినట్టేనని, అందువల్ల తాను ఎంపీగానే పోటీ చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పార్టీ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ నాయకులు చెప్పినట్టు తెలుస్తోంది. తాను ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నానని, పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి పోటీ చేస్తానని ధర్మపురి అర్వింద్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టుగా చెబుతున్నారు.
25–30 మందితో తొలి జాబితా ఇప్పటికే రెడీ?
ఇటీవల జరిగిన రాష్ట్ర కోర్ కమిటీ భేటీలో 25–30 నియోజకవర్గాలకు ముఖ్య నేతల పేర్లతో కూడిన తొలి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు రాష్ట్ర పార్టీ కార్యాలయ వ్యవహారాలు చూసే ఓ ముఖ్య నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు.
అందువల్లే కీలక నేతలు దరఖాస్తు చేసుకోలేదని, మిగిలిన 90 వరకు అసెంబ్లీ స్థానాల్లోనే అభ్యర్థుల ఎంపికకు వడబోత చేపట్టాల్సి ఉంటుందని పార్టీవర్గాల సమాచారం. అదే సమయంలో రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఇతర పార్టీలలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా బలమైన నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశమున్నందున కొన్ని స్థానాలు రిజర్వ్‌లో పెట్టాల్సి ఉంటుందని కూడా అంటున్నారు.
బండారు దత్తాత్రేయ కుమార్తె దరఖాస్తు
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ముషీరాబాద్ నుంచి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శేరిలింగంపల్లికి మాజీ ఎమ్మెల్యే కుమారుడు రవికుమార్‌యాదవ్, ఎల్బీనగర్ సీటుకు డా. జి.మనోహర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ కోసం డా.ఎస్.మల్లారెడ్డి, కొత్తగూడెం స్థానానికి కేవీ రంగాకిరణ్ దరఖాస్తు చేసుకున్నారు.
సినీనటి జీవితా రాజశేఖర్ 5 సీట్లకు (జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, శేరిలింగంపల్లి) దరఖాస్తు చేసినట్లు తెలిసింది. హుజూరాబాద్ నుంచి పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, గజ్వేల్ నుంచి ఈటల సతీమణి జమున తమ ప్రతినిధుల ద్వారా దరఖాస్తులు పంపించినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment