సాక్షి, రంగారెడ్డి జిల్లా : టీఆర్‌ఎస్ ఓటమే లక్ష్యంగా జట్టుకట్టిన కూటమిలో కలకలం మొదలైంది. సీట్ల సర్దుబాటు వ్యవహారం అధినేతలకు తలనొప్పిగా మారింది. ఎంత బుజ్జగించినా, గెలిస్తే అందలమెక్కిస్తామన్నా.. టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ససేమిరా అం టున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో తామే అభ్యర్థులుగా చెప్పుకుంటూ ప్రచారం మొదలుపెట్టిన వీరికి ఈ సర్దుబాటు వ్యవహారం మింగుడుపడడంలేదు. ఇంతదాకా వచ్చాక త్యాగాల పేరిట మాకు టికెట్ ఇవ్వకపోవడమేమిటని రుసరుసలాడుతున్నారు. అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ రెండు పార్టీల్లోనూ అసంతృప్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కూటమి మాటెలాగున్నా టికెట్ల పర్వం ముగిస్తే చాలని అధినాయకులు అనుకుంటున్నారు
లీకువీరులు!
అసలుకన్నా కొసరు ఎక్కువ అన్నట్టు వార్‌రూమ్ లో ఏం జరుగుతుందో తెలియదు కానీ, చిలువలు పలువలు చేసి లీకులిచ్చేవాళ్లతో తలనొప్పి తప్పట్లేదు. ఇదిగో టికెట్..అదిగో కట్ అంటూ కొత్త కొత్త కథనాలల్లి ఆశావహులనుసందిగ్ధంలో పడేస్తున్నారు. కాంగ్రెస్ తాజాగా సీట్లు ఖరారు చేసినట్లు ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ల గుండెల్లో గుబులు పట్టుకుంది. ప్రధానంగా మన జిల్లాలో టీడీపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లో అత్యధికంగా ఆ పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది. అయితే, కూటమి పుణ్యామా అని ఈ సారి ఆ సీట్లు దక్కవేమోనన్న బెంగ ఆ పార్టీ నాయకులకు పట్టుకుంది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎల్‌బీనగర్ సీటుపై కన్నేసిన ఆశావహుడు సామ రంగారెడ్డి ఇటీవల అమరావతికి వెళ్లి అధినేత బాబును కలిసి విషయం వివరించడంతోపాటు కాంగ్రెస్‌తో పొత్తు సిట్టింగ్ సీట్లకే ఎసరుతెస్తోందని వివరించారు. అయినా, చంద్రబాబు తనదైన శైలిలో త్యాగం చేయకతప్పదు అన్నట్లు తెలుస్తోంది. కొండంత ఉత్సాహంతో వెళ్లిన రంగారెడ్డి నిరుత్సాహంతో వెనుదిరగక తప్పలేదు. అంతకంతకూ అసహనం పెరగడంతోపాటు కార్యకర్తల ఒత్తిడి ఎక్కువ కావడంతో నేరుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట ధర్నాకు దిగారు.
గాంధీభవన్‌కు తాకిన సెగ!
టీడీపీతో సయోధ్య కాంగ్రెస్‌లోనూ ముసలం పుట్టిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏకంగా నాలుగు సీట్లను ఆ పార్టీకి కేటాయించనున్నారనే ప్రచారం హస్తం ఆశావహులను కలవరపరుస్తోంది. మహాకూటమి పురుడు పోసుకున్న మొదటి రోజే గత ఎన్నికల్లో ఉప్పల్ అభ్యర్థిగా బరిలో దిగిన బండారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ గూటికి చేరగా.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు మరింత మందిని పక్కచూపులు చూసేలా చేస్తున్నాయి. ఉప్పల్, కూకట్‌పల్లి స్థానాలను దాదాపుగా టీడీపీకి కేటాయించినట్లు కాంగ్రెస్ సంకేతాలిస్తోంది. ఇవిగాకుండా పరిశీలనలో శేరిలింగంపల్లి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి అత్యధిక మెజార్టీతో గెలవడం, సీమాంధ్ర ఓటర్లు గణనీయంగా ఉండడంతో ఈ సీటును ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. దీంతో ఈ స్థానం కూడా దాదాపుగా ‘దేశం’ కోటాలో చేరే అవకాశం దాదాపుగా కనిపిస్తోంది. ఈ పరిణామాలతో అవాక్కయిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ మూడు రోజుల క్రితం గాంధీభవన్ ఎదుట ధర్నాకు దిగారు.
ఆయన మద్దతుదారు ఒకరు ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను హస్తినకు పిలిపించి మాట్లాడింది. మరోవైపు టీజేఎస్‌తో పొత్తు కూడా అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ పక్షాలను ఆందోళనకు గురిచేస్తోంది. మల్కాజిగిరి స్థానాన్ని సర్దుబాటులో భాగంగా టీజేఎస్‌కు వదలాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో గత ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థి నందికంటి శ్రీధర్ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే టీజేఎస్ అభ్యర్థి కపిలవాయి దిలీప్‌కుమార్ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేయగా.. సీట్ల పంపిణీ అనంతరం కూటమి పక్షాల్లో కీచులాటలు మరింత రచ్చకెక్కే అవకాశం కనిపిస్తోంది. రాజేంద్రనగర్ సెగ్మెంట్ పరిస్థితి కూడా దాదాపుగా ఇంతే. కాంగ్రెస్ తరఫున ఈ సీటును ఆశిస్తున్న కార్తీక్‌రెడ్డికి కాకుండా.. పొత్తులో టీడీపీ కేటాయిస్తే కాంగ్రెస్ నుంచి సంపూర్ణ సహకారం అందడం కష్టంగానే కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment