పోలవరం కూటమిలో కుట్రల పర్వం
జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ కేడర్
అభ్యర్థిని మార్చాలంటూ చంద్రబాబు ఎదుట ఆందోళన
టీడీపీ ఇన్‌చార్జి బొరగం నేతృత్వంలో వరుస ఆందోళనలు
టీడీపీ, బీజేపీ లేకుండా ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి
సామాజిక కోణమే అభ్యర్థి మార్పు నినాదానికి ప్రధాన అజెండా
పోలవరం అసెంబ్లీ స్థానంలో రాజకీయ గందరగోళం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే.. కలిసికట్టుగా పనిచేసుకుంటాం.. జనసేనకు ఇస్తే మేం సహకరిస్తామని టీడీపీ ఇన్‌చార్జి.. అలాగే టీడీపీకి ఇస్తే సహకరిస్తామని జనసేన నేతలు స్థానికంగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీల ముఖ్యులకు చెప్పారు. కట్ చేస్తే.. పోలవరం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. మొదటి రెండు మూడు రోజులు వ్యవహారమంతా బాగానే ఉంది. ఆ తరువాత నుంచి అసలు గొడవకు తెర లేచింది. జనసేన అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలంటూ ఆ పార్టీ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించి మరీ ఘెరావ్ చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది.
పొత్తులు.. కత్తులు
పోలవరంలో పొత్తు పార్టీల్లోని నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు ధృతరాష్ట్ర కౌగిలిలో గడిపిన రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకునే స్థాయికి చేరడం వెనుక ఇద్దరు అభ్యర్థులను నడుపుతున్న రెండు సామాజిక వర్గాలే ప్రధాన కారణమనే చర్చ నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ పోలవరం ఇన్‌చార్జిగా బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్‌చార్జిగా చిర్రి బాలరాజు కొనసాగుతున్నారు. పేరుకే ఇది రిజర్వుడు నియోజకవర్గం. జనసేనలో పవన్‌కళ్యాణ్ సామాజికవర్గం, టీడీపీలో చంద్రబాబు సామాజికవర్గం నేతలదే ఇక్కడ ఆధిపత్యం. రెండు సామాజిక వర్గాల నేతలు ఎవరికి సూచిస్తే ఆయా పార్టీ అభ్యర్థులుగా ఇప్పటివరకు రాజకీయం నడిచింది.
2014లో టీడీపీ నుంచి గెలిచిన మొడియం శ్రీనివాస్ 2019లో టికెట్ కోల్పోయారు. 2019లో బొరగం శ్రీనివాస్‌కు సీటు దక్కగా ఆయన ఓటమి పాలయ్యాడు. అయినా ఇన్‌చార్జిగా కొనసాగుతూ నియోజకవర్గంలో బాబు సామాజికవర్గ నేతల సహకారంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జనసేన పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న చిర్రి బాలరాజు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో పొత్తులతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటంతో పోలవరంలో చిచ్చు రేగింది. పొత్తులకు ముందు వరకు టీడీపీ సీటు కోసం ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌లు ప్రయత్నించారు. జనసేనకే టికెట్ అని ప్రకటించడంతో ఇద్దరూ రెండు రోజుల పాటు హడావుడి చేసి సర్దుకున్నారు.
నిరసనల పర్వం
జనసేన టికెట్ ఖరారుకు ముందు టీడీపీ దెందులూరు ఇన్‌చార్జి చింతమనేని ప్రభాకర్, పోలవరం టీడీపీ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్‌చార్జి చిర్రి బాలరాజులు జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్దకు వెళ్లారు. జనసేన టికెట్ తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అని, ఇబ్బంది లేదని మా ట్లాడుకుని వచ్చారు. ఆ తరువాత రెండు రోజులకు జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజును ప్రకటించారు. భీమవరంలో అప్పటివరకు టీడీపీ నేతగా ఉన్న పులపర్తి రామాంజనేయులుకు జనసేన కండువా కప్పి అభ్యర్థిగా ప్రకటించిన రీతిలో అవకాశం దక్కుతుందేమోనని బొరగం ఆశ పడ్డారు. అయితే జనసేన నేతకు టికెట్ ఇవ్వడంతో బాబు సామాజికవర్గ నేతల వర్గీయులతో కలిసి బొరగం వర్గీయులు నిరసనలకు తెరతీశారు.
ఆ సామాజిక వర్గ నేతల వద్దకు వెళ్లలేం
ప్రతి పనికీ పవన్‌కళ్యాణ్ సామాజికవర్గ నేతల వద్దకు తాము వెళ్లలేమని, అందుకే టికెట్ మార్చి టీడీపీ అభ్యర్థికి ఇవ్వాలంటూ బొరగం వర్గీయులు తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబునాయుడు క్యాంప్ వద్ద ధర్నాకు దిగి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడం పోలవరంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అభ్యర్థి మార్పు ఉంటుందని టీడీపీ బలంగా నమ్ముతుండగా, జనసేన అభ్యర్థి మాత్రం టీడీపీ, బీజేపీ నేతలు ఎవరూ లేకుండానే పది రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్ పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు నిర్వహించిన సభలకు హాజ రుకావడం మరో చర్చగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment