Madan Reddy
-
సీఎం రేవంత్‌ను కలసిన కేకే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జన రల్, ఎంపీ కె.కేశవరావు శుక్రవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కేకే చాలాసేపు రేవంత్‌తో భేటీ అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహా రాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్, కేకే కుమారుడు వెంకట్ కూడా ఈ సమయంలో అక్కడే ఉన్నారు. మరోవైపు స్టేషన్‌ఘ న్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు దీపాదాస్ మున్షీ, ఇతర నేతలు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. సీనియర్ నేతలు మల్లు రవి, ఎస్.సంపత్‌కుమార్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనా రాయణ తదితరులు మున్షీ వెంట ఉన్నారు. వారు కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్యతో భేటీ అయి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. నేడు చేరికలు! ఎంపీ కేకే కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నారు. కేకే, కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఎప్పుడు చేరుతారనేది స్పష్టతలేదు. ఇక నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి కూడా శుక్ర వారం రేవంత్‌ను కలిశారు. ఈ ఇద్దరు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నేతలు కూడా.. నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డి, ఆ జిల్లాకు చెందిన నేతలు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలంతా కలసి క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు రేవంత్ పలు సూచనలు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గా రెడ్డి, ఆమె కుమారుడు భరత్‌సాయిరెడ్డి సీఎంను కలిశారు. తనకు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి రూరల్: మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, మళ్లీ సొంతగూటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. -
నర్సాపూర్‌ను శాసించిన మదన్‌రెడ్డి వంశస్తులు!
సాక్షి, మెదక్: కౌడిపల్లి అడ్డాగా.. నర్సాపూర్ గడ్డపైరాజకీయాలను శాసించిన చిలుముల వంశం సుదీర్ఘ రాజకీయ చరిత్రకు నేటి నుంచి తెరపడనుందా... అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నర్సాపూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కౌడిపల్లికి చెందిన చిలుముల వంశస్తులు పోటీ చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కపోవడం చర్చనీయాంశంగా మారింది. విఠల్‌రెడ్డితో మొదలుకొని.. దివంగత మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకులు చిలుముల విఠల్‌రెడ్డి నర్సాపూర్ రాజకీయాలను శాసించారు. 1952లో నర్సాపూర్ నియోజవర్గం ఏర్పడింది. 1957లో జరిగిన మొదటి ఎన్నికల్లో సీపీఐ తరపున కౌడిపల్లికి చెందిన విఠల్‌రెడ్డి పోటీ చేశారు. 1957 నుంచి 2004 వరకు 11సార్లు శాసనభకు ఎన్నికలు జరగగా విఠల్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అయిదు సార్లు గెలుపొంది ప్రజాసేవ చేశారు. అనంతరం 2009లో మహాకూటమి ఏర్పడడంతో సీపీఐ తరఫున విఠల్‌రెడ్డి కుమారుడు చిలుముల కిషన్‌రెడ్డి పోటీలో నిలిచి ఓటమి చెందారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో విఠల్‌రెడ్డి తమ్ముడి కుమారుడు చిలుముల మదన్‌రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మదన్‌రెడ్డి తెలుగుదేశం తరఫున రెండు సార్లు పోటీచేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి దక్కేదెవరికో.. ప్రస్తుతం మదన్‌రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికి టికెట్ ఇచ్చి బీఫామ్ అందజేశారు. టికెట్ రాదని చర్చకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పలుమార్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని పార్టీలోనికి రావాలని ఆహ్వానించినట్లు చర్చ జరిగింది. రెండురోజుల క్రితం విఠల్‌రెడ్డి కోడలు బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు సుహాసిని కిషన్‌రెడ్డి, ఆమె కొడుకు చిలప్‌చెడ్ మండల మాజీ జెడ్పీటీసీ శేషసాయిరెడ్డిని మైనంపల్లితోపాటు కాంగ్రెస్ నాయకులు పార్టీలోనికి ఆహ్వానించారు. దీంతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చిలుముల వంశస్తులకు ఇస్తారా.. అని చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సైతం నర్సాపూర్ టికెట్ కేటాయించకపోవడంతో ఏదైనా జరగవచ్చని జనం అంటున్నారు. ఇవి చదవండి: కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవు! : భారత ఎన్నికల కమిషన్.. -
సునీతా లక్ష్మారెడ్డికి బీ-ఫామ్ ఇచ్చిన సీఎం కేసీఆర్
-
బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి ఖరారు
సాక్షి, హైదరాబాద్: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును భారత రాష్ట్ర సమితి ఖరారు చేసింది. ఈ మేరకు స్వయంగా పేరు ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఆమెకు బీఫామ్ అందజేశారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కోర్ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సాపూర్ టికెట్‌ను సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నా. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు అని కేసీఆర్ తెలిపారు. వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మూడుసార్లు నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్, కొణిజెట్టి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. 2019లో బీఆర్ఎస్లో చేరారామె. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా, సభ్యురాలిగా ఆమె పని చేశారు. -
'సార్.. ఆశీస్సులు నాకే..' : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయని, మూడోసారి ఎమ్మెల్యే బరిలో ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం హత్నూర మండలం పన్యాల గ్రామంలో గాంధీ, దివంగత బీఆర్ఎస్ నేత అక్బర్ విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, నా ధ్యాసంతా అభివృద్ధిపైనే అని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రూ.56 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో తండాల బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 14 చెక్ డ్యామ్‌లు నిర్మించినట్లు పేర్కొన్నారు. హత్నూర మండల కేంద్రంలో రూ.8 కోట్ల వ్యయంతో డివైడర్లు నిర్మిస్తామని, రెండు మూడు రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. పన్యాల గ్రామానికి రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి త్వరలోనే ప్రొసీడింగ్ కాపీ ఇస్తానన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, ఎంపీపీలు నర్సింలు, కల్లూరు హరికష్ణ, జెడ్పీటీసీ ఆంజనేయులు, సర్పంచ్ శ్వేత, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆశావర్కర్ల వినతి.. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఆశా వర్కర్లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు. -
సునీతారెడ్డికే టికెట్..
నర్సాపూర్: నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి ప్రగతి భవన్ నుంచి శనివారం రాత్రి పిలుపు వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ అయ్యారు. నర్సాపూర్ టికెట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నర్సాపూర్ టికెట్ తనకే ఇవ్వాలని మదన్‌రెడ్డి కోరగా.. మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికే ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నారని చెప్పినట్లు తెలిసింది పార్టీ నిర్ణయించే అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని మంత్రులు ఆయనకు స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. మీరు కేసీఆర్ సమకాలికులని, సన్నిహితులని, మీకు సీఎం అన్యాయం చేయరని మద న్‌రెడ్డికి మంత్రులు నచ్చ చెప్పారని అంటున్నారు. పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సునీతారెడ్డికి టికెట్ ఇవ్వనున్నారని, ఆమెను గెలిపించుకు ని రావాల్సి ఉంటుందని సూచించారని తెలిసింది. మీ స్థాయికి తగిన పదవి వస్తుంది నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందకుండా, వారికి తప్పుడు సమాచారం వెళ్లకుండా మీరు స్పందించాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల అనంతరం పార్టీ అధిష్టానం మీకు తగిన ప్రాధాన్యత ఇస్తుందని, మీ స్థాయికి తగిన పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుందని హామీనిచి్చనట్టు సమాచారం. ఇదిలాఉండగా రేపో మాపో ఒకే వేదికపై ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సునీతారెడ్డిను కూర్చోబెట్టి చర్చలు జరిపి నర్సాపూర్ పార్టీ టికెట్‌ను అధికారికంగా బీఆర్ఎస్ ప్రకటించే అవకాశం ఉంది. -
నీ కాల్మొక్తా సార్.. మా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వండి...
నర్సాపూర్: నీ కాల్మొక్తా సార్.. మా ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వండి... అంటూ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మంత్రి హరీశ్‌రావును కోరారు. శనివారం నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, శివ్వంపేట మండల అధ్యక్షుడు రమణగౌడ్, నర్సాపూర్ కౌన్సిలర్ అశోక్‌గౌడ్ తదితరులు మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శివ్వంపేట మండల అధ్యక్షుడు రమణగౌడ్ మాట్లాడుతూ.. కాల్మొక్తా.. మా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వండి.. అని కోరగా.. అసహనం వ్యక్తం చేసిన మంత్రి హరీశ్‌రావు.. కాళ్లు మొక్కితే టికెట్ వస్తదా.. అంటూ ప్రశ్నించారు. నేనే నీ కాల్మొక్తా.. అంటూ మంత్రి కిందకు వంగడంతో అక్కడున్న నాయకులు అవాక్కయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పార్టీ టికెట్ల విషయం సీఎం కేసీఆర్ చూస్తారని అన్నారు. మదన్‌రెడ్డి మంచి వారే, ఆయనను మీరే నిమ్మలంగా ఉండనిస్తలేరు అంటూ.. నాయకులకు చురకలు అంటించారు. కాగా చిలప్‌చెడ్ మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి మాట్లాడుతూ.. బహిరంగ సమావేశాల్లో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దని, ఎలాంటివ్యాఖ్యలు చేయొద్దని ఎమ్మెల్యేకు సూచించినట్లు తెలిసింది. శనివారం మన్సూర్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఆయనకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావుకు సునీతారెడ్డి వినతి నర్సాపూర్: నియోజకవర్గంలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి మంత్రి హరీశ్‌రావును కోరారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి.. పనులకు సంబంధించిన రికార్డులను అందజేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించిన మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో బిల్లులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. బీసీ బంధు పథకం కింద అర్హులను ఎంపిక చేసి సాయం అందించేలా అధికారులను ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఆమెతో నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయిమోద్దీన్, నాయకులు, సర్పంచులు శ్రీనివాస్‌గౌడ్, మనోహర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎల్లం, ప్రవీన్‌రావు, సుధాకర్‌రెడ్డి, సత్యంగౌడ్ తదితరులు ఉన్నారు. -
పల్లాకు డబ్బు మదం ఎక్కువైంది: ముత్తిరెడ్డి
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి డబ్బు మదం ఎక్కువైందని, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ పార్టీని మలినం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది అధర్మం, సీఎం సంకల్పానికి విరుద్ధమని ముత్తిరెడ్డి ఆరోపించారు. ఆయన సిద్దిపేట జిల్లా చేర్యాలలో విలేకరులతో మాట్లాడారు. ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఫోన్లుచేస్తూ డబ్బులు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన వారిని ‘కుక్కలు’అనడం పల్లా అహంకారానికి నిదర్శనమన్నారు. నాకే నర్సాపూర్ టికెట్ ఇవ్వాలి.. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినా అభ్యంతరం లేదని, తనకు నర్సాపూర్ టికెట్ కావాలని సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏ ఆలోచనతో నర్సాపూర్ టికెట్ ప్రకటించకుండా ఆపారో తెలియదని, పునరాలోచించి తనకే ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్‌లో పదవులు అనుభవించి బీఆర్ఎస్లో చేరారని, ఇక్కడ కేబినెట్ కేడర్ హోదాలో ఉన్నారని పరోక్షంగా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి అన్నారు. తనకు మంత్రి హరీశ్‌రావు అండదండలు ఉన్నాయన్నారు. టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తారని విలేకరులు అడగ్గా.. టికెట్ తనకే వస్తుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. చదవండి: Thummala: తుమ్మల చేజారిపోకుండా.. టికెట్ ఇవ్వకుంటే రాజకీయ సన్యాసం సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఈసారి తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. ఆయన సోమవారం మహబూబాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా మహబూబాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇంత బలం ఉన్న తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఒక వేళ ఇవ్వకపోతే ఖద్దరు బట్టలు కాకుండా.. ఎర్రటి వస్త్రాలు ధరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు. -
నర్సాపూర్‌లో నువ్వా నేనా? సిట్టింగ్ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ నర్సాపూర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ టికెట్లను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. నర్సాపూర్ టికెట్ ను పెండింగ్‌లో పెట్టడం ఆ నియోజకవర్గంలో ఉ త్కంఠ రేపుతోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ పార్టీ టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. ఇప్పుడీ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టడంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మెదక్ జిల్లా పర్యటన తర్వాత.. నర్సాపూర్ టికెట్ తనకంటే తనకే ఇవ్వాలంటూ మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇప్పటికే పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. మదన్‌రెడ్డి రెండు రోజుల కింద మంత్రి హరీశ్‌రావును కలసి తనకు టికెట్ ఖరారు చేసేలా చూడాలని కోరారు. సునీత కూడా హరీశ్‌రావుతోపాటు, ఎమ్మెల్సీ కవితను కలసి టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడైన మదన్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌తో స్నేహ సంబంధాలు ఉన్నాయని, అయితే ఆయన వయోభారం, ఆయన అనుచరులపై అక్రమ దందాల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. సునీతకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ను వీడుతామని మదన్‌రెడ్డి వర్గీయులు అంటున్నారు. మరోవైపు నర్సాపూర్ టికెట్ ఇస్తామనే హామీతోనే సునీతా లక్ష్మారెడ్డి బీఆర్ఎస్లో చేరారని ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. ఈ నెల 23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనుండటంతో.. త్వరలోనే నర్సాపూర్ టికెట్ ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇద్దరూ కలిసే టీవీ చూస్తూ.. సోమవారం మదన్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరూ నర్సాపూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూర్చునే.. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనను టీవీలో వీక్షించడం గమనార్హం. వీరితోపాటు ఎమ్మెల్సీ యాదవరెడ్డి మరికొందరు నేతలూ అక్కడ ఉన్నారు. నర్సాపూర్ టికెట్ ఎవరికి ప్రకటిస్తారోనని ఉత్కంఠతో అంతా ఎదురుచూశారు. కానీ పెండింగ్‌లో పెట్టడంతో టెన్షన్లో పడ్డారు. సీఎం కేసీఆర్‌పై నమ్మకం ఉంది ‘‘సీఎం కేసీఆర్ కుటుంబంతో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ఆయన నర్సాపూర్ టికెట్ నాకే కేటాయిస్తారు. కేసీఆర్‌పై పూర్తి భరోసా ఉంది. ఈ స్థానాన్ని ఎందుకు పెండింగ్‌లో పెట్టారో తెలియదు. దీనిపై నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా..’’ – చిలుముల మదన్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా.. ‘‘నాకు టికెట్ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలను కలసి విజ్ఞప్తి చేశాను. నర్సాపూర్ టికెట్ ఎందుకు ప్రకటించలేదో మాకు తెలియదు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా..’’ – సునీతా లక్ష్మారెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ -
నర్సాపూర్ నియోజకవర్గంలో తదుపరి అభ్యర్థి ఎవరు?
నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రెండోసారి గెలిచారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డిపై 38120 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మదన్ రెడ్డికి 105465 ఓట్లు రాగా,సునీతకు 67345 ఓట్లు వచ్చాయి. రెడ్డి వర్గానికి చెందిన మదన్ రెడ్డి గతంలో ఇక్కడ నుంచి ఐదుసార్లు గెలిచిన సిపిఐ నేత చిలుముల విఠల్ రెడ్డి కుమారుడు. కాగా ఓటమి తర్వాత సునీత లక్ష్మారెడ్డి కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఆమె గతంలో మూడుసార్లు ఇక్కడ గెలిచారు. ఇక్కడ నుంచి బిజెపి పక్షాన పోటీచేసిన ఎస్.గోపికి మూడువేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. సునీత మంత్రిగా వై.ఎస్., రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్లలో పనిచేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో పదిసార్లు రెడ్లు, నాలుగుసార్లు బిసి నేతలు ఎన్నికయ్యారు. నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ కలిసి ఎనిమిది సార్లు గెలుపొందితే, సిపిఐ ఐదుసార్లు విజయం సాధించింది. ఇక్కడ టిడిపి ఒక్కసారి కూడా గెలవలేక పోయింది. రెండుసార్లు టిఆర్ఎస్ గెలుపొందింది. మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాధరావు నర్సాపూర్‌లో మూడుసార్లు గెలిచారు. జగన్నాధరావు శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. ఆయన అంజయ్య, భవనం, కోట్ల మంత్రి వర్గాలలోను సభ్యుడిగా ఉన్నారు. కొంతకాలం ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా చేపట్టారు. డిప్యూటీ స్పీకరుగా కూడా కొంత కాలం వ్యవహరించారు. నర్సాపూర్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
పంట పొలాల మధ్య ఫార్మా వద్దు..
నర్సాపూర్ రూరల్: పచ్చని పంట పొలాల మధ్య ఫార్మా చిచ్చు వద్దంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట మహిళలు ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి కాళ్లు మొక్కి మొర పెట్టుకున్నారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే, ఇన్చార్జి ఆర్డీఓ సాయిరాం గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఫార్మా కంపెనీ వద్దంటూ ముక్తకంఠంతో చెప్పారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమ నోట్లో మట్టి కొట్టొద్దని కోరారు. ఈ కంపెనీలతో చుట్టూ పంట పొలాలు, గ్రామాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములను ఫార్మా కంపెనీ యాజమాన్యం తప్పుడు సర్వే చేయించి లాక్కున్నదని కొందరు దళితులు వారి దృష్టికి తీసుకొచ్చారు. ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని ఆపేయిస్తానని హామీ ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టడంతో మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే నచ్చజెప్పారు. -
విమర్శలు విజ్ఞతకే వదిలేస్తున్నా
సాక్షి,చిలప్‌చెడ్(నర్సాపూర్): నర్సాపూర్ నియోజక వర్గంలో అభివృద్ధి లేదన్న రేవంత్‌కు రోడ్లు, బస్‌డిపో, వంద పడకల ఆసుపత్రి. మండలాల్లో చెరువులు, కుంటలు, భగీరధ నీళ్లు, చెక్‌డ్యాంలు, గిరిజన తండాల అభివృద్ధి, తదితర విషయాలు కనబడక పోవడం ఏంటాని, తనను ఫామ్ హౌస్ కాపల కుక్క అనడం ఎంతవరకు సమంజసమో అతని విజ్ఞతకే వదిలేస్తున్నాని మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చిలప్‌చెడ్ మండలంలో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు తాను చేసిన అభివృద్ధి గురించి తెలిస్తే చాలని, ఓట్ల దొంగకు తెలియాల్సిన అవసరం లేదని మదన్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో మండల టిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నర్సాపూర్ ఎఎంసీ చైర్మెన్ హంసీబాయి, రాజిరెడ్డి, నర్సింహ్మరెడ్డి, లక్ష్మణ్, విశ్వంబర, పరుశరాంరెడ్డి, కిష్టారెడ్డి, యాదగిరి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు.. మంగళవారం ముందుగా చిలప్‌చెడ్ మండలంలోని జగ్గంపేటలో ప్రచారం ప్రారంభించిన మదన్‌రెడ్డి గ్రామంలోని నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించిన ఆయన అమ్మవారి ఆశీస్సులతో మండలంలో ప్రచారాన్ని కోనసాగించారు. అక్కడి నుంచి మండల పార్టీ నాయకులతో, కార్యకర్తలతో భారీగా బైక్ ర్యాలీతో బయలుదేరిన ఆయన మండలంలోని ఆయా గ్రామాలలో ప్రచారాన్ని కోనసాగించారు. జగ్గంపేట గ్రామంలో సుమారు 100 మంది యువకులు మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. -
స్పీడందుకున్న ‘కారు’
టీఆర్ఎస్ అభ్యుర్థులు ప్రచార జోరు పెంచారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన ప్రతీ ఓటరును కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశనం చేసిన అనంతరం వారు దూకుడు పెంచారు. పాక్షికంగా విడుదల చేసిన మేనిఫెస్టో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించాలని నిర్ణయించారు. ఐతే ఇప్పటివరకు ప్రత్యర్థులు ఎవరూ ప్రచారం ప్రారంభించకపోవడంతో ఈ లోపే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. సాక్షి, మెదక్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ప్రచారంలో దూకుడు పెంచేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. ప్రతిపక్షాల కంటే ముందే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధినేత కేసీఆర్ ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అధినేత సూచనలకు అనుగుణంగా నియోకజవర్గం అంతటా ప్రచారం నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లోని ప్రతీ ఓటరు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలిసేలా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమయాత్తం అవుతున్నారు. టీఆర్ఎస్ మినహా ఇతర రాజకీయ పార్టీలు ఏవీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మొదటి విడతలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని సుమారు 30 వరకు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి ఏడు మండలాల్లోని 50కిపైగా గ్రామాల్లో ఇప్పటి వరకు ఆయన ప్రచారం చేశారు. కాగా సోమవారం నుంచి ప్రతి రోజు రెండు మండలాల్లో పర్యటించి గ్రామాల్లో ప్రచారం నిర్వహిచేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టేలా మండలస్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలను సంసిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలే అండ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ పథకాలు, పాక్షిక మేనిఫెస్టో తమను విజయతీరాలకు చేరుస్తాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ సైతం అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులను ప్రత్యేకంగా కలిసి మద్దతు కూడగట్టాలని సూచించటంతో అందుకు అనుగుణంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లక్ష రూపాయల రుణమాఫీ, రైతబంధు, ఆసరా పింఛన్ల, డబుల్బెడ్రూమ్ పొందిన లబ్ధిదారుల సంఖ్య భాగానే ఉంది. ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఏదో ఒక పథకం కింద లబ్ధిపొందిన వారు ప్రతి నియోజకవర్గంలో 30 నుంచి 50వేల వరకు ఉంటారని నాయకుల అంచనా. ఈ లబ్ధిదారులను జాబితాను తీసుకుని వారిని నేరుగా కలిసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రచార వ్యూహాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పదును పెడుతున్నారు. -
సర్దుకుపోదాం...
సాక్షి, మెదక్: నర్సాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు వెళ్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో రగులుతున్న ఈ అసంతృప్తి జ్వాలలను చల్లార్చి అందరినీ ఏకతాటి మీదికి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్ ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు రంగంలోకి దిగుతున్నారు. గురువారం ఆయన నర్సాపూర్‌కు రానున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలకు సన్నద్దతపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పార్టీలోని అసంతృప్త నేతలతోనూ మాట్లాడి బుజ్జగించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి రాకతోనైనా నియోజకవర్గంలోని అసంతృప్తి నేతలు దారిలోకి వస్తారని మదన్‌రెడ్డి వర్గీయులు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయం తీసుకోకముందు నుంచి మదన్‌రెడ్డిపై పలువురు టీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావన ఉంది. దీనికితోడు మదన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నేత మురళీయాదవ్‌కు మధ్య తీవ్ర విభేదాలున్నాయి. మదన్‌రెడ్డికి తిరిగి ఎమ్మెల్యే టికెట్ దక్కటంతో మురళీయాదవ్లో అసంతృప్తి మరింత పెరిగింది. పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగా పోటీచేయాలని మురళీ భావించారు. అయితే మంత్రి బుజ్జగించటంలో వెనకడుగు వేశారు. పార్టీ మారనప్పటికీ మదన్‌రెడ్డితో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని, నియోజకవర్గంలో నాయకులను రెచ్చగొడుతున్నారని మదన్‌రెడ్డి వర్గీయులు బాహాటంగానే చెబుతున్నారు. ఈ విషయాన్ని మదన్‌రెడ్డి మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బుధవారం నర్సాపూర్‌కు రానున్న మంత్రి హరీష్‌రావు అసంతృప్తి నేత మురళీయాదవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడనున్నట్లు తెలిసింది. బుధవారం జరిగే సమావేశంలో మదన్‌రెడ్డి, మురళీయాదవ్‌లు కలిసిపోయారన్న భావన కార్యకర్తల్లోకి బలంగా వెళ్లేలా వారితోనే చెప్పించనున్నట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టు ఇవ్వలేదని.. ఇటీవల మృతిచెందిన టీఆర్ఎస్ నేత కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డితో కూడా మంత్రి సమావేశం అయ్యే అవకాశం ఉంది. సీపీఐ నేతగా ఉన్న కిషన్‌రెడ్డి గత ఎన్నికల్లో తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. అప్పుడు మదన్‌రెడ్డి విజయానికి ఆయన కృషి చేశారు. కిషన్‌రెడ్డికి నామినేటెడ్ పదవి ఇస్తామని టీఆర్ఎస్ అధిష్టానం హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. దురదృష్టవశాత్తు ఇటీవలే ఆయన మృతి చెందిన విషయం తెలిసిందె. టీఆర్ఎస్ అధిష్టానం తీరుపై కిషన్‌రెడ్డి భార్య సుహాసినిరెడ్డితోపాటు ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సుహాసినిరెడ్డితో సమావేశం కానున్నారు. బుధవారం నర్సాపూర్‌లో అందుబాటులో ఉండాలని, పార్టీ సమావేశానికి హాజరు కావాలని ఆమెను కోరినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దేవేందర్‌రెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. అధిష్టానం తీరుతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం జరిగే సమావేశంలో ఆయనను కూడా బుజ్జగించనున్నారు. హత్నూర జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, కొల్చారం మండల నాయకురాలు, బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మి ముదిరాజ్‌లు నర్సాపూర్ ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, నర్సాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌడిపల్లి మాజీ ఎంపీపీ యాదాగౌడ్ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదన్న అసంతృప్తితో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి దూరంగా ఉంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి నేతలను తమవైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలోని నాయకులు అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉండటం నష్టం కలిగిస్తుందని భావిస్తున్న మంత్రి హరీశ్‌రావు వారితో మాట్లాడి ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అసంతృప్తి నేతలంతా ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసేలా మంత్రి చూడనున్నారు. ఆయన చర్యలతోనైనా టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు సమసిపోతాయో లేదో వేచి చూడాల్సి ఉంది. -
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హత్నూర: రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ పధకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోందని, ఈ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన హత్నూర సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ సర్టిఫికెట్లను లబ్ధిదారులకు పంపిణీ చశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు రుణమాఫీ కింద మొదటి విడతగా రూ.4వేల కోట్లను మంజూరు చేశారన్నారు. రుణమాఫీ పొందిన రైతులకు 25శాతం రుణాన్ని తిరిగి ఇస్తారన్నారు. రాష్ట్రం మొత్తంలో రూ.18వేల కోట్లను నాలుగు విడతలుగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై ఉన్న మక్కువతో రైతు రుణమాఫీతో పాటు రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఆంధ్రలో ఉండడం వల్ల ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ సమస్య ఏర్పడిందన్నారు. మంజీరా నదిపై చెక్‌డ్యాంలు ఏర్పాటు చేసి ఎత్తిపోతల ద్వారా చెరువులను నింపి పంటలకు నీరందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా వారు రైతు రుణమాఫీ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పల్లె జయశ్రీ శ్రావణ్‌కుమార్, సొసైటీ చైర్మన్లు దుర్గారెడ్డి, లింగారెడ్డి, బ్యాంకు మేనేజర్ రమేష్, నాయకులు మురళిధర్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి, శివశంకర్‌రావు, దేవేందర్‌రావు, దుర్గంగౌడ్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.