సాక్షి, మెదక్: కౌడిపల్లి అడ్డాగా.. నర్సాపూర్ గడ్డపైరాజకీయాలను శాసించిన చిలుముల వంశం సుదీర్ఘ రాజకీయ చరిత్రకు నేటి నుంచి తెరపడనుందా... అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నర్సాపూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కౌడిపల్లికి చెందిన చిలుముల వంశస్తులు పోటీ చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కపోవడం చర్చనీయాంశంగా మారింది.
విఠల్‌రెడ్డితో మొదలుకొని..
దివంగత మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకులు చిలుముల విఠల్‌రెడ్డి నర్సాపూర్ రాజకీయాలను శాసించారు. 1952లో నర్సాపూర్ నియోజవర్గం ఏర్పడింది. 1957లో జరిగిన మొదటి ఎన్నికల్లో సీపీఐ తరపున కౌడిపల్లికి చెందిన విఠల్‌రెడ్డి పోటీ చేశారు. 1957 నుంచి 2004 వరకు 11సార్లు శాసనభకు ఎన్నికలు జరగగా విఠల్‌రెడ్డి పోటీలో ఉన్నారు.
అయిదు సార్లు గెలుపొంది ప్రజాసేవ చేశారు. అనంతరం 2009లో మహాకూటమి ఏర్పడడంతో సీపీఐ తరఫున విఠల్‌రెడ్డి కుమారుడు చిలుముల కిషన్‌రెడ్డి పోటీలో నిలిచి ఓటమి చెందారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో విఠల్‌రెడ్డి తమ్ముడి కుమారుడు చిలుముల మదన్‌రెడ్డి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మదన్‌రెడ్డి తెలుగుదేశం తరఫున రెండు సార్లు పోటీచేసి ఓటమి చెందారు.
కాంగ్రెస్ నుంచి దక్కేదెవరికో..
ప్రస్తుతం మదన్‌రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతారెడ్డికి టికెట్ ఇచ్చి బీఫామ్ అందజేశారు. టికెట్ రాదని చర్చకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పలుమార్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని పార్టీలోనికి రావాలని ఆహ్వానించినట్లు చర్చ జరిగింది.
రెండురోజుల క్రితం విఠల్‌రెడ్డి కోడలు బీఆర్‌ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు సుహాసిని కిషన్‌రెడ్డి, ఆమె కొడుకు చిలప్‌చెడ్ మండల మాజీ జెడ్పీటీసీ శేషసాయిరెడ్డిని మైనంపల్లితోపాటు కాంగ్రెస్ నాయకులు పార్టీలోనికి ఆహ్వానించారు. దీంతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చిలుముల వంశస్తులకు ఇస్తారా.. అని చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సైతం నర్సాపూర్ టికెట్ కేటాయించకపోవడంతో ఏదైనా జరగవచ్చని జనం అంటున్నారు.
ఇవి చదవండి: కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవు! : భారత ఎన్నికల కమిషన్..
Comments
Please login to add a commentAdd a comment