సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు తనకే ఉన్నాయని, మూడోసారి ఎమ్మెల్యే బరిలో ఉంటానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం హత్నూర మండలం పన్యాల గ్రామంలో గాంధీ, దివంగత బీఆర్‌ఎస్ నేత అక్బర్ విగ్రహాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, కార్యకర్తలెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.
పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, నా ధ్యాసంతా అభివృద్ధిపైనే అని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం రూ.56 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో తండాల బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 14 చెక్ డ్యామ్‌లు నిర్మించినట్లు పేర్కొన్నారు.
హత్నూర మండల కేంద్రంలో రూ.8 కోట్ల వ్యయంతో డివైడర్లు నిర్మిస్తామని, రెండు మూడు రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. పన్యాల గ్రామానికి రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి త్వరలోనే ప్రొసీడింగ్ కాపీ ఇస్తానన్నారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్ అలీ, ఎంపీపీలు నర్సింలు, కల్లూరు హరికష్ణ, జెడ్పీటీసీ ఆంజనేయులు, సర్పంచ్ శ్వేత, బీఆర్‌ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఆశావర్కర్ల వినతి..
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఆశా వర్కర్లు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment