బీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌ అభ్యర్థి ఖరారు | Sunitha Laxma Reddy Confirmed BRS Narsapur Candidate | Sakshi
Sakshi News home page

వీడిన ఉత్కంఠ.. బీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌ అభ్యర్థి ఖరారు

Published Wed, Oct 25 2023 3:57 PM | Last Updated on Wed, Oct 25 2023 6:13 PM

Sunitha Laxma Reddy Confirmed BRS Narsapur Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పేరును భారత రాష్ట్ర సమితి ఖరారు చేసింది. ఈ మేరకు స్వయంగా పేరు ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. బుధవారం ఆమెకు బీఫామ్‌ అందజేశారు. ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డికి.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 

పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ కోర్‌ కమిటీ సభ్యులు భేటీ అవుతున్నారు. ఈ క్రమంలోనే నర్సాపూర్‌ టికెట్‌ను సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వాలని సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు.

‘‘ మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటినుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్లనుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ  ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీత లక్ష్మారెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది.

ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కీలక సభ్యులకు, కార్యవర్గానికి అభినందనలు. వారి సీనియారిటిని పార్టీ గుర్తించి గౌరవించినందుకు పార్టీ మఖ్య కార్యవర్గాన్ని అభినందిస్తున్నా. మెదక్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కేవలం నర్సాపూర్ లోనే కాకుండా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వారు పాపులర్ లీడర్. వివాద రహితుడు సౌమ్యుడు మదన్ రెడ్డి గారి సేవలను పార్టీ మరింత గొప్పగా వినియోగించుకోవాల్సివుంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింప చేశారు. వారికి నా ధన్యవాదాలు అభినందనలు అని కేసీఆర్‌ తెలిపారు.

వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మూడుసార్లు నర్సాపూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్‌, కొణిజెట్టి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సీఎంలుగా ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు.  2019లో బీఆర్‌ఎస్‌లో చేరారామె. తెలంగాణ ప్రభుత్వంలో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా, సభ్యురాలిగా ఆమె పని చేశారు. 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement