టీఆర్‌ఎస్ అభ్యుర్థులు ప్రచార జోరు పెంచారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన ప్రతీ ఓటరును కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశనం చేసిన అనంతరం వారు దూకుడు పెంచారు. పాక్షికంగా విడుదల చేసిన మేనిఫెస్టో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించాలని నిర్ణయించారు. ఐతే ఇప్పటివరకు ప్రత్యర్థులు ఎవరూ ప్రచారం ప్రారంభించకపోవడంతో ఈ లోపే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
సాక్షి, మెదక్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ప్రచారంలో దూకుడు పెంచేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. ప్రతిపక్షాల కంటే ముందే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధినేత కేసీఆర్ ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అధినేత సూచనలకు అనుగుణంగా నియోకజవర్గం అంతటా ప్రచారం నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు.
గ్రామాల్లోని ప్రతీ ఓటరు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలిసేలా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమయాత్తం అవుతున్నారు. టీఆర్‌ఎస్ మినహా ఇతర రాజకీయ పార్టీలు ఏవీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ప్రచారంలో ముందంజలో ఉన్నారు.
మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మొదటి విడతలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని సుమారు 30 వరకు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి ఏడు మండలాల్లోని 50కిపైగా గ్రామాల్లో ఇప్పటి వరకు ఆయన ప్రచారం చేశారు. కాగా సోమవారం నుంచి ప్రతి రోజు రెండు మండలాల్లో పర్యటించి గ్రామాల్లో ప్రచారం నిర్వహిచేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టేలా మండలస్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలను సంసిద్ధం చేసుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలే అండ..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ పథకాలు, పాక్షిక మేనిఫెస్టో తమను విజయతీరాలకు చేరుస్తాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ సైతం అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులను ప్రత్యేకంగా కలిసి మద్దతు కూడగట్టాలని సూచించటంతో అందుకు అనుగుణంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లక్ష రూపాయల రుణమాఫీ, రైతబంధు, ఆసరా పింఛన్ల, డబుల్‌బెడ్‌రూమ్ పొందిన లబ్ధిదారుల సంఖ్య భాగానే ఉంది.
ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఏదో ఒక పథకం కింద లబ్ధిపొందిన వారు ప్రతి నియోజకవర్గంలో 30 నుంచి 50వేల వరకు ఉంటారని నాయకుల అంచనా. ఈ లబ్ధిదారులను జాబితాను తీసుకుని వారిని నేరుగా కలిసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రచార వ్యూహాలకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పదును పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment