Padmadevedar Reddy
-
నేను ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా..మీ కోసమే
సాక్షి, సిద్దిపేట : ‘కేసీఆర్ బక్కపల్చగా ఉన్నాడంటున్నారు. ఈ కొస నుండి ఆ కొస వరకు వేలాది మంది జనం ఉన్నారు. ఎంత లావుగా ఉన్నాను.. నేను ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా.. మీరు ఉన్నారనే ధైర్యమే.. కేసీఆర్ ఏం చేసినా మీ బలం చూసుకొనే’నని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం గజ్వేల్ నియోజకవర్గం సీఎం ఫాం హౌజ్ ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘నా సొంత నియోజకవర్గం అయినా.. ప్రచారం చేయకున్నా.. మీకు మేమున్నాం.. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం.. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వెళ్లండి అని చెప్పిన మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ’ని అన్నారు. సాధారణంగా ఎమ్మెల్యేలు అదృష్టవంతులని, నియోజకవర్గం ప్రజలతో ఎప్పుడూ మమేకం అవుతూ ఉంటారని అన్నారు. కానీ నాకు రాష్ట్ర బాధ్యతలు ఉన్నందున మీ మధ్య ఉండలేకపోతున్నానని చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేసింది తక్కువేనని చెప్పారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. గజ్వేల్ అంటే ఇప్పుడు దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటున్న ప్రాంతం అన్నారు. ఇక్కడ ప్రారంభించిన మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇల్లు.. ఇలా సంక్షేమ పథకాలను ఇతర ప్రాంతాల నుండి వచ్చి చూసిపోతున్నారని చెప్పారు. మోడల్ గజ్వేల్గా మారుస్తా.. ఇప్పుడున్న అభివృద్ధికి తోడు ఇక ముందు కూడా గజ్వేల్‌ను ఒక మోడల్ నియోజకవర్గంగా మారుస్తానని అన్నారు. ఇప్పటికే డివిజన్ కేంద్రంగా మార్చుకున్నామని.. ఆర్డీవో, డీఎస్సీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని చెప్పారు. ఎన్నికల తర్వాత రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ప్రతీ గ్రామం నుండి కార్యకర్తలను పిలుచుకొని గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామాలు ఎలా ఉన్నాయి.. ఇక ముందు ఏం చేయాలి అనే విషయాలు కూలంకశంగా చర్చిస్తామని, అదే విధంగా ప్రణాళికను అమలు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు. 18 సంవ్సరాలు నిండిన అందరికీ ఇల్లు అభివృద్ధి అంటే మాటలు చెప్పి ఊరుకోవడం కాదని, చివరి వరకు అంకిత భావంతో పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం పథకం ద్వారా నిర్మాణాలు కొనసాగుతాయని, సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందస్తామని అన్నారు. అదేవిధంగా కొండపోచమ్మ తల్లి పేరుతో నిర్మించే ప్రాజెక్టు.. తల్లి దయతో త్వరలో పూర్తవుతుందని, దీంతో నియోజకవర్గంలోని ప్రతీ గుంటకు సాగునీరు అందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పుడు వ్యవసాయం, కూరగాయలు, ఇతర లాభదాయకమైన పంటలు పండించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి నూరుశాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు అందజేస్తామని హామీ తెలిపారు. గజ్వేల్‌కు ఫుడ్ ప్రాసెస్సింగ్ పరిశ్రమను తీసుకొస్తామని.. తద్వారా కల్తీ లేని ఆహార పదార్థాలు అందుతాయని చెప్పారు. వేగంగా రైల్వే పనులు గజ్వేల్ పట్టణం మీదుగా వెళ్లే కొత్తపల్ల–మనోహరాబాద్ రైల్వే పనులు వేగంగా సాగుతున్నాయని కేసీఆర్ అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా కరీంనగర్ రైల్వే లైన్‌కు కలుస్తుందని చెప్పారు. అక్కడి నుండి ఎడమ వైపుకు పోతే ఢిల్లీ, కుడి వైపుకు ముంబై రైలు మార్గం ఉంటుందని అన్నారు. దీంతో గజ్వేల్‌కు దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు మార్గాలు అందుబాటులో ఉంటాయని, సరుకుల రవాణా మొదలైనవి సులభతరం అవుతాయని వివరించారు. ఒకవైపు పరిశ్రమలు మరోవైపు రైలు మార్గం, ఇతర వసతులతో గజ్వేల్ పట్టణం విస్తీర్ణం పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రతీ గ్రామానికి రోడ్లు వేశామని, మిగిలిన వాటికి కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచేలా చేస్తామని అన్నారు. ఎన్నికల వేళ పరిశీలకులు మన వైపే చూస్తారని, నిబంధనలు పాటించాలని కార్యకర్తలకు సూచించారు. అభివృద్ధిపై రిలాక్స్ కావద్దని హరీశ్‌కు నేర్పించాను నాయకుడికి ఎప్పుడూ కొత్తపనులు చేయాలనే తపన ఉండాలని.. చేసిన అభివృద్ధిని చూసి రిలాక్స్ అయితే మన పని అంతేనని హరీశ్‌రావుకు నేర్పించానని కేసీఆర్ అన్నారు. స్థానిక జెడ్పీటీసీ మాధురీ నన్ను వెంకటేశ్వర స్వామి, సాయిబాబాతో పోల్చారని.. అయితే పొగడ్తలకు ఉబ్బి పోవడం, డబ్బాలు కొట్టుకోవడం కాదన్నారు. గతం కన్నా గజ్వేల్ నియోజకవర్గం కొంత మెరుగైందని అన్నారు. మానవ జాతి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయని, మన దగ్గరే కాదు.. అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని అధిగమించడం కోసం నిరంతరం శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి అభివృద్ధి సరిపోదని, ఇక్కడే ఆగిపోవాలని పక్క నియోజకవర్గం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చూస్తున్నారని చమత్కరించారు. గుంట నక్కలకు బుద్ధి చెప్పాలి: ఎంపీ గజ్వేల్ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లలో గజ్వేల్ నియోజకవర్గం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందని చెప్పారు. అయితే దీనిని అడ్డుకునేందుకు పలువురు గుంటనక్కలు కాచుకొని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులైన గుంట నక్కలకు ఓటు ద్వారా బుద్ది చెప్పి డిపాజిట్ గల్లంతు అయ్యేలా చూడాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ఖ్యాతిని చాటిన కేసీఆర్: సిధారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాసను, భాషను ఎగతాళి చేశారని, మన రాష్ట్రం మనకు వచ్చాక ప్రపంచ దేశాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో తెలుగు మహాసభలు నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. నా చిన్నప్పుడు సభలకు వెళ్లేందుకు డబ్బులు లేవని.. ఇప్పుడు నా చేతుల మీదుగా సభను నిర్వహించే భాగ్యం కలుగజేశారని చెప్పారు. ప్రత్యేక విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు. ప్రాజెక్టులు పూర్తితో తెలంగాణ మాగాణుల్లో సిరుల పంటలు పండుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, రాష్ట్ర వివిధ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, నాయకులు కొత్తల యాదగిరిరెడ్డి, చిన్న మల్లయ్య, డాక్టర్ యాదవరెడ్డి, జెడ్పీటీసీ మాధురి, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, రిటైర్డ్ ఇంజనీర్ గుప్తా, సింగం సత్తయ్య, లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా గెలవబోతున్నాం.. జగదేవ్‌పూర్(గజ్వేల్): ‘గజ్వేల్ ప్రజలు చాలా గొప్పవాళ్లు. గతంలో గెలిచిన వాళ్లు ఎంతోకొంత అభివృద్ధి చేస్తేనే మూడు నాలుగు సార్లు గెలిపించారు. అలాంటిది సీఎం కేసీఆర్ నాలుగున్నరేళ్లలోనే నియోజకవర్గాన్ని 20 ఏళ్లు ముందుకు తీసుకుపోయార’ని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సమీపంలో కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో గెలిచిన వారంతా ఒకటి రెండు అభివృద్ధి పనులకే పరిమితం అయ్యారని, కేసీఆర్ మాత్రం గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. దేశం మొత్తం గజ్వేల్ వైపు చూసేలా అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిలో, మెజార్టీలో ఆదర్శంగా ఉన్న గజ్వేల్.. ఎన్నికల నిబంధనలు పాటించడంలోనూ ఆదర్శంగా నిలవాలని కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్త ఎన్నికల నియమాలు తూ.చ తప్పకుండా పాటించాలని సూచించారు. బూత్‌కమిటీ సభ్యులు సమన్వయంగా ప్రచారం చేయాలని సూచించారప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను తీసుకపోవాలని, 90 శాతం ఓటర్లు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, మిగతా పది శాతం కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు.గజ్వేల్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. ఎదుటి పార్టీ వాళ్లకు డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు. 25 రోజుల పాటు గ్రామాల్లోనే కార్యకర్తలు ఉంటూ ప్రచారం చేయాలని, చేసిందే చెప్పాలని, చేయబోయేది మేనిఫెస్టో వివరాలను ఇంటింటికీ తీసుపోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాంచంద్రం, సత్తయ్య, మధూరి, వెంకటేశం, రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, రఘుపతిరావు, సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు రంగారెడ్డి, మధు, శ్రీనివాస్, దుర్గయ్య,జహంగీర్ తదితరులు పాల్గొన్నారు. -
పద్మకు చుక్కెదురు
రామాయంపేట(మెదక్): మెదక్ నియోజకర్గం టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారంలో చుక్కెదురైంది. శనివారం రామాయంపేట పట్టణంలో నిర్వహించిన ప్రచారానికి నిరసన సెగ తగిలింది. ఒక వైపు ఆమె కార్యకర్తలతో కలిసి ఉప్పరి బస్తీలో ప్రచారం నిర్వహిస్తుండగా, పక్కనే ఉన్న వీధుల మహిళలు రోడ్డుకు అడ్డంగా ఖాళీ బిందెలు ఉంచి మా ఇళ్ల వద్దకు ప్రచారాని రావొద్దని నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి తాము నీటి ఎద్దడి ఎదుర్కుంటున్నా.. ఏనాడు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఓట్లప్పుడే వస్తున్న నాయకులు తమ సమస్యలు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు వారిని సముదాయించి రోడ్డుకు అడ్డంగా పెట్టిన బిందెలను తొలగించగా, తర్వాత పద్మ అక్కడికి చేరుకొని మహిళలతో మాట్లాడారు. గల్లీల్లో పైప్‌లైను పనులు జరుగుతున్నాయని, మరో 15 రోజుల్లో ఇంటింటికీ నీరు అందుతుందని చెప్పి ఆమె ప్రచారానికి వెళ్లిపోయారు. మరోవైపు అక్కలబస్తీలో యువకులు కొందరు రోడ్డుకు అడ్డంగా నిలబడి పద్మకు, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ కాలనీలో నయాపైసా పనులు చేయలేదని, కనీసం వార్డు సభ్యుడు చేసిన పనులు సైతం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వారు స్థానిక నాయకులను అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు యువకులను సముదాయించారు. కాగా కాలనీల్లో ఇంతవరకు పైప్‌లైను నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడంతో పద్మాదేవేందర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు. -
పద్మాదేవేందర్ రెడ్డి ప్రచారంలో ఉద్రిక్తత
మెదక్ రూరల్: ఎన్నికల వేడి ఊపందుకుంటొంది. ఒకరిపై ఒకరు వ్యూహప్రతివ్యూహాలకు తెరలేపుతున్నారు. ఎన్నికల ప్రచారంలో రాజకీయం ప్రదర్శిస్తూ సమస్యాత్మక వాతావరణానికి ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి పరిణామాలు బుధవారం మెదక్ మండలంలో జరిగిన ప్రచారంలో స్పష్టమయ్యాయి. మెదక్ మండలంలో టీఆర్ఎస్ మెదక్ అసెంబ్లీ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో శివాయిపల్లి, తిమ్మానగర్ గ్రామాల్లో ప్రచారం ప్రారంభించిన కొద్ది సేపటికే ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు, ము గ్గురు వ్యక్తులు రోడ్లు, గ్రామాభివృద్ది, ఇళ్లు వంటి సమస్యలపై నిలదీసే ప్రయత్నం చేశారు. గ్రామానికి ఏం చేశారని, ఓట్లు అడిగేందుకు వచ్చారంటూ ప్రశ్నిస్తుండగా అక్కడే ఉన్న టీఆర్ఎస్ కా ర్యకర్తలు తిరగబడ్డారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకానొక దశలో దాడి ప్రతి దాడులు చేసుకునే వరకు దారితీసింది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం ఓటమి భయంతోనే కాంగ్రెస్ వాళ్లు ప్రతి గ్రామంలో ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టి ప్రచారానికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ప్రచారంలో ఎవరు చెప్పుకునేది వాళ్ళు చెప్పుకుంటారని ప్రజలు ఎవరిని నమ్మితే వారికే ఓటు వేస్తారన్నారు. సిద్దాంతపరంగా ఎన్నికల ప్రచారానికి గ్రామాలకు వెళ్ళాలి. కానీ సమస్యాత్మకంగా ఉండకూడదని హితవు పలికారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు పద్దతి మార్చుకోవాలని, లేకుంటే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ వాళ్లు తమాషా చేస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో కాంగెస్ ప్రచారం నిర్వహిస్తే అడ్డుకోవడానికి తమ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారని ఘాటుగా వాఖ్యానించారు. -
స్పీడందుకున్న ‘కారు’
టీఆర్ఎస్ అభ్యుర్థులు ప్రచార జోరు పెంచారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన ప్రతీ ఓటరును కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశనం చేసిన అనంతరం వారు దూకుడు పెంచారు. పాక్షికంగా విడుదల చేసిన మేనిఫెస్టో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఓటరుకు వివరించాలని నిర్ణయించారు. ఐతే ఇప్పటివరకు ప్రత్యర్థులు ఎవరూ ప్రచారం ప్రారంభించకపోవడంతో ఈ లోపే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. సాక్షి, మెదక్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ప్రచారంలో దూకుడు పెంచేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. ప్రతిపక్షాల కంటే ముందే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధినేత కేసీఆర్ ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అధినేత సూచనలకు అనుగుణంగా నియోకజవర్గం అంతటా ప్రచారం నిర్వహించే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లోని ప్రతీ ఓటరు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కలిసేలా ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇటీవల ప్రకటించిన పాక్షిక మేనిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమయాత్తం అవుతున్నారు. టీఆర్ఎస్ మినహా ఇతర రాజకీయ పార్టీలు ఏవీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి మొదటి విడతలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని సుమారు 30 వరకు గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి ఏడు మండలాల్లోని 50కిపైగా గ్రామాల్లో ఇప్పటి వరకు ఆయన ప్రచారం చేశారు. కాగా సోమవారం నుంచి ప్రతి రోజు రెండు మండలాల్లో పర్యటించి గ్రామాల్లో ప్రచారం నిర్వహిచేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టేలా మండలస్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలను సంసిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలే అండ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ పథకాలు, పాక్షిక మేనిఫెస్టో తమను విజయతీరాలకు చేరుస్తాయని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ సైతం అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులను ప్రత్యేకంగా కలిసి మద్దతు కూడగట్టాలని సూచించటంతో అందుకు అనుగుణంగా అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లక్ష రూపాయల రుణమాఫీ, రైతబంధు, ఆసరా పింఛన్ల, డబుల్బెడ్రూమ్ పొందిన లబ్ధిదారుల సంఖ్య భాగానే ఉంది. ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఏదో ఒక పథకం కింద లబ్ధిపొందిన వారు ప్రతి నియోజకవర్గంలో 30 నుంచి 50వేల వరకు ఉంటారని నాయకుల అంచనా. ఈ లబ్ధిదారులను జాబితాను తీసుకుని వారిని నేరుగా కలిసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉన్న ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రచార వ్యూహాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పదును పెడుతున్నారు. -
పద్మక్క శంఖారావం
మెదక్ నియోజకవర్గంలో గులాబీ సైన్యం కదం తొక్కింది. బుధవారం మెదక్ పట్టణంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ముందస్తు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఈ సందర్భంగా చిన్నశంకరంపేట మండలం లో గిరిజనులు బహూకరించిన కత్తిని చూపుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. మెదక్ జోన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడి రైతుల పాదాలు కడుగుతామని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలో ఆమె మొదటిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడి రైతుల కళ్లలో కన్నీళ్లు రానివ్వకుండా చేస్తామన్నారు. జిల్లా హెడ్‌క్వార్టర్‌గా చేసి ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చామన్నారు. తనకు మరోసారి టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మళ్లీ మరోసారి ఆశీర్వదిస్తే నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి రాధాకృష్ణశర్మ, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ అకిరెడ్డి కృష్ణారెడ్డి, రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగ నరేందర్, మున్సిపల్ వైస్‌చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్లు అంకం చంద్రకళ, బట్టి సులోచన, జెల్ల గాయత్రి, వెంకటరమణ, మాయ మల్లేశం, ఆర్కె శ్రీనివాస్, మెదక్ ఎంపీపీ లక్ష్మీ కిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, జెడ్పీటీసీ బిజ్జ విజయలక్ష్మి, నాయకులు లింగారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, జీవన్‌రావు, గడ్డమీది కృష్ణాగౌడ్, సంగశ్రీకాంత్, సాయిలు పాల్గొన్నారు. పలువురి ఆశీర్వచనాలు.. అంతకు ముందు పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి భారీగా బైక్ ర్యాలీగా ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి వెళ్లారు. దీంతో మెదక్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల నుంచి సుమారు మూడు వేలకు పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడి నుంచి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ వేద బ్రాహ్మణులు భాష్యం మధుసూదానాచార్యులు, వైద్య శ్రీనివాస్‌లు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం పట్టణంలోని పిట్లం చెరువు కట్టపై దర్గాలో, మెదక్ సీఎస్ఐ చర్చ్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతకుముందు ప్రచార రథంలో మెదక్‌కు చేరుకున్న పద్మాదేవేందర్‌రెడ్డికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు బాణా సంచాలు కాలుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. -
నువ్వేం రాణిస్తావన్నారు..?
తెలంగాణ రాజకీయ చిత్రపటంలో ఆమెది ప్రత్యేక స్థానం. తెలంగాణ సాధనలో పురుషులతో సమానంగా ఉద్యమించిన సాహసి. రాజకీయ నేపథ్యం లేకున్నా ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్న నాయకురాలు ఆమె. అసెంబ్లీని సజావుగా నడుపుతూ అందరి మన్ననలు పొందుతున్న ఉపసభాపతి.. ఆమె.. మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి. మహిళగా ఆమె రాజకీయ ప్రస్థానం భావితరాల మహిళలకు స్ఫూర్తిదాయకం. మహిళా దినోత్సవం సందర్భంగా తాను ఎదుర్కొన్న కష్టాలు, రాజకీయరంగ ప్రవేశం తదితర అంశాలను తెలియజేస్తూనే మహిళా సాధికారత సాధన, స్త్రీ పురుష అసమానతలు, గృహహింస, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ తదితర అంశాలపై సాక్షి తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆమె పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, మెదక్ : మహిళామణులందరికీ ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా సాధికారత గురించి ప్రజాప్రతినిధులు ఉసన్యాసాలు ఇవ్వడం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అయినా మహిళ సంక్షేమం, అభివృద్ధి, సాధికారతకు సంబంధించి ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. మహిళా హక్కుల సాధనలో అమెరికా, యూరప్‌లాంటి దేశాలు ముందంజలో ఉన్నాయి. మహిళా హక్కుల సాధనలో ఆదేశాల సరసన మనమూ నిలబడాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఆడ పిల్లలు, మగ పిల్లల మధ్య తల్లిదండ్రులు అసమానతలను చూపించటం నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఇది మారాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలను పెంచాలి. వారి మనోభావాలను గౌరవించాలి. మగ పిల్లలతో సమానంగా ఎదిగేందుకు అవసరమైన వాతావరణం, అవకాశాలు కల్పించాలి. ఆడపిల్లలు ఎదగటంలో తల్లిదండ్రులతే కీలకపాత్ర. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రగులు గుర్తెరగాలని నా మనవి. అసమానతలు, వివక్షకు గురయ్యే మహిళలు దైర్యంగా ఎదుర్కొని తిప్పకొట్టాల్సిన అవసరం ఉంది. మహిళలు రాజకీయాల్లో రావాలి.. ఆకాశంలో సగ భాగమైన మహిళ ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తోంది. అలాగే రాజకీయరంగంలోనూ రాణించాల్సిన అవసరం ఉంది. రాజకీయ రంగం అంటరానిదేమి కాదు. చదువుకున్న యువతులు, సామాజిక స్ప్రహా ఉన్న మహిళలు పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మహిళలు తమంతట తాము రాజకీయాల్లోకి వచ్చే సానుకూల పరిస్థితులు దేశంలో లేవు. ఈ పరిస్థితి మారాలంటే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయడం వల్ల మహిళలు రాజకీయాల్లోకి రావడం ఆరంభమైంది. ప్రస్తుతం తెలంగాణలోని మహిళా శాసనసభ్యులు తమ నియోజకవర్గ అభివృద్ధికి పాలుపడుతూనే మహిళా సమస్యలపైనా స్పందిస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా శాసనసభ్యులు తమవంతు పాత్ర పోషించటం ముదావాహం. ధైర్యం ముందుకు సాగాను మహిళవు నువ్వు రాజకీయాల్లో ఏం రాణిస్తావని మొదట కొంత మంది నన్ను నిరుత్సాహ పరిచే ప్రయత్నం చేశారు. అయితే నా భర్త దేవేందర్‌రెడ్డి, మా అమ్మ నన్ను రాజకీయాల్లో ప్రవేశించేలా ప్రోత్సహించారు. రామాయంపేట జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నేను ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాను. అయినా ఎక్కడా వెరవలేదు. ధైర్యం ముందుకు సాగాను. ఉద్యమంలో రోడ్లపైకి వచ్చి పోరాటం చేశాను. నా పోరాటస్ఫూర్తి నచ్చి ప్రజలను మూడు పర్యాయాలు నన్ను శాసనసభకు పంపారు. ప్రత్యేక మహిళా పోలీస్టేషన్లతో.. మహిళలను గౌరవించాలన్న ఆలోచనను కన్నతల్లి మగపిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ‘షీ టీమ్స్’ ఏర్పాటుతో మహిళలపై వేధింపులు, దాడులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం మహిళ రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళా పోలీస్టేషన్లను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయటం సంతోషదాయకం. ప్రతీ ఆడపల్లిను తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం మానుకోవాలి. మహిళలు ఆత్మన్యూనతను వీడి పురుషులతో సమానంగా పోటీ పడాలి. విద్య, ఆర్థిక స్వావలంభనతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. ప్రతి ఆడపల్లి ఉన్నత చదువులు చదవాలి. ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఆడపిల్లల్లో ధైర్యం నూరిపోయాలి. తెలంగాణ సాధనలోనూ కీలకపాత్ర తెలంగాణ ఉద్యమ సమయంలో పద్మా దేవేందర్ రెడ్డి(ఫైల్ ఫోటో) తెలంగాణ సాధనలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మహిళా ఉద్యోగినులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మానసంపదను కాపాడుకోవాలన్న తలంపుతో ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. బాలింత, బిడ్డ సంక్షేమం కోసం రూ.13వేలు అందజేస్తోంది. ఆడపిల్ల పెళ్లిళ్ల కోసం షాదీముబారక్, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలను అమలు చేస్తోంది. ఆడపిల్లల చదువులకోసం కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు నడపుతోంది. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతకాలని, నీటి కష్టాలను తీర్చేందుకు మిషన్‌భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. ఉపసభాపతిగా అసెంబ్లీలో నిష్ఫక్షపాతంగా వ్యవహరిస్తాను. మహిళా సభ్యులు మహిళా సమస్యలపై మాట్లాడేందుకు ముందుకువస్తే వారికి ప్రాధాన్యత ఇస్తాను. -
పేరుకే మల్లె చెరువు.. నీరు కలుషితం
♦ మల్లెచెరువు కలుషితం ♦ దుర్వాసన వెదజల్లుతున్న వైనం ♦ ఇబ్బందులుపడుతున్నపరిసర ప్రాంత ప్రజలు ♦ సుందరీకరణ పనులు చేపట్టాలని స్థానికుల వినతి రామాయంపేట(మెదక్) : ఆహ్లాదాన్ని పంచాల్సిన రామాయంపేటలోని మల్లె చెరువు ప్రజలను అనారోగ్యం పాలుచేస్తోంది. పూర్తిగా కలుషితమైన ఈచెరువు నీరు రంగు కూడా మారింది. చెరువులో నీరు తాగితే పశువులతో పాటు మనుషులు సైతం అనారోగ్యానికి గురికావడం ఖాయం. చెరువు పరిసరాల్లో ఉన్న బోర్లలో మురుగునీరు వస్తున్నా వి«ధిలేక నీటినే వినియోగించుకుంటున్నారు. రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్డును ఆనుకుని ఉన్న మల్లెచెరువు పూర్తిగా కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణంలోని మురుగు నేరుగా చెరువులోకి చేరుతుంది. దీనికితోడు స్థానికులు చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా చెరువులో వదిలేస్తున్నారు. దీంతో చెరువు నీరు రంగు మారింది. ఏళ్లతరబడి ఈ తతంగం కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. గతంలో ఉన్నతాధికారులతోపాటు మంత్రి, డీపీఓ, ఇతర అధికారులు పరిశీలించి మురుగు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం చెరువులోని చేపలు మొత్తం మృత్యువాత పడ్డాయి. చెరువులో పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం పేరుకుపోయింది. చెరువును ఆనుకొని ఉన్న రామాయంపేట, సిద్దిపేట రోడ్డు గుండా వెళ్లేవారు దుర్గంధం భరించలేకపోతున్నామని చెబుతున్నారు. కాగా చెరువు పరిసరాల్లో నివాసం ఉండేవారు బోరునీటిని తాగవద్దని ఆదేశాలు జారీచేశారు. చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తాం ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్న మల్లెచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.రూ.5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. – పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీస్పీకర్