పేరుకే మల్లె చెరువు.. నీరు కలుషితం
♦ మల్లెచెరువు కలుషితం
♦ దుర్వాసన వెదజల్లుతున్న వైనం
♦ ఇబ్బందులుపడుతున్నపరిసర ప్రాంత ప్రజలు
♦ సుందరీకరణ పనులు చేపట్టాలని స్థానికుల వినతి
రామాయంపేట(మెదక్) :
ఆహ్లాదాన్ని పంచాల్సిన రామాయంపేటలోని మల్లె చెరువు ప్రజలను అనారోగ్యం పాలుచేస్తోంది. పూర్తిగా కలుషితమైన ఈచెరువు నీరు రంగు కూడా మారింది. చెరువులో నీరు తాగితే పశువులతో పాటు మనుషులు సైతం అనారోగ్యానికి గురికావడం ఖాయం. చెరువు పరిసరాల్లో ఉన్న బోర్లలో మురుగునీరు వస్తున్నా వి«ధిలేక నీటినే వినియోగించుకుంటున్నారు.
రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్డును ఆనుకుని ఉన్న మల్లెచెరువు పూర్తిగా కలుషితమై దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణంలోని మురుగు నేరుగా చెరువులోకి చేరుతుంది. దీనికితోడు స్థానికులు చెత్తా చెదారాన్ని విచ్చలవిడిగా చెరువులో వదిలేస్తున్నారు. దీంతో చెరువు నీరు రంగు మారింది. ఏళ్లతరబడి ఈ తతంగం కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. గతంలో ఉన్నతాధికారులతోపాటు మంత్రి, డీపీఓ, ఇతర అధికారులు పరిశీలించి మురుగు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రెండేళ్ల క్రితం చెరువులోని చేపలు మొత్తం మృత్యువాత పడ్డాయి. చెరువులో పెద్ద సంఖ్యలో ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం పేరుకుపోయింది. చెరువును ఆనుకొని ఉన్న రామాయంపేట, సిద్దిపేట రోడ్డు గుండా వెళ్లేవారు దుర్గంధం భరించలేకపోతున్నామని చెబుతున్నారు. కాగా చెరువు పరిసరాల్లో నివాసం ఉండేవారు బోరునీటిని తాగవద్దని ఆదేశాలు జారీచేశారు. చెరువు కట్టను మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తాం
ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురవుతున్న మల్లెచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మారుస్తాం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.రూ.5 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం.
– పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీస్పీకర్