ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్‌బండ్‌’.. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు బేఖాతర్‌! | Hyderabad Serilingampally Khajaguda Mini Tank Bund Works Pending | Sakshi
Sakshi News home page

Hyderabad: ప్రతిపాదనల్లోనే ‘మినీ ట్యాంక్‌బండ్‌’.. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు బేఖాతర్‌!

Published Mon, Sep 19 2022 5:09 PM | Last Updated on Mon, Sep 19 2022 5:09 PM

Hyderabad Serilingampally Khajaguda Mini Tank Bund Works Pending - Sakshi

రాయదుర్గం: నగర శివారులోని ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌కు చేరువలో ఆహ్లాదాన్ని పంచే చెరువు.. దాని పక్కనే మట్టి, బండరాళ్లతో కూడిన కొండ.. ఇలా ప్రకృతి అందాలతో ఆకట్టుకొనఖాజాగూడ పెద్ద చెరువు రూపురేఖలు మార్చే ప్రక్రియ ఇంకా ప్రతిపాదన దశకే పరిమితమైంది. ఇప్పటికే ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో మగ్గుతుండటం విడ్డూరం. చెరువుకు పక్కనే లింకురోడ్లను అభివృద్ధి చేయడం, ఒకవైపు గ్రీనరీ ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంతం కొంత వరకూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.

ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఎంతో ఉంది. ఖాజాగూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే లింకురోడ్డులో కుడివైపు, ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ఎదురుగా 39 ఎకరాల్లో విస్తరించి ఉంది ఖాజాగూడ పెద్ద చెరువు. శివారులోని దుర్గంచెరువు, మల్కంచెరువు తరహాలోనే దీన్ని కూడా అభివృద్ధి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు సేద తీరి ఆహ్లాదం పొందేందుకు అనువైన ప్రాంతంగా మారేందుకు అవకాశం ఉంది.  

ఒకప్పుడు బతుకమ్మల నిమజ్జన చెరువు... 
ఖాజాగూడ పరిసరాల్లోని వారు బతుకమ్మ ఉత్సవాల సమయంలో పెద్ద చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ చేసేది. బతుకమ్మ పండగు సమయంలో మాత్రమే ఈ చెరువు వద్ద సందడి నెలకొనేది. ప్రస్తుతం చెరువును ఆనుకొని లింక్‌ రోడ్డు  ఏర్పాటు చేయడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. 

లింకురోడ్డుతో కొత్త కళ..
ఖాజాగూడ, గచ్చిబౌలి లింకురోడ్డు నిర్మాణంతో ఈ చెరువుకు కొత్త అందం రావడమే కాకుండా ఈ ప్రాంత రూపురేఖలు కూడా మారిపోయాయి.  
ఈ లింకురోడ్డుకు రెండువైపులా ఫుట్‌పాత్‌లు, ఆకట్టుకునేలా గ్రీనరీని కూడా ఏర్పాటు చేశారు. 
చెరువు వద్ద లింకురోడ్డు పక్కనే మౌనముద్రలోని శిల్పంపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.   
ఈ చెరువుకు ఒకవైపు బండరాళ్లు, మట్టితో కూడిన భారీ కొండ ఉండటంతో ఇది మరింత ఆకట్టుకునేలా మారింది. 
ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, అంతగా ట్రాఫిక్‌ సమస్య ఉండకపోవడంతో వాకర్స్‌ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 
వాకర్స్, సందర్శకులు గ్రీనరీ మధ్య కూర్చోవడానికి బళ్లలు అందుబాటులోకి తెచ్చారు.  
ఈ లింకురోడ్డు సెంట్రల్‌ డివైడర్‌పై ఏర్పాటు చేసిన భారీ బండరాళ్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. 
కానరాని వాటర్‌ ఫౌంటేన్లు...ఫ్లోటింగ్‌ ప్లాంట్స్‌ 
ఖాజాగూడ పెద్ద చెరువు పక్కనుంచే లింకురోడ్డు ఏర్పాటు చేయడంతో దాని పక్కనే చెరువుకు ఆనుకొని గ్రీనరీని ఆకట్టుకునే తరహాలో మార్చారు. 
ఇదే సమయంలో ప్రారంభంలో చెరువులో వాటర్‌ ఫౌంటేన్లు, ఫ్లోటింగ్‌ ప్లాంట్స్‌ను కూడా ఏర్పాట్లు చేశారు. కానీ అవి నేడు కనుమరుగయ్యాయి. 
మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు బేఖాతర్‌.. 
సరిగ్గా మూడున్నరేళ్ల క్రితం సాక్షాత్తు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఈ చెరువు పక్కనే నిర్మించిన లింకురోడ్డు పనులను తనిఖీ చేశారు. 
ఈ సందర్భంగా రోడ్డు పక్కనే ఉన్న ఈ చెరువును చూసి ఆయన ‘ఖాజాగూడ చెరువు చాలా బాగుంది....దీన్ని అభివృద్ధి చేసి మినీట్యాంక్‌బండ్‌గా మార్చండి....ఈ ప్రాంత ప్రజలు వీకెండ్స్‌లో సేదతీరేలా దీన్ని వీకెండ్స్‌ స్పాట్‌గా మార్చాలి’ అని అధికారులను ఆదేశించారు.  
అయితే, ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కేవలం గ్రీనరీని అభివృద్ధి చేయడంతో పాటు మౌనముద్రలో మనిషి చిత్రాన్ని ఆకట్టుకునే తరహాలో ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. 

‘శివారు వీకెండ్‌స్పాట్‌’, ‘సండే ఫండే’లకు అనువైన చోటు ..  
ఖాజాగూడ పెద్ద చెరువును వీకెండ్స్‌ స్పాట్‌గా మార్చి, తొలగించిన రెండు ఫౌంటేన్లు, ఫ్లోటింగ్‌ ప్లాంట్స్‌ను పునరుద్ధరిస్తే మరింత అందం పెరిగే అవకాశం ఉంది. 
చెరువుకు ఆనుకొనే నిర్మించిన రోడ్డు పక్కనే ఫుట్‌పాత్‌ల మాదిరిగా చెరువు చుట్టూ వాకింగ్‌ ట్రాక్, సైకిల్‌ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేయాలి 
► శని, ఆదివారాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి ప్రజలు వాకింగ్, సైక్లింగ్‌ చేయడంతో పాటు, ట్యాంక్‌బండ్‌పై మాదిరిగా ‘సండేఫండే’ ఈవినింగ్‌ తరహాలా మార్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  
మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, కాఫెటేరియా, టిఫిన్స్‌ సెంటర్‌ వంటివి ఏర్పాటు చేస్తే సందర్శకుల సంఖ్య కూడా పెరిగే అవకాశం లేకపోలేదు.
చదవండి: ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్‌ అంటూ మహిళకు కాల్స్‌ చేసి చివరకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement