నేను ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా..మీ కోసమే | KCR Said Telangana People Are My Strength | Sakshi
Sakshi News home page

నేను ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా..మీ కోసమే

Published Mon, Nov 12 2018 1:04 PM | Last Updated on Mon, Nov 12 2018 1:11 PM

KCR Said Telangana People Are My Strength - Sakshi

సమావేశానికి హాజరైన గజ్వేల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు

సాక్షి, సిద్దిపేట :  ‘కేసీఆర్‌ బక్కపల్చగా ఉన్నాడంటున్నారు. ఈ కొస నుండి ఆ కొస వరకు వేలాది మంది జనం ఉన్నారు. ఎంత లావుగా ఉన్నాను.. నేను ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా.. మీరు ఉన్నారనే ధైర్యమే.. కేసీఆర్‌ ఏం చేసినా  మీ బలం చూసుకొనే’నని రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆదివారం గజ్వేల్‌ నియోజకవర్గం సీఎం ఫాం హౌజ్‌ ఎర్రవల్లిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘నా సొంత నియోజకవర్గం అయినా.. ప్రచారం చేయకున్నా.. మీకు మేమున్నాం.. అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం.. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వెళ్లండి అని చెప్పిన మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ’ని అన్నారు.

సాధారణంగా ఎమ్మెల్యేలు అదృష్టవంతులని, నియోజకవర్గం ప్రజలతో ఎప్పుడూ మమేకం అవుతూ ఉంటారని అన్నారు. కానీ నాకు రాష్ట్ర బాధ్యతలు ఉన్నందున మీ మధ్య ఉండలేకపోతున్నానని చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గంలో చేసింది తక్కువేనని చెప్పారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు. గజ్వేల్‌ అంటే ఇప్పుడు దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటున్న ప్రాంతం అన్నారు. ఇక్కడ ప్రారంభించిన మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇల్లు.. ఇలా సంక్షేమ పథకాలను ఇతర ప్రాంతాల నుండి వచ్చి చూసిపోతున్నారని చెప్పారు.  

మోడల్‌ గజ్వేల్‌గా మారుస్తా..  
ఇప్పుడున్న అభివృద్ధికి తోడు ఇక ముందు కూడా గజ్వేల్‌ను ఒక మోడల్‌ నియోజకవర్గంగా మారుస్తానని అన్నారు. ఇప్పటికే డివిజన్‌ కేంద్రంగా మార్చుకున్నామని.. ఆర్డీవో, డీఎస్సీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఎన్నికల తర్వాత నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తానని చెప్పారు. ఎన్నికల తర్వాత రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి ప్రతీ గ్రామం నుండి కార్యకర్తలను పిలుచుకొని గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు గ్రామాలు ఎలా ఉన్నాయి.. ఇక ముందు ఏం చేయాలి అనే విషయాలు కూలంకశంగా చర్చిస్తామని, అదే విధంగా ప్రణాళికను అమలు చేసేలా చూస్తామని హామీ ఇచ్చారు.  

18 సంవ్సరాలు నిండిన అందరికీ ఇల్లు 
అభివృద్ధి అంటే మాటలు చెప్పి ఊరుకోవడం కాదని, చివరి వరకు అంకిత భావంతో పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు నిర్మిస్తామని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం పథకం ద్వారా నిర్మాణాలు కొనసాగుతాయని, సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం అందస్తామని అన్నారు. అదేవిధంగా కొండపోచమ్మ తల్లి పేరుతో నిర్మించే ప్రాజెక్టు.. తల్లి దయతో త్వరలో పూర్తవుతుందని, దీంతో నియోజకవర్గంలోని ప్రతీ గుంటకు సాగునీరు అందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అప్పుడు వ్యవసాయం, కూరగాయలు, ఇతర లాభదాయకమైన పంటలు పండించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమను కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి నూరుశాతం సబ్సిడీతో రెండు పాడి గేదెలు అందజేస్తామని హామీ తెలిపారు. గజ్వేల్‌కు ఫుడ్‌ ప్రాసెస్సింగ్‌ పరిశ్రమను తీసుకొస్తామని.. తద్వారా కల్తీ లేని ఆహార పదార్థాలు అందుతాయని చెప్పారు. 

వేగంగా రైల్వే పనులు 
గజ్వేల్‌ పట్టణం మీదుగా వెళ్లే కొత్తపల్ల–మనోహరాబాద్‌ రైల్వే పనులు వేగంగా సాగుతున్నాయని కేసీఆర్‌ అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల మీదుగా కరీంనగర్‌ రైల్వే లైన్‌కు కలుస్తుందని చెప్పారు. అక్కడి నుండి ఎడమ వైపుకు పోతే ఢిల్లీ, కుడి వైపుకు ముంబై రైలు మార్గం ఉంటుందని అన్నారు. దీంతో గజ్వేల్‌కు దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు మార్గాలు అందుబాటులో ఉంటాయని, సరుకుల రవాణా మొదలైనవి సులభతరం అవుతాయని వివరించారు. ఒకవైపు పరిశ్రమలు మరోవైపు రైలు మార్గం, ఇతర వసతులతో గజ్వేల్‌ పట్టణం విస్తీర్ణం పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే ప్రతీ గ్రామానికి రోడ్లు వేశామని, మిగిలిన వాటికి కూడా పూర్తి చేసి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచేలా చేస్తామని అన్నారు.  ఎన్నికల వేళ పరిశీలకులు మన వైపే చూస్తారని, నిబంధనలు పాటించాలని కార్యకర్తలకు సూచించారు.  

అభివృద్ధిపై రిలాక్స్‌ కావద్దని హరీశ్‌కు నేర్పించాను 
నాయకుడికి ఎప్పుడూ కొత్తపనులు చేయాలనే తపన ఉండాలని.. చేసిన అభివృద్ధిని చూసి రిలాక్స్‌ అయితే మన పని అంతేనని హరీశ్‌రావుకు నేర్పించానని కేసీఆర్‌ అన్నారు. స్థానిక జెడ్పీటీసీ మాధురీ నన్ను వెంకటేశ్వర స్వామి, సాయిబాబాతో పోల్చారని.. అయితే పొగడ్తలకు ఉబ్బి పోవడం, డబ్బాలు కొట్టుకోవడం కాదన్నారు. గతం కన్నా గజ్వేల్‌ నియోజకవర్గం కొంత మెరుగైందని అన్నారు. మానవ జాతి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయని, మన దగ్గరే కాదు.. అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయని అన్నారు. వాటిని అధిగమించడం కోసం నిరంతరం శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటి అభివృద్ధి సరిపోదని, ఇక్కడే ఆగిపోవాలని పక్క నియోజకవర్గం సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు చూస్తున్నారని చమత్కరించారు.  

గుంట నక్కలకు బుద్ధి చెప్పాలి: ఎంపీ 
గజ్వేల్‌ నియోజకవర్గం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నాలుగున్నరేళ్లలో గజ్వేల్‌ నియోజకవర్గం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిందని చెప్పారు. అయితే దీనిని అడ్డుకునేందుకు పలువురు గుంటనక్కలు కాచుకొని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అభివృద్ధి నిరోధకులైన గుంట నక్కలకు ఓటు ద్వారా బుద్ది చెప్పి డిపాజిట్‌ గల్లంతు అయ్యేలా చూడాలని పిలుపు నిచ్చారు. 

తెలంగాణ ఖ్యాతిని చాటిన కేసీఆర్‌: 
సిధారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యాసను, భాషను ఎగతాళి చేశారని, మన రాష్ట్రం మనకు వచ్చాక ప్రపంచ దేశాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో తెలుగు మహాసభలు నిర్వహించి తెలంగాణ ఖ్యాతిని చాటిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. నా చిన్నప్పుడు సభలకు వెళ్లేందుకు డబ్బులు లేవని.. ఇప్పుడు నా చేతుల మీదుగా సభను నిర్వహించే భాగ్యం కలుగజేశారని చెప్పారు. ప్రత్యేక విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు.

ప్రాజెక్టులు పూర్తితో తెలంగాణ మాగాణుల్లో సిరుల పంటలు పండుతాయని చెప్పారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫారూఖ్‌ హుస్సేన్, రాష్ట్ర వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌ రెడ్డి, నాయకులు కొత్తల యాదగిరిరెడ్డి, చిన్న మల్లయ్య, డాక్టర్‌ యాదవరెడ్డి, జెడ్పీటీసీ మాధురి, మున్సిపల్‌ చైర్మన్‌ భాస్కర్, రిటైర్డ్‌ ఇంజనీర్‌ గుప్తా, సింగం సత్తయ్య, లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. 


బ్రహ్మాండంగా గెలవబోతున్నాం..
జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): ‘గజ్వేల్‌ ప్రజలు చాలా గొప్పవాళ్లు. గతంలో గెలిచిన వాళ్లు ఎంతోకొంత అభివృద్ధి చేస్తేనే మూడు నాలుగు సార్లు గెలిపించారు. అలాంటిది సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్లలోనే నియోజకవర్గాన్ని 20 ఏళ్లు ముందుకు తీసుకుపోయార’ని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మర్కూక్‌ మండలంలోని ఎర్రవల్లి గ్రామ సమీపంలో కేసీఆర్‌ వ్యవసాయక్షేత్రంలో గజ్వేల్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ గతంలో గెలిచిన వారంతా ఒకటి రెండు అభివృద్ధి పనులకే పరిమితం అయ్యారని, కేసీఆర్‌ మాత్రం గజ్వేల్‌ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

దేశం మొత్తం గజ్వేల్‌ వైపు చూసేలా అభివృద్ధి చేయడమే కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిలో, మెజార్టీలో ఆదర్శంగా ఉన్న గజ్వేల్‌.. ఎన్నికల నిబంధనలు పాటించడంలోనూ ఆదర్శంగా నిలవాలని కార్యకర్తలను కోరారు. ప్రతి కార్యకర్త ఎన్నికల నియమాలు తూ.చ తప్పకుండా పాటించాలని సూచించారు. బూత్‌కమిటీ సభ్యులు సమన్వయంగా ప్రచారం చేయాలని సూచించారప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలను తీసుకపోవాలని, 90 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని, మిగతా పది శాతం కోసం ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని కోరారు.గజ్వేల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నామని.. ఇందులో ఎలాంటి అనుమానం లేదని తేల్చిచెప్పారు. ఎదుటి పార్టీ వాళ్లకు డిపాజిట్‌ కూడా దక్కదని ఎద్దేవా చేశారు.

25 రోజుల పాటు గ్రామాల్లోనే కార్యకర్తలు ఉంటూ ప్రచారం చేయాలని, చేసిందే చెప్పాలని, చేయబోయేది మేనిఫెస్టో వివరాలను ఇంటింటికీ తీసుపోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, ఫారుఖ్‌హుస్సేన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలు రాంచంద్రం, సత్తయ్య, మధూరి, వెంకటేశం, రాష్ట్ర నాయకులు నర్సింహారెడ్డి, రఘుపతిరావు, సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మదాసు శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు రంగారెడ్డి, మధు, శ్రీనివాస్, దుర్గయ్య,జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement