నర్సాపూర్: ఓటర్లు ఎవరూ ఆగం కావద్దని, ఆలోచించి ఓటు వేయాలని హితువు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం నర్సాపూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట, గజ్వేల్ తరహాలో నర్సాపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, త్వరలో లక్ష ఎకరాలకు గోదావరి జలాలు అందజేస్తామన్నారు. కొత్తగా మాసాయిపేట మండలం ఏర్పాటు చేస్తామని, జనవరి 26న కొత్త మండలంలో జెండా ఎగురవేస్తామని హామీ ఇచ్చారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో మదన్‌రెడ్డి గెలుపు ఖాయమైందని, పోయిన ఎన్నికల సభకన్నా ఈ సారి సభ కుడిచేయిగా ఉందన్నారు. మదన్‌రెడ్డి తనకు అత్యంత ఆత్మీయుడు, మా కుటుంబ సభ్యుడని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన మదన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నర్సాపూర్ నియోజకవర్గం చైతన్యవంతమైన ప్రాంతమని. ఇక్కడి ప్రజలకు ఆలోచించే శక్తి ఉందని, ఓటు వేసే సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి మేలు చేసే పార్టీకి ఓటు వేయాలని సూచించారు.
ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తాం..
రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు పథకం, రైతుబీమా స్కీంలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అప్పులు బాగా పెరుగుతున్నాయని, రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.5 లక్షలు సిలక్ ఉన్నప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్లన్నారు. తెలంగాణలోని కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చి ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తామన్నారు. మోదీ ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా పథకం సక్కగలేదని విమర్శించారు.
హల్దీ, మంజీరా నదులపై 12 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించుకున్నారని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. మదనరెడ్డి అభ్యర్థన మేరకు నర్సాపూర్‌ను రెవెన్యూ డివిజన్ కేంద్రం చేశామని, నర్సాపూర్ పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చామని తెలిపారు. ఇక్కడి ప్రజల ఎన్నో ఏళ్ల కల అయిన బస్‌డిపోను మంజూరు చేశామన్నారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే డిపో ఏర్పాటును పూర్తి చేస్తానన్నారు.
మదన్‌రెడ్డి తనకు ఆత్మీయుడని ఆయనను గెలిపించాలని కోరారు. బీసీ నేత మురళీయాదవ్ మంచి కార్యకర్త అని కొనియాడారు. ఆయనకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని, ఆయనను మంచి స్థాయికి తీసుకుపోయే బాధ్యత తనదని ప్రకటించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు, రైతుబంధు పథకం, రైతుబీమా వర్తింపజేసి అండగా ఉందన్నారు. రైతుల మంచి గిట్టుబాటు ధర అందేలా క్రాప్‌కాలనీలు, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా యువత, మహిళలకు ఉపాధి లభించటంతోపాటు రైతులకు మేలు జరుగుతుందన్నారు.
అన్ని విధాలా అభివృద్ధి..
ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రైతుల కోసం చెక్‌డ్యామ్‌ల మంజూరు చేయించామన్నారు. గిరిజనుల తండాలకు రోడ్లు వేశామని గుర్తుచేశారు. ఎవరికీ సాధ్యం కానీ ఆర్టీసీ డిపో మంజూరు చేయించినట్లు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన తనకు ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. సభలో మంత్రి హరీశ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ముత్యంరెడ్డి, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ హంసిబాయి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, దేవేందర్‌రెడ్డి, మురళీయాదవ్, శ్రీనివాస్ గౌడ్, కమల, పద్మ, సునీత,యాదమ్మ, శివకుమార్, ఆశోక్‌గౌడ్, హబీబ్‌ఖాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment