సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్‌ టికెట్‌ | Brs Narsapur Ticket For Sunita Lakshmareddy | Sakshi
Sakshi News home page

సునీతా లక్ష్మారెడ్డికే నర్సాపూర్‌ టికెట్‌

Published Thu, Oct 26 2023 7:15 AM | Last Updated on Thu, Oct 26 2023 7:15 AM

Brs Narsapur Ticket For Sunita Lakshmareddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నర్సాపూర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే దానిపై సుమారు మూడు నెలలుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పేరును పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ప్రగతిభవన్‌లో నర్సాపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి చేతుల మీదుగా కేసీఆర్‌ సమక్షంలోనే బుధవారం సునీతా లక్ష్మారెడ్డికి పార్టీ బీ ఫాం అందజేశారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దించాలని నిర్ణయించారు. పార్టీ ఎన్నికల కోర్‌ కమిటీ సభ్యులు, మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు సమక్షంలో ప్రగతిభవన్‌లో మదన్‌రెడ్డి, సునీత రెడ్డి మధ్య టికెట్‌ వివాదానికి తెరదించారు.

సీఎం సమక్షంలో హామీ ఇవ్వడంతో...  
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ఆగస్టు 21న పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించినా నర్సాపూర్‌ను పెండింగ్‌ జాబితాలో పెట్టా రు. మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి సుమారు నెల రోజుల క్రితం గ్రీన్‌ సిగ్నల్‌ లభించినా అధికారికంగా ఆమె పేరును ప్రకటించలేదు. మదన్‌రెడ్డికే అవకాశం ఇవ్వాలంటూ ఆయన అనుచరులు మంత్రి హరీశ్‌రావు నివాసం ఎదుట ఆందోళన కూడా చేశారు.

మరోవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ప్రగతిభవన్‌కు తరచూ వెళ్తూ తనకు టికెట్‌ ఇవ్వా లని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పలుమార్లు మదన్‌రెడ్డితో భేటీ అయి ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. తాజాగా సీఎం కేసీఆర్‌ సమక్షంలో మదన్‌రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆయన సునీతా లక్ష్మారెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

మదన్‌రెడ్డి సీనియారిటీని  గుర్తిస్తాం:  కేసీఆర్‌
‘మదన్‌ రెడ్డి నాతో పారీ్టలో మొదటినుంచీ కొనసాగుతున్న సీనియర్‌ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు. సోదర సమానుడు. పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్‌ ఎన్నికలను తన భుజస్కందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుంది.

ప్రస్తుతం మెదక్‌ ఎంపీగా కొనసాగుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున ఆయన స్థానంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మదన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మదన్‌రెడ్డికి వివాద రహితుడిగా పేర్కొంది. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటూ కీలక సమయంలో ఐక్యంగా ముందుకు పోవడం ద్వారా మదన్‌రెడ్డి పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేసినందుకు ధన్యవాదాలు’ అని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
చదవండి: కూన’పై ఎమ్మెల్యే వివేకానంద దాడి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement