మోదీతో ఫైనల్స్‌ | Revanth Reddy comments on Narendra Modi and KCR | Sakshi
Sakshi News home page

మోదీతో ఫైనల్స్‌

Published Sat, Apr 27 2024 2:15 AM | Last Updated on Sat, Apr 27 2024 2:15 AM

Revanth Reddy comments on Narendra Modi and KCR

మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ మాత్రమే: సీఎం రేవంత్‌రెడ్డి 
 

ఇప్పుడు పాకిస్తాన్‌ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి... బీజేపీ నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు 
 

మతం పేరుతో రాజకీయం చేస్తున్నారు.. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్నారు 
 

సోషల్‌ మీడియా కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలి
 

బిడ్డకు బెయిల్‌ కోసం బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారీ ఒప్పందం  

సాక్షి, హైదరాబాద్‌/ మెదక్‌ జోన్‌: ‘రాష్ట్రంలో జరిగిన   అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్స్‌ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్‌ ఆడుతున్నాం. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టు లాంటి కేసీఆర్‌ను ఓడించాం. ఇప్పుడు పాకిస్తాన్‌ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి. బీజేపీ నేతలు అమిత్‌షా, జేపీ నడ్డా సహా ముఖ్య నేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. సోషల్‌ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వమిది. దీన్ని మీరే కాపాడుకోవాలి.

ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలి. 14 ఎంపీ సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. రేవంత్‌ లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి బీఆర్‌ఎస్‌ నేతలు వచ్చారు. బిడ్డ కవిత బెయిల్‌ కోసం బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు..’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో, ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేటలో జరిగిన జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. 

బీజేపీ అంటే బ్రిటిష్‌ జనతా పార్టీ  ‘పదేళ్ల పాలనలో మోదీ, కేసీఆర్‌ దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకున్నారు. దేశంలో రిజర్వేషన్లను రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారు.ఈ ఎన్నికలు దేశానికి అత్యంత కీలకం. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్ల నినాదాన్ని బీజేపీ చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోంది. 

బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు. బ్రిటిష్‌ జనతా పారీ్టగా మారింది. బ్రిటిష్‌ వాళ్ల మాదిరిగానే మోదీ దేశాన్ని దోచుకొనేందుకు రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు. ఏళ్ల తరబడి కులగణన జరగడం లేదు. దీంతో బీసీలకు జనాభా లెక్కల ప్రకారం దక్కాల్సిన లబ్ధి దక్కడం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కులగణన జరిగితేనే రిజర్వేషన్‌ కల్పించడం సాధ్యమవుతుంది..’ అని రేవంత్‌ అన్నారు. 

జహీరాబాద్‌ స్థానం బీజేపీకి తాకట్టు 
    ‘లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ అంటున్నారు. అదెలా సాధ్యం? ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకొని కురీ్చలోకి వచ్చామా? బిడ్డ కవిత బెయిల్‌ కోసం బీజేపీతో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. తన బిడ్డ కోసం జహీరాబాద్‌ స్థానాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారు. జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను గెలిపించే కుతంత్రంలో మెదక్‌లో గాలి అనిల్‌కుమార్‌కు టికెట్‌ ఇవ్వాల్సి ఉండగా జహీరాబాద్‌లో ఇచ్చి గాలికి వదిలేశారు.

తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు 60 ఏళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి. చివరకు సోనియమ్మ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. కానీ రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగాలు రాకపోగా కేసీఆర్‌ కుటుంబానికి.. కొడుకు, కూతురు, అల్లుడుతో పాటు ఆయన బంధువులందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రి పదవులు దక్కాయి. పదేళ్లుగా గడీల్లో తెలంగాణ తల్లిని బందీ చేశారు. గడీలను బద్ధలు కొట్టి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించాం..’ అని సీఎం చెప్పారు.   

వైఎస్సార్‌ హయాంలో సంక్షేమ పథకాలు 
    ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలు అందాయి. అప్పట్లో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టడం జరిగింది. రూ.400కే వంట గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చారు. పేదలకందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారు. కానీ కేసీఆర్‌ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని చెప్పి ఎవరికీ కట్టించిన పాపాన పోలేదు..’ అని రేవంత్‌ విమర్శించారు. ‘సోనియాగాంధీ అభీష్టం మేరకు ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తాం. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేశాం..’ అని తెలిపారు.  

ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు శని వదిలిపోతుంది 
 ‘హరీశ్‌రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు స్తూపం గుర్తొస్తుంది. హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది..’ అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘హరీశ్‌రావు ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు.

స్పీకర్‌ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు? దానికి రూ.30 –రూ.40 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్‌ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?..’  అని సీఎం ఎద్దేవా చేశారు.   

హరీశ్‌.. రాజీనామా లేఖ రెడీ పెట్టుకో..
హరీశ్‌రావు సవాల్‌ను స్వీకరించా. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్ధిపేటకు ఆయన శని వదిలిపోతుంది. రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ చేస్తా. హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement