నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు | Harish Rao On Grain purchases in Telangana | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

Published Tue, Apr 11 2023 6:04 AM | Last Updated on Tue, Apr 11 2023 2:46 PM

Harish Rao On Grain purchases in Telangana - Sakshi

అధికారులతో భేటీలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్, గంగుల

సాక్షి, హైదరాబాద్‌: గత సీజన్‌లో రైస్‌మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద పౌరసరఫరాల శాఖకు అప్పగించని మిల్లర్లకు యాసంగి ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎంఆర్‌ కోసం 18 నెలల పాటు గడువు ఇచ్చినా, ధాన్యాన్ని మర పట్టించి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న రైస్‌ మిల్లులను ఇక బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంగళవారం నుంచి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది.

ఈ మేరకు మంత్రులు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ రవీందర్‌ సింగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతస్థాయి అధికారులు సోమవారం బీఆర్‌కే భవన్‌లో జిల్లాల అదనపు కలెక్లర్లు, డీఎంలు, డీఎస్‌ఓలు, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సేకరణ, సీఎంఆర్‌ కేటాయింపు, రైతులకు ఉపయోగకర అంశాలు వంటి వాటిపై చర్చించారు.

జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని కొనుగోళ్ళకు సిద్దం కావాలని, రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇందు కోసం యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో మొదలైన కోతలు, ధాన్యం దిగుబడికి అనుగుణంగా కేంద్రాలను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.  

వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష 
ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముగ్గురు మంత్రులు అధికారులకు దిశా నిర్శేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ళకు కావాల్సిన ఏర్పాట్లను కలెక్టర్లు సిద్ధం చేసుకోవాలని, వచ్చే వారంలో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. యాసంగికి సీజన్‌ సీఎంఆర్‌ అప్పగింతకు ఆఖరు తేదీగా ఈ నెల 30వ తేదిని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈలోగా మిల్లర్లు నుంచి సీఎంఆర్‌ను పూర్తి స్థాయిలో సేకరించాలని ఆదేశించారు.

ఇక నుంచి సీఎంఆర్‌ అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటి వరకు పెండింగ్‌ లో ఉన్న సీఎంఆర్‌ని అప్పగించిన తరువాతే ఈ సీజన్‌ కు సంబంధించి ధాన్యాన్ని తీసుకోవాలని రైస్‌ మిల్లర్లుకు సూచించారు. ఇప్పటి వరకు సీఎంఆర్‌లో పాల్గొనని మిల్లర్లను కూడా ఈ యాసంగి సీజన్‌ నుంచి భాగాస్వామ్యం చేస్తున్నట్లు మంత్రులు ప్రకటించారు. 

రెండు సీజన్లలో పూర్తి ధాన్యాన్ని సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణనే... 
దేశ వ్యాప్తంగా రెండు సీజన్‌లలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణా మాత్రమేనని మంత్రులు హరీష్‌రావు, గంగుల, సింగిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నుంచి అదనపు కలెక్టర్లు ఆయా జిల్లా స్థాయిలలో కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసుకొని ధాన్యం కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నిల్వలకు ఇంటర్మీడియట్‌ గోడౌన్లను గుర్తించి తగు ప్రతిపాధనలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకోచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.  

రాష్ట్రంలో భారీగా ధాన్యం దిగుబడి 
రాష్ట్రంలో రోజురోజుకూ ధాన్యం దిగుబడి, కొనుగోలు గణనీయంగా పెరుగుతున్నాయని మంత్రులు వెల్లడించారు. 2014–15 లో రూ.3392 కోట్లతో ధాన్యం సేకరిస్తే 2020–21 నాటికి రూ.26 వేల 600 కోట్లతో ధాన్యం సేకరించగలిగామని చెప్పారు. 9 సంవత్సరాలలో ఆరు రెట్ల ధాన్యం కొనుగోలు పెరగగా , ఈ రబీ(యాసంగి)లో దేశంలో సగం పంట తెలంగాణలో మాత్రమే ఉండడం మనకు గర్వకారణమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చెక్‌ పోస్టులను బలోపేతం చేయాలని మంత్రులు ఆదేశించారు.

రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలను కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పడు ఆన్‌ లైన్‌ లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, పౌర సరఫరాల కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement