సాక్షి, అమరావతి: ఒకే పంటను పండించి నష్టపోతున్న రైతులు అంతర పంటల సాగుపై దృష్టి సారించేలా ఉద్యాన శాఖ వారికి అవగాహన కల్పిస్తోంది. నాలుగైదు ఏళ్ల తర్వాత దిగుబడి వచ్చే ప్రధాన పంటల మధ్యలో అంతర పంటల్ని సాగు చేయడం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. తోటల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రధాన పంట కాపునకు వచ్చేంత వరకు అంతర పంటలు సాగు చేయవచ్చు. ఏక పంటగా ఏదో ఒక ఉద్యాన పంటను పండించడం కన్నా అంతర/బహుళ పంటల వంటి సమగ్ర పద్ధతుల్ని అవలంభించడం వల్ల ఒక పంట పోయినా మరో పంటతో ఆదాయాన్ని పొందవచ్చు.
వెలుతురు, నీరు, పోషకాల కోసం ప్రధాన పంటతో పోటీ పడని పంటను ఎంచుకోవాలి. పామాయిల్ తోటల్లో అంతర పంటలుగా కోకో, కూరగాయలు, పూల మొక్కలు, జొన్న, మొక్కజొన్న, మిర్చి, పసుపు, అల్లం, అనాస వంటి వాటిని సాగు చేసుకోవచ్చు. కొబ్బరి, పామాయిల్, మామిడి వంటి తోటల్లో మొక్కకు సరిపడే స్థలం వదలాలి. ప్రధానంగా పామాయిల్లో మొక్కల్ని త్రిభుజాకృతి పద్ధతిలో కన్నా చతురస్రాకృతి పద్ధతిన సాగు చేస్తే మంచిది. పామాయిల్లో అంతర పంటల వల్ల సగటున హెక్టార్‌కు ఏడాదికి రూ.30 నుంచి రూ.50 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చునని ఉద్యాన శాఖ ఉన్నతాధికారి పి.హనుమంతరావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment