ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ఇప్పుడు సహాయక చర్యలు అందక విలవిల్లాడుతోంది. తాగేందుకు చుక్కనీరు లేదు. రెండ్రోజులుగా ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగలేదు. వయో వృద్ధులు, చిన్న పిల్లలు, బాలింతల పరిస్థితి మరీ దయనీయం. పాలు దొరక్క పసిపిల్లలు గుక్కపెడుతున్నారు. వైద్యం అందే దిక్కేలేదు. బాలింతలు పసికందులతో నాలుగైదు కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి. చెట్లు విరిగిపడి అనేకచోట్ల ఇళ్లు ధ్వంసమైనా పునరావాస ఏర్పాట్లు లేనేలేవు. దీంతో తట్టాబుట్టా సర్దుకుని మైళ్లకొద్దీ బంధువుల ఇళ్లకు నడిచి వెళ్తున్నారు. దారిపొడవునా కూలిన చెట్లే. కరెంట్ లేదు.. సమాచార వ్యవస్థ కుప్పకూలింది. ఇంత జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని బాధితులు మండిపడుతున్నారు. చావుబతుకుల్లో ఉన్నా పట్టించుకోరా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. తుపాను తీరాన్ని దాటిన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని ప్రతి గ్రామంలోనూ ఇప్పుడు అడుగడుగునా ఇలాంటి దయనీయ పరిస్థితులే.
నాలుగురోజులుగా నరకయాతన
పెద్దముహరిపురంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. నాలుగు రోజుల నుంచి నరకం అనుభవిస్తున్నామని బత్తిని కమలమ్మ వాపోయింది. ఆకలితో చచ్చిపోతామనే ఆందోళన వ్యక్తంచేసింది. తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకడంలేదని రుద్రమ్మ, గన్నెమ్మ, గౌరమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తాను సుగర్ పేషంట్‌నని, టాబ్లెట్ వేసుకోవడానికి నీళ్లు కూడా లేవని గౌరమ్మ దీనంగా తెలిపింది. ఇక్కడ ఇన్ని అవస్థలు పడుతుంటే ఇప్పటివరకూ ఏ ఒక్క అధికారీ రాలేదని వారు తెలిపారు. ‘తుపాను ప్రభావం తగ్గి 48 గంటలైంది. ఆహారం అందించడానికేం.. నీళ్లు కూడా లేకుండా ఎలా బతుకుతాం?’.. అని రేగిపాడుకు చెందిన లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తంచేశాడు. కొబ్బరి బొండాల నీళ్లతో గొంతు తడుపుకుంటున్నామని బత్తుల లక్ష్మీకాంతమ్మ చెప్పింది. ‘ఫోన్లు పనిచేయడంలేదు. ఎవరికి ఫిర్యాదు చెయ్యాలో అర్థంకావడంలేదు. ఏ నాయకుడు కానీ, అధికారి కానీ ఇప్పటివరకు రాలేదు’.. అని రెయ్యిపాడు మాజీ సర్పంచ్ భాస్కర్ తెలిపాడు.
దారిలేదు.. చెట్లు తొలగించే దిక్కేలేదు
ఇదిలా ఉంటే.. ఇక్కడ నుంచి పలాస దాటి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యలో వాగు పొంగిపొర్లుతోంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. పూడి గ్రామం దగ్గర్నుంచి అడుగడుగునా రోడ్లపై విరిగిపడిన చెట్లే. వాటిని తొలగించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ముఖ్యమంత్రి పర్యటన కోసం పలాస, కాశీబుగ్గ వరకు మాత్రమే రహదారులను పునరుద్ధరించారు. ప్రభుత్వ యంత్రాంగం, సహాయక బృందాలన్నీ రెండు రోజులుగా ఇదే పనిలో ఉన్నాయి. దీంతో వజ్రపుకొత్తూరులోని అనేక గ్రామాల్లో చెట్లు తొలగించే నాథుడే లేడు. కరెంట్ స్తంభాలు, తీగలను పునరుద్ధరించే పనులు ఇంకా మొదలుకాలేదు. విద్యుత్ అధికారులు సైతం సీఎం పర్యటన ప్రాంతాలకే పరిమితమయ్యారు. రెయ్యిపాడు దగ్గర 300 ఏళ్లనాటి రావి చెట్టు నేలకొరిగింది. దీన్ని తొలగించకపోవడంతో పూడి జగన్నాథపురం, దన్నువానిపేట, చిన్న పల్లివూరు, పెద్ద పల్లివూరు, శెగడిపేట, సుకుంపేట, పూడిలంక తదితర గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో ఈ ప్రాంతంలోని ప్రజలు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాల్సిన దుస్థితి. ఇప్పటివరకూ ఏ అధికారి రాకపోవడంతో గ్రామాల్లో యువకులే స్వచ్ఛందంగా చెట్లు తొలగిస్తున్నారు.
బిందె నీళ్లు రూ.50.. పెట్రోల్ రూ.200లు
మరోవైపు.. నాలుగు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంచినీటి కొరతను ఆసరాగా చేసుకుని కొందరు జనాలను దోచేస్తున్నారు. బిందె రూ.50, డీజిల్ లీటర్ రూ.150.. పెట్రోల్ అయితే రూ.200కు పైనే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. మరో వారం రోజుల వరకు విద్యుత్‌ను పునరుద్ధరించే అవకాశమే లేదని తెలుస్తోంది.
సీఎం పర్యటనలోనే అధికారులు
తిత్లీ తుపానుకు ముందే వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అయినా ప్రభుత్వ యంత్రాంగం తమ ప్రాంతానికి రాలేదని పెద్ద మురహరిపురం ప్రాంత ప్రజలు చెప్పారు. తీరం దాటే ప్రాంతంలో నష్టం ఎక్కువగా ఉంటుందని తెలిసీ అప్రమత్తం కాలేదని తెలిపారు. కేవలం రెండు జాతీయ విపత్తుల సహాయక బృందాలను మాత్రమే పంపినప్పటికీ వారికి సూచనలు, సలహాలు ఇచ్చే రెవెన్యూ, ఇతర అధికారులు ఎవరూ అందుబాటులో లేరు. వీరంతా ముఖ్యమంత్రి టెలీ కాన్ఫరెన్స్‌ల కోసం జిల్లా కేంద్రాలకే పరిమితమయ్యారని స్థానికులు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందానికి హెలికాప్టర్ అందించాలన్న కనీస బాధ్యత విస్మరించారని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నెట్‌వర్క్ పూర్తిగా స్తంభించడంతో సహాయ బృందాలు కూడా అధికారులను సంప్రదించలేకపోయాయి. దీంతో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఫలితంగా తాగునీరు, భోజనం అందించలేదని అధికారులు చెబుతున్నారు.
టాబ్లాట్ వేసుకుందామన్నా నీళ్లులేవు
నేను సుగర్ పేషంట్‌ను. కళ్లు తిరుగుతున్నాయి. టాబ్లెట్ వేసుకుందామన్నా నీళ్లులేవు. ఏదైనా తినాలి. కానీ పెట్టేదెవరు? ఏ అధికారి రాలేదు. మమ్మల్ని పలకరించలేదు. ఇదెక్కడి పాపం? మేం చచ్చిపోతామేమో?
– గౌరమ్మ, పీఎం పురం
పరిస్థితి చూస్తే భయంగా ఉంది
ఇళ్లపైనే చెట్లు పడ్డాయి. ఇంట్లో వాళ్లంతా బిక్కుబిక్కుమంటున్నారు. అన్నం లేక గుండె దడొస్తోంది. ఎక్కడికో వెళ్లి అర బిందెడు నీళ్లు తెచ్చా. రెండు రోజులుగా కొద్దికొద్దిగా గొంతు తడుపుకుంటున్నాం. అయిపోతే కొబ్బరినీళ్లు తాగుతున్నాం. పిల్లలు నీరసించారు. పరిస్థితి చూస్తే భయమేస్తోంది.
– కె పద్మ, పెద్ద మురహరిపురం
రెండ్రోజులుగా అన్నం, నీళ్లూ లేవు
చెట్లుపడి మా మూడు కుటుంబాల ఇళ్లు నేలకొరిగాయి. అందరూ చిన్న గదిలోనే ఉంటున్నాం. రెండు రోజులుగా నీళ్లు లేవు.. అన్నంలేదు. ఇదిగో.. నీరసంగా ఉన్నా ప్రాణమైనా నిలబెట్టుకునేందుకు మా అమ్మా వాళ్లింటికి నడుచుకుంటూ వెళ్తున్నా. నేనే కాదు.. మా ఊళ్లో చాలామంది ఇలాగే వెళ్తున్నారు.
– నెయిల సంతోషి, కొండూరు
పాల కోసం పిల్లలు విలవిల
రెండు రోజులుగా పిల్లాడు పాలకోసం గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. ఆవులన్నీ తుపానుకు చచ్చిపోయాయి. ఏం చెయ్యాలో తెలీడంలేదు. కొబ్బరి నీళ్లతో ఆకలి తీరుస్తున్నాం. పాలకోసం ఎక్కడికెళ్లినా దొరకడం లేదు. ఎవరూ రావడంలేదు. మమ్మల్ని అసలే పట్టించుకోవడం లేదు. మమ్మల్ని బతికించండి..
– మాధవి, రేగిపాడు
Comments
Please login to add a commentAdd a comment