సమావేశంలో మాట్లాడుతున్న ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి
హైదరాబాద్: దేశంలోనే ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మొదటి మసాలా దినుసుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలంగాణ ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి తెలిపారు. బుధవారం సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో ఈ ప్రాజెక్ట్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలువురు నిపుణులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నిపుణుల సూచనలు స్వీకరించారు. ఓల్డ్ జీడిమెట్ల పైపులైన్ రోడ్డులో ఉన్న 3.15 ఎకరాల్లో రూ.10.63 కోట్లతో ఈ యూనిట్‌ను నెలకొల్పనున్నారు.
తెలంగాణలో 1.50 లక్షల ఎకరాల్లోని పంట కాలనీల్లో పండించిన పసుపు, మిరప, ధనియాలు, చింతపండు, అల్లం, వెల్లుల్లి దిగుబడులను తీసుకొచ్చి ఎనిమిది రకాల మసాలాలు తయారు చేయనున్నారు. పసుపు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి, మిరప సాగులో మూడో స్థానంలో ఉన్నదని, ఇలాంటి స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ వల్ల రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వెంకట్రామ్‌రెడ్డి పేర్కొన్నారు. పురుగుమందులు వాడని ఉత్పత్తులుంటాయని, ఇంతవరకు మార్కెట్‌లో లేని చింతపండు పౌడర్‌ను వినియోగదారులకు అందించనున్నామని తెలిపారు. ఈ యూనిట్‌ను ఈ ఏడాది దసరా నాటికి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఈ ఉత్పత్తులను ‘కాకతీయ ఫుడ్స్’ పేరిట మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. రైతులకు లాభదాయంగా వినియోగదారులకు సరసమైన ధరలకు అత్యంత నాణ్యంగా అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కమిషనర్ తెలిపారు.
ధరలిలా ఉంటాయి..
మసాలా తయారీ కేంద్రంలోని ఉత్పత్తులకు ధరలను అధికారులు ప్రతిపాదించారు. మిరపపొడి కేజీ ధర రూ.137, పసుపుపొడి కిలో ధర రూ. 118, కొత్తిమీర పొడి రూ.115, చింతపండు పొడి కిలో రూ.142, అల్లం, వెల్లుల్లి మిశ్రమం కిలో రూ.108, అల్లం కిలో రూ.101, వెల్లుల్లి కిలో రూ.115, చింతపండు కిలో రూ.161 గా ప్రతిపాదనలు రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment