గద్వాలరూరల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడుల సమయంలో అండగా నిలిచేందుకు ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయం అందించనుంది. దీనికోసం గ్రామాల వారీగా కసరత్తు కూడా పూర్తయింది. ఈ పథకం నియోజకవర్గంలోని చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగకరంగా ఉండనుంది. నియోజకవర్గంలో చెరువులు, జూరాల ఆయకట్టు కింద పంటలు సాగుచేస్తున్నారు. వర్షాలు ఎక్కువగా కురిసిన సమయాల్లో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. దీంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యవసాయాన్ని వదిలేసి వలస బాట పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున పంట పెట్టుబడులకు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించడంతో రైతులు సంబరపడుతున్నారు.
ఈ ఆర్థిక సాయం అందితే బీడుపొలాలు సైతం సాగులోకి వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. 24 గంటల విద్యుత్ అందిస్తుండటంతో వ్యవసాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఒక్క గట్టు మండలంలో మాత్రం నీటి వనరులు తక్కువగా ఉండటంతో రైతులు పెట్టుబడి సాయంతో ఊరట చెందనున్నారు.
నష్టపోతామంటున్న కౌలు రైతులు..
ప్రభుత్వం పట్టాదారులకే పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించడంతో నియోజకవర్గ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో భూ యజమానులు వివిధ కారణాలతో భూమిసాగు చేయకపోవడంతో భూమిని ఇతర రైతులు కౌలుకు తీసుకొని సాగుచేస్తూ.. పెట్టుబడి, కష్టం, పంటలు నష్టపోయినా భరించేది కౌలు రైతులేనని వారు వాపోతున్నారు.
భూ యజమానుల నుంచి ఎకరాకు రూ.20 వేల వరకు చెల్లించి సాగుచేస్తుండగా.. వాతావరణం అనుకూలిం చక, తెగుళ్లు వచ్చి పంట చేతికి రాకపోయినా నష్టపోవాల్సింది తామేనని, ఆరుగాలం కష్టపడి పండిస్తే కనీసం పెట్టుబడి చేతికి రావడం లేదని, మళ్లీ అప్పులు చేసి పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం కౌలు రైతులకు కూడా అందజేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ సాయంతో ఊరట
ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయంతో పంటల సాగు సమయంలో విత్తనాలు, మందులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. చెక్కుల పంపిణీతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అందుకు అనుగుణంగా అధికారులు పారదర్శకంగా పంపిణీ చేపట్టాలి.
– తిరుమలరెడ్డి, వెంకంపేట
సాగుచేసే రైతులకే ఇవ్వాలి
భూ యజమానుల నుంచి రూ.18 వేలకు కౌలుకు తీసుకొని పంటలను సాగు చేస్తున్నాను. భూ యజమానులు పట్టణాల్లో నివసిస్తూ వారి పొలాలను కౌలుకు ఇస్తున్నారు. కష్టపడేది, పెట్టుబడి పెట్టేది మేము. ప్రభుత్వ సాయం కౌలు రైతులకు కాకుండా పట్టాదారులకు అందించడం ఎంతవరకు న్యాయం.
– శేఖర్, షాబాద్
ప్రభుత్వానికి నివేదికలు పంపించాం
ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడిగా అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రభుత్వ ఆదేశాల మేరకు వివరాలను సిద్ధం చేశాం. ప్రభుత్వం అడిగిన వెంటనే రైతుల వివరాలను అందజేశాం. ప్రభుత్వం మే నెల నుంచి చెక్కుల రూపంలో పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది.
– అశోక్‌వర్ధన్‌రెడ్డి, ఏడీఏ
Comments
Please login to add a commentAdd a comment