ఇక ఈ–పాస్‌ బుక్‌లు | govt plans to epassbook for farmers | Sakshi
Sakshi News home page

ఇక ఈ–పాస్‌ బుక్‌లు

Published Wed, Jan 10 2018 6:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

govt plans to epassbook for farmers - Sakshi

ఆదిలాబాద్‌ అర్బన్‌ : రైతులకు కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు రానున్నాయి. పాత పట్టాదారు పాస్‌బుక్‌ స్థానంలో కొత్తగా ఎలక్ట్రానిక్‌ పాస్‌ పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులో తేనుంది. ఈ మేరకు జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగానే సోమవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ యేడాది ఖరీఫ్‌ నుంచి ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయం పథకంతో పాటు రైతులకు కొత్త పాసు పుస్తకాల పంపిణీ విషయమై చర్చినట్లు సమాచారం. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. పాత వాటిని సేకరించి వాటి స్థానంలో కొత్త పాసు పుస్తకాలను రైతులకు అందించే విధంగా ముందడుగు వేస్తున్నారు. అయితే కొత్త పాస్‌ పుస్తకాలను రైతులకు ఏ విధంగా పంపిణీ చేద్దామనే దానిపై జిల్లా ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం తర్వాత ఎలక్ట్రానిక్‌ పాస్‌ పుస్తకాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని, జిల్లాలో ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో 1,38,125 పాస్‌ పుస్తకాలు..
జిల్లాలో గత మూడు నెలలుగా నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. భూ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా సరిగ్గా ఉన్న భూములకు కొత్త పట్టా పాసు పుస్తకాలు సులభంగా రానున్నాయి. జిల్లాలో నిర్వహించిన భూ సర్వే ద్వారా 3,56,633 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది. ఈ భూముల పరిధిలో 1,38,125 పట్టాపాసు పుస్తకాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందులో 1,29,326 పట్టా పాసు పుస్తకాలు ఎలాంటి తప్పులు లేకుండా ఉన్నాయని అధికారులు సర్వే ద్వారా గుర్తించారు. మిగతా 8,799 పాసు పుస్తకాల్లో వివిధ రకాల తప్పులు ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది. సరిగ్గా ఉన్న పాసు పుస్తకాల స్థానంలో ఎలాంటి ఆటంకం కలుగకుండా కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేయొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇవీ కాకుండా వివాదాలు, కోర్టు కేసుల్లో ఉన్న భూములు కూడా భూ సర్వే ద్వారా అధికారుల దృష్టికి వచ్చాయి. వివాదాలు లేని భూములను పరిశీలించిన అధికారులు.. వివాదాలు గల భూములను పక్కన పెట్టారు. ఏ వివరాల ప్రకారం, ఎప్పుడు, ఎవరితో పంపిణీ చేయాలి అనే దానిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.  

1.39 లక్షల పుస్తకాలు అవసరం
కొత్త ఎలక్ట్రానిక్‌ పాస్‌ పుస్తకాలను పంపిణీ చేస్తే జిల్లాకు 1.39 లక్షల పాస్‌ పుస్తకాలు కావాలని జిల్లా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఇందుకు భూ సర్వేకు ముందు ఉన్న రైతులు, పాస్‌బుక్‌ల వివరాలు, భూ సర్వే తర్వాత తేలిన రైతులు, పాస్‌బుక్‌ల వివరాలు సరిపోల్చుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తక్షణమే పంపిణీకి చర్యలు తీసుకునేలా సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే కొత్త పాస్‌ పుస్తకాలు ఎక్కడి నుంచి తెవాలి? ప్రింటింగ్‌ ఎక్కడ చేయించాలి? జిల్లాలో ప్రింటింగ్‌కు అనుమతిస్తారా? లేక  సీసీఎల్‌ఏ నుంచి సరఫరా చేస్తారా? అ నే దానిపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాల్సి ఉం ది, రైతులకు ఫిబ్రవరిలో కొత్త పాసు పుస్తకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశమైతే ఉందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement