సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలకు కోత పడుతోంది. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖలో పనిచేస్తున్న పలువురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులకు రావద్దంటూ ఆ శాఖ డైరెక్టరేట్ రెండు రోజుల కిందల ఆదేశాలు జారీచేసింది. ఈ నిర్ణయంతో 17 మంది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ఉద్యానశాఖలో అమలయ్యే పథకాలకు సర్కారు ఇచ్చే వార్షిక బడ్జెట్‌లో ఐదు శాతం నిధులను ఉద్యోగుల జీతభత్యాలకు ఖర్చుచేస్తారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. ఏడాదిగా కొత్త పథకాలు లేకపోవడంతో.. వీరి సేవలు అవసరం లేదని ప్రభుత్వం భావించింది. పైగా లాక్‌డౌన్ తోడవడంతో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చేనెల ఒకటి నుంచి విధులకు హాజరుకానక్కర్లేదని సదరు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి జిల్లా అధికారులు సమాచారమిచ్చారు. జిల్లాలో 12 మంది హార్టికల్చర్ విస్తరణాధికారులు, ఒక అకౌంటెంట్, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక అటెండరు ఉద్యోగాలు పోయినట్లే.
15 ఏళ్లుగా సేవలందించి..
ఉద్యాన పంటల సాగులో జిల్లాది ప్రత్యేక స్థానం. సాధారణ పంటలకు సమానంగా ఈ పంటలను రైతులను పండిస్తున్నారు. ఏటా దాదాపు 80వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలతోటలను సుమారు 45 వేల మంది రైతులు సాగుచేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఎక్కువ మొత్తంలో రంగారెడ్డి జిల్లాలోనే కూరగాయల దిగుబడి ఉంది. జంట నగరాల ప్రజల అవసరాలు తీర్చడంలో ఈ జిల్లాదే కీలకపాత్ర. ఇంతటి కీలకమైన విభాగంలో ఉద్యోగులను తొలగించడంతో ఉద్యాన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వాస్తవంగా అవుట్‌సోర్సింగ్ హార్టికల్చర్ విస్తరణాధికారులతోనే ఉద్యాన రైతులకు విస్తృతంగా సేవలు అందుతున్నాయి. ఈ శాఖలో జిల్లా అధికారితోపాటు ముగ్గురు హార్టికల్చర్ అధికారులు మాత్రమే ఉన్నారు. హార్టికల్చర్ అధికారులు ఒక్కొక్కరు ఆరేడు మండలాల వ్యవహారాలు చూ డాల్సి ఉంది.ఈ నేపథ్యంలో దాదాపు 15ఏళ్ల కిందట 12 మంది హార్టికల్చర్ విస్తరణాధికారులను అవుట్ సోర్సింగ్ విధానంలో విధుల్లోకి తీసుకున్నారు. వీరు ప్రస్తుతం ఒక్కొక్కరు మూడు మండలాల పరిధిలో ని రైతులకు సేవలందిస్తున్నారు. ఉన్నపళంగా వీరిని తొలగించడంతో రైతులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. తమను విధుల్లో కొనసాగించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకరు చొప్పున అకౌంటెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఇంజినీర్, అటెండర్ మినహా మిగిలిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ తొలగించాలని బుధవారం ఆదేశాలు వచ్చినట్లు జిల్లా ఉద్యానశాఖాధికారి సునంద ధ్రువీకరించారు. ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి సమాచార మిచ్చామని పేర్కొన్నారు.
కుటుంబం రోడ్డున పడుతుంది
‘నేను 2005లో హెచ్‌ఈఓ ఉద్యోగంలో చేరాను. అప్పట్లో రూ.4 వేలు వచ్చేవి. పదిహేనేళ్లుగా ఇదే ఉద్యోగం చేస్తున్నా. ప్రస్తుతం అన్ని కటింగ్‌లు పోను నెలకు రూ.20 వేల వరకు వేతనం వస్తోంది. భార్య, ఇద్దరు పిల్లలకు జీవనాధారం ఈ ఉద్యోగమే. ఇప్పడు ప్రస్తుతం నా వయస్సు 40 ఏళ్లు. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగిస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది. వేరే ఉద్యోగం చేయడానికి వయస్సు పెరిగిపోయింది. ఇప్పుడేమి చేయాలో అర్థం కావడం లేదు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఎలా పోషించాలని’ అని పేరు చెప్పడానికి ఇష్టడని ఓ ఉద్యానవన విస్తరణాధికారి తన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment