కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడంలో కీలక పాత్ర పోలీసులదే. విధుల పట్ల అంకితభావంతో వాళ్లు పనిచేయడం వల్లనే రోడ్లపై జనసంచారం గణనీయంగా తగ్గింది. రోడ్లపైకి రావాలంటేనే వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. తమ ప్రాణాలను లెక్క చేయక సెలవులకు, కుటుంబాలకు దూరంగా ఉండి విధులకే అంకితమవుతున్న తీరు.. ఆ శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా:లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసులు నిద్రాహారాలు మానుకొని సమాజ శ్రేయస్సు కోసం వారు శ్రమిస్తున్న తీరు అమోఘం. ఇంకొన్ని చోట్ల వారిని దేవుళ్లుగా ప్రజలు అభివర్ణిస్తూ.. సత్కారాలు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి కట్టడి నేపథ్యంలో సమాజం నుంచి గౌరవ మర్యాదలు, మన్ననలు అందుకున్న జాబితాలో పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. ఇటువంటి పోలీసులకు నిత్యం సలాం కొడుతున్న దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. దీన్ని ఎవరూ కాదనలేని విషయం. ఇలా పోలీసులు తమ విధుల నిర్వహణతో ఆ శాఖ ఔనత్యాన్ని పెంచుతుండగా.. ఇంకొందరు తమ తీరుతో శాఖకు మచ్చతెస్తున్నారు.
అడ్డదారులు..
పోలీస్‌శాఖ పరపతిని అడ్డం పెట్టుకుని అక్కడక్కడ పోలీసులు చులకనగా ప్రవర్తిస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని వసూళ్లకు తెరలేపారన్న ఆరోపణలు పెద్దఎత్తున వస్తున్నాయి. నిర్ధిష్ట సమయపాలన పాటించకపోవడం, భౌతికదూరం అమలు చేయకపోవడం తదితర సాకులను చూపుతూ దుకాణ యజమానులను సైతం వదలడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కల్తీ కల్లు, నాటుసారా తయారీ, విక్రయాలు, బెల్టుషాపుల నిర్వాహకులు.. అత్యధిక ధరలకు మద్యం విక్రయాలు పలువురు పోలీసులకు కాసుల వర్షం కురిపిస్తోందని చెప్పవచ్చు. తమ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరుగుతున్న ఈ వ్యవహారాలను తెలిసీతెలియనట్లుగా నడుచుకుంటున్నారని సమాచారం. అప్పటివరకు మిన్నకుండిపోతున్న వారు.. ఎవరైనా ఫిర్యాదు చేస్తేమాత్రం హడావుడి చేస్తున్నారు. అంటే బయటకు పొక్కకపోతే వీళ్లకు యథావిధిగా మామూళ్లు ముడుతున్నట్లేనని ప్రచారం జరుగుతోంది. ఇటువంటి వ్యవహారాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తున్నాయి. వారు గట్టిగా హెచ్చరిస్తున్నా పలువురిలో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఇటువంటి వారు తమ ప్రవర్తనను మార్చుకుంటేనే ప్రజల్లో మరింత గౌరవ పెరుగుతోంది.
♦ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా కల్లు రవాణా చేస్తున్న వారికి స్టేషన్ బెయిల్ మంజూరు వ్యవహారంలో మామూళ్లు వసూలు చేశారన్న కారణంతో షాద్‌నగర్ పట్టణ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐని మంగళవారం కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. మామూళ్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
♦ చేవెళ్లలో పేకాట వ్యవహారానికి సంబంధం లేని వ్యక్తిని కేసులో ఇరికించేందుకు ఓ మధ్యవర్తి, స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి స్థానిక చెక్‌పోస్ట్ దగ్గరున్న ఒక హోటల్‌లో బేరమాడినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో సదరు కానిస్టేబుల్‌ను కమిషనరేట్‌కు అటాచ్ చేశారు.
♦ శంషాబాద్ పరిధిలోని గగన్‌పహాడ్‌లో కల్తీ కల్లు స్థావరంపై సోమవారం రాత్రి ఎస్‌ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ కల్తీ వ్యాపారం స్థానిక పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
♦ షాద్‌నగర్ పట్టణం, శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణదారుల నుంచి కొందరు కానిస్టేబుళ్లు మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment