సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో అందరు ఉపాధి కోల్పోయారు. ముఖ్యంగా పేదలకు పూట గడవని దుస్థితి. పట్టణాలు, పల్లెల్లో పనులన్నీ స్తంభించడంతో పేద కుటుంబాలకు పాట్లు తప్పడం లేదు. పొదుపు పాటించడంతో పాటు రుణాలతో ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతున్న స్వయం సహాయక మహిళా సంఘాలపైనా ప్రతికూల ప్రభావం పడింది. వ్యాపారాలు కొనసాగక సంఘాల సభ్యులు సతమతమవుతున్నారు. వీరి దయనీయ పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఎస్‌హెచ్‌జీలకు బాసటగా నిలిచి ఎంతో కొంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగించడానికి ప్రత్యేక పథకాన్ని చేపట్టింది. కోవిడ్–19 పేరిట స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) రుణాలు బ్యాంకర్ల ద్వారా అందజేస్తోంది.
పరిమితి ఇలా..
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో స్వయం సహాయక సంఘాల అత్యవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం కోవిడ్–19 ఎస్‌హెచ్‌జీ పేరిట రుణాలను అందజేస్తోంది. ఒక్కో ఎస్‌హెచ్‌జీ గరిష్టంగా రూ.లక్ష వరకు రుణం పొందవచ్చు. ఈ మొత్తాన్ని సదరు సంఘంలోని మహిళా సభ్యులు తమ అవసరాలకు అనుగుణంగా పంచుకోవచ్చు. ఈ రుణాలకు వడ్డీని సభ్యులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వమే బ్యాంకులకు ఈ వడ్డీని చెల్లిస్తుంది. జిల్లాలోని 21 గ్రామీణ మండలాల్లో 17,610 స్వయం సహాయక సంఘాలు ఉండగా.. వీటిల్లో 14,546 సంఘాలు క్రియాశీలకంగా ఉన్నాయి. వీటిల్లో దాదాపు 1.80 లక్షల మంది మహిళలు సభ్యులుగా నమోదయ్యారు. కోవిడ్–19 రుణాన్ని ఈ సంఘాలన్నీ పొందవచ్చు. కోవిడ్ రుణం తీసుకోవాలంటే.. బ్యాంక్ లింకేజీ రుణం తీసుకుని కనీసం మూడు నెలలు, సీసీఎల్ (క్యాష్ క్రెడిట్ లిమిట్) కింద డబ్బులు పొంది కనీసం ఆరునెలలు గడవాలి. ఇటువంటి సంఘాలు ఈ రుణాలు తీసుకోవచ్చు.
వాయిదాల రూపంలో రీపేమెంట్..
గత నెల నుంచే ఎస్‌హెచ్‌జీలకు కోవిడ్–19 రుణ మంజూరు మొదలైంది. జిల్లాలో ఇప్పటివరకు ఫరూఖ్‌నగర్, నందిగామ, యాచారం, మొయినాబాద్, కొందుర్గు, తలకొండపల్లి, కొత్తూరు, చేవెళ్ల, మాడ్గుల, ఇబ్రహీంపట్నం మండలాల్లో మొత్తం 90 సంఘాలకు రూ.82.25 లక్షల రుణాన్ని తీసుకున్నాయి. మరిన్ని సంఘాలు కూడా రుణం కోసం డీఆర్‌డీఏ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సాధారణ రుణాల మాదిరిగానే ఈ రుణాలను కూడా సులభ వాయిదా పద్ధతుల్లో చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆరు నెలల వరకు కిస్తీలు (ఈఎంఐ) చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. ఏడాదిలోగా వాయిదా విధానంలో రుణాలు చెల్లించడానికి అవకాశమున్నట్లు సమాచారం. రుణాన్ని పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే మంజూరు చేయడంతోపాటు నేరుగా సభ్యుల ఖాతాల్లోనే డబ్బును జమచేస్తారు. కోవిడ్ రుణాల అందజేతలో రాష్ట్రస్థాయిలో మన జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
ఎస్‌హెచ్‌జీలకు మంచి అవకాశం
స్వయం సహాయక సంఘాల అత్యవసరాలకు వినియోగించుకునేందుకు కోవిడ్–19 రుణాలు చక్కటి అవకాశం. అవసరమైన సంఘాలు వీటిని పొందవచ్చు. వీటికి వడ్డీ వర్తించదు. అంతేగాక సులభ వాయిదాల్లో తిరిగి రుణాలను చెల్లించవచ్చు. ఇప్పటివరకు జిల్లాలో రూ.80 లక్షలకుపైగా రుణాన్ని ఆయా సంఘాలు బ్యాంకుల ద్వారా పొందాయి. రుణాల మంజూరులో భాగంగా డాక్యుమెంటేషన్ కోసం ఎస్‌హెచ్‌జీ సభ్యులందరూ బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు. గ్రూపు లీడర్లు గ్రామ స్థాయిలోనే ఐకేపీ సిబ్బందితో డాక్యుమెంట్లపై సభ్యులతో సంతకాలు చేయించి బ్యాంకుకు తీసుకెళ్తే సరిపోతుంది. వీటిని సరిచూసి బ్యాంకర్లు.. ఆయా సభ్యుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు.– జంగారెడ్డి, అదనపు పీడీ, డీఆర్‌డీఏ
Comments
Please login to add a commentAdd a comment