యాచారం: చికెన్ ధరలు పెరిగాయి. పౌల్ట్రీ రైతుకు కాస్త ఉపశమనం కలిగింది. ఆదివారం కిలో ధర రూ.180 పలికింది. కరోనా భయంతో నెల రోజుల పాటు చికెన్, గుడ్లు తినడానికి ప్రజలు దూరంగా ఉన్నారు. చికెన్‌తో కోవిడ్–19 వ్యాపించదని పలుమార్లు మంత్రులు, వైద్యులు సూచించినా ప్రజలు ఆసక్తి చూపించలేదు. దీంతో వ్యాపారం పూర్తిగా కుదేలైపోవడంతో పౌల్ట్రీరైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఇటీవల సీఎం కేసీఆర్.. చికెన్ మంచి పౌష్టికాహారం అని, చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, కరోనాతో సంబంధం లేదని స్పష్టం చేశారు. మీడియాలో కూడా చికెన్ వినియోగంతో మేలు జరుగుతుందని విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం జిల్లాలో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ. 180, డ్రెస్‌డ్ రూ.160 చొప్పున విక్రయించారు.
నెల కింద పరిస్థితి దారుణం
కరోనా వైరస్ నేపథ్యంలో సుమారు నెలరోజులుగా పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా నష్టాలబాట పట్టింది. చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లు షికార్లు చేయడంతో వినియోగానికి జనం ముందుకు రాలేదు. దీంతో కోళ్లను ఫాంల నుంచి తరలించలేని దుస్థితి ఏర్పడింది. చాలాచోట్ల రూ. 100 మూడు కిలోలో కూడా విక్రయించారు. కొన్నిప్రాంతాల్లో రెండుమూడు కిలోలు తూగే కోళ్లను అతితక్కువ ధరలకు విక్రయించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈనేపథ్యంలో జిల్లాలో పౌల్ట్రీ పరిశ్రమకు సుమారు రూ.750 కోట్ల నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులకు కిస్తులెలా చెల్లించాలని మదనపడ్డారు. ప్రస్తుతం ధరలు కొంతమేర పెరగడంతో పౌల్ట్రీ రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆదివారం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సుమారు 70 వేల కిలోల చికెన్ విక్రయాలు జరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల, కందుకూర్, యాచారం తదితర ప్రాంతాల్లో జనం చికెన్ షాపులకు క్యూ కట్టారు. నిర్వాహకులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment