మామిడి పూతపై గుర్తించిన నల్ల తామర
సాక్షి, అమరావతి: మిరపను కబళించిన ‘త్రిప్స్ పార్విస్ పైనస్’ (నల్లతామర) తాజాగా మామిడిపై సోకింది. ఇప్పుడిప్పుడే పూతకొస్తున్న మామిడిపై ఈ నల్లతామర జాడను గుర్తించారు. మిరపను నాశనం చేసిన నల్లతామర మామిడిపై సోకే అవకాశం ఉందని జాతీయ శాస్త్రవేత్తల బృందాలు పేర్కొన్న నేపథ్యంలో పూతకొస్తున్న మామిడిపై వాటి ప్రభావం ఏమేరకు ఉంటుందో అంచనా వేసేందుకు మామిడి సాగవుతున్న జిల్లాల్లో శాస్త్రవేత్తల బృందాలు పర్యటిస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కృష్ణాజిల్లాలో మామిడిపై ఈ నల్లతామర జాడను కనుగొన్నారు. నూజివీడు ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు మంగళవారం మైలవరం, రెడ్డిగూడెం, రెడ్డికుంట, అన్నారం ప్రాంతాల్లో 10 వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు.
మామిడిపై సోకే సాధారణ త్రిప్స్‌తో పాటు నల్లతామర పురుగు కూడా సోకినట్లు గుర్తించారు. మామిడి చుట్టుపక్కల కూరగాయల పాదులతో పాటు కలుపు మొక్కలపైనా దీన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు నమూనాలను సేకరించారు. నల్లతామర ఉధృతి ఏ స్థాయిలో ఉంది? పూత, పిందెలపై వాటి ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది అనేవి అంచనా వేస్తున్నారు. మామిడితో పాటు ఇతర పంటలపైనా వీటి ప్రభావం కనిపిస్తున్నందున రైతులను అప్రమత్తం చేయడంతోపాటు ఆర్బీకే స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో సామూహిక నివారణ చర్యలు చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. మామిడిపై ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సారం (లూపర్), మరికొన్ని ప్రాంతాల్లో తేనెమంచు (హోపర్) పురుగులు, ఇంకొన్నిచోట్ల ఆకుమచ్చ (ఆంత్రాక్నోజ్), కొమ్మఎండు తెగులు సోకగా ఇప్పుడు సాధారణ త్రిప్స్‌తో పాటు తామరపురుగు కూడా ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన
కృష్ణా జిల్లాలో మామిడితో పాటు కూరగాయలు, కలుపుమొక్కలపై గుర్తించిన నల్లతామర నివారణకు శాస్త్రవేత్తలు సూచించిన చర్యలపై ఆర్బీకే స్థాయిలో రైతులకు అవగాహన కల్పించి, కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళతామని వ్యవసాయశాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.ఎస్.శ్రీధర్ చెప్పారు. తామరపురుగు నివారణకు మందులు సూచిస్తామని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ జానకీరామ్ చెప్పారు. ఏ మందులు పడితే ఆ మందులను మోతాదుకు మించి వాడవద్దని రైతులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment