
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ నూతనంగా ప్రతిపాదించిన జాతీయ వంట నూనెలు–ఆయిల్ పామ్ మిషన్ (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్– ఆయిల్ పామ్) పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ కేంద్ర ప్రాయోజిత పథకం ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తుంది. దేశం వంట నూనెల దిగుమతులపై ఆధారపడి ఉన్నందున ఆయా పంటల విస్తీర్ణం పెంచడం, ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా ఈ పథకం పనిచేస్తుంది. రూ. 11,040 కోట్ల మేర ఖర్చయ్యే ఈ పథకంలో కేంద్రం రూ. 8,844 కోట్లు, రాష్ట్రాలు రూ. 2,196 కోట్ల మేర వెచ్చించాల్సి ఉంటుంది. 2025–26 సంవత్సరం నాటికి అదనంగా 6.5 లక్షల హెక్టార్ల మేర పామాయిల్ సాగయ్యేలా లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా మొత్తం పామాయిల్ సాగు 10 లక్షల హెక్టార్లకు చేరుతుంది.
పామాయిల్ పంటకు ధర హామీ
సాధారణంగా పామాయిల్ గెలల దరలు అంతర్జాతీయ క్రూడ్ పామ్ ఆయిల్ ధరల అనిశ్చితి వల్ల ప్రభావితమవుతాయి. అందువల్ల తొలిసారిగా కేంద్రం పామాయిల్ రైతులకు తాజా గెలలకు గాను ధర హామీ అందించనున్నట్టు ప్రకటించింది. దీనిని వయబులిటీ ప్రైస్ (వీపీ)గా పేర్కొంది. దీని ద్వారా ధరల అనిశ్చితి నుంచి రైతులకు భరోసా అందుతుందని తెలిపింది. రాష్ట్రాలు ఈ పథకం వర్తింపునకు కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
ఇన్‌పుట్స్‌కు సాయం పెంపు..
ప్లాంటింగ్ మెటిరియల్ తదితర అవసరాల కోసం హెక్టారుకు కేంద్రం ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 వేల సాయాన్ని రూ. 29 వేలకు పెంచింది. పామాయిల్ తోటల్లో పాత చెట్ల స్థానంలో కొత్త చెట్లను నాటేందుకు వీలుగా మొక్కకు రూ. 250 చొప్పున ఆర్థికసాయాన్ని కూడా కేంద్రం ఈ పథకం ద్వారా ప్రకటించింది. ప్లాంటింగ్ మెటిరియల్ కొరతను తీర్చేందుకు వీలుగా సంబంధిత నర్సరీలకు 15 హెక్టార్లకు రూ. 80 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈశాన్య ప్రాంతాల వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ పునరుద్ధరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. దీనికి రూ. 77 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment