గోద్రెజ్ ఆయిల్ పామ్ వ్యాపార విభాగం సీఈవో సౌగత నియోగి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అగ్రి–బిజినెస్ సంస్థ గోద్రెజ్ ఆగ్రోవెట్ దేశవ్యాప్తంగాను, తెలుగు రాష్ట్రాల్లోను ఆయిల్ పామ్ ప్లాంటేషన్ సామర్థ్యాలను మరింతగా విస్తరిస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం సుమారు 4,000 హెక్టార్లగా ఉన్న విస్తీర్ణాన్ని వచ్చే మూడేళ్లలో 20,000 హెక్టార్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 41,000 హెక్టార్లు ఉండగా మరో 10–15 వేల హెక్టార్లను జోడించుకోనుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా వచ్చే ఐదేళ్లలో మరో 60,000 హెక్టార్లు జోడించుకోవాలని నిర్దేశించుకున్నట్లు గోద్రెజ్ ఆయిల్ పామ్ వ్యాపార విభాగం సీఈవో సౌగత నియోగి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రస్తుతం ఆగ్రోవెట్ కింద 65,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగవుతోంది.
350 టన్నులకు క్రషింగ్ సామర్థ్యం..
తాజా విస్తరణతో తమ క్రషింగ్ సామర్థ్యం ప్రస్తుతం గంటకు 205 టన్నుల నుంచి 350 టన్నులకు పెరగనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం 2030 నాటికి సుమారు రూ. 600 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా తమకు 6 ప్లాంట్లు ఉండగా వాటిలో మూడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఏపీలోని ప్లాంట్ల సామర్థ్యం గంటకు 190 టన్నులుగా ఉంది. రైతులకు అవసరమైన సేవలు అందించేందుకు 2027 నాటికి కొత్తగా 50 సమాధాన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని నియోగి చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణలో ఒక సెంటర్ ఉండగా 2027 నాటికి ఈ సంఖ్యను 10కి పెంచుకోనున్నట్లు, ఏపీలో మూడు ఉండగా ఈ మార్చి నాటికి మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 2022–23లో సుమారు రూ. 1,300 కోట్లుగా ఉన్న తమ టర్నోవరు తదుపరి ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు నియోగి తెలిపారు.
కేంద్ర పథకంతో ప్రోత్సాహం..
దేశీయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు 2021లో కేంద్రం రూ. 11,080 కోట్లతో నేషన ల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్–ఆయిల్ పామ్ (ఎన్‌ఎంఈవో–ఓపీ) పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. దీనితో ప్రాథమికంగా రైతుకు సబ్సిడీలు, మద్దతు ధర తరహా వ్యవస్థ రూపంలో లబ్ధి చేకూరుతుందని నియోగి చెప్పారు. కొత్త పాలసీతో పామ్ ప్లాంటేషన్‌ను వచ్చే 5–6 ఏళ్లలో ప్రస్తుతమున్న దాదాపు 3 లక్షల హెక్టార్ల నుంచి 10 లక్షల హెక్టార్లకు పెంచాలని కేంద్రం నిర్దేశించుకున్నట్లు వివరించారు.
ప్రస్తుతం దేశీయంగా 80 లక్షల టన్నుల పామాయిల్ వినియోగం ఉంటుండగా దేశీయంగా 4 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తవుతోందని, 76 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాల్సి ఉంటోందని ఆయన చెప్పారు. ఈ స్కీముతో 2030 నాటికి ఉత్ప త్తి 30 లక్షల టన్నులకు చేరుకోగలదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అప్పటికి పెరిగే డి మాండ్‌లో 30 శాతానికి సరిపడే మొత్తాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసుకోగలమని పేర్కొన్నారు. ప్రస్తుతం తలసరి వినియో గం ఏటా 18 కిలోలుగా ఉండగా 2030 నాటికి ఇది 24–25 కిలోల స్థాయికి చేరవచ్చని అంచనాలు ఉన్నాయని నియోగి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment