సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆయిల్‌పామ్ గెలల ధర టన్ను రూ.18 వేలకు పెరిగింది. రెండేళ్ల క్రితం టన్ను గెలలకు రూ.7,827 మాత్రమే లభించగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రెండేళ్లలోనే రూ.10 వేలకు పైగా పెరిగింది. ఆయిల్‌పామ్ తోటలను తొలగిస్తూ వచ్చిన రైతులు ధర ఆశాజనకంగా ఉండటం.. ప్రభుత్వ ప్రోత్సాహం పెరగడంతో తిరిగి పెద్దఎత్తున సాగు ప్రారంభిస్తున్నారు. ఫలితంగా రెండేళ్లలోనే రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు పెరిగింది.
రైతుల్లో నూతనోత్సాహం
వైఎస్ జగన్ సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతో రైతుల్లో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. 2018లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు వచ్చినప్పుడు ఆయిల్‌పామ్ రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ సమయంలో తెలంగాణలో ఆయిల్‌పామ్ గెలల ధరకు, మన రాష్ట్రంలో పలికిన ధరకు మధ్య గల వ్యత్యాస సొమ్మును వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 29,365 మంది రైతుల ఖాతాల్లో రూ.80.32 కోట్లను జమ చేశారు.
పెరిగిన సాగు విస్తీర్ణం
వ్యత్యాస ధర చెల్లించడంతో పాటు ప్రభుత్వం ఆయిల్‌పామ్ గెలల ధరను అనూహ్యంగా పెంచింది. అడహక్ పేమెంట్‌గా టన్నుకు రూ.18 వేలు అందిస్తోంది. అదనంగా రవాణా నిమిత్తం మరో రూ.200 నుంచి రూ.400 వరకు రైతుకు లభిస్తోంది. మరోవైపు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ఆయిల్‌పామ్ రైతులకు మరింత ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. దీంతో రెండేళ్ల క్రితం రాష్ట్రం 1.60 లక్షల హెక్టార్లకే పరిమితమైన సాగు విస్తీర్ణం 20 వేల హెక్టార్లు పెరిగి ప్రస్తుతం 1.80 లక్షల హెక్టార్లకు చేరుకుంది.
రైతు ప్రభుత్వమంటే ఇదీ
ఆయిల్‌పామ్ గెలలకు గిట్టుబాటు ధర కల్పించాలని గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు ఆందోళనలు చేపట్టాం. కాలం వెళ్లబుచ్చారే గానీ ధర మాత్రం పెంచలేదు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్ ప్రభుత్వం టన్ను ధరను రూ.18 వేలకు పెంచింది. రైతు ప్రభుత్వమంటే ఇదీ.
– సాయన కృష్ణారావు, రైతు, కామవరపుకోట, పశ్చిమ గోదావరి
ఆయిల్‌పామ్‌కు స్వర్ణయుగం
ఆయిల్‌పామ్‌కు ఇది స్వర్ణయుగం. ఎన్నడూ లేనంతగా ఆయిల్‌పామ్ రైతులకు మంచి ధర వస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చూపిస్తున్న చొరవ అమోఘం. ప్రభుత్వ రంగంలో ఉన్న అయిల్ ఫెడ్‌కు సహకరిస్తే రైతులకు ప్రయోజనం ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక టన్ను ధర రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యింది.
– కొఠారు రామచంద్రరావు, చైర్మన్, ఏపీ ఆయిల్ ఫెడ్
ఆయిల్‌పామ్ ధరపై నిర్ణయాధికారం ప్రభుత్వానిదే
ఆయిల్‌పామ్ గెలల ధరపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పామాయిల్ కంపెనీలపై రైతులు విజయం సాధించినట్టయింది. ప్రస్తుత చట్టాల ప్రకారం ఆయిల్‌పామ్ అంశం పూర్తిగా లెజిస్లేటివ్ పరిధికి లోబడినదేనని, ధర నిర్ణయానికి ముందు వ్యక్తిగత విచారణలు చేయాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో విడుదల చేసిన జీవో 22 ప్రకారమే పామాయిల్ కంపెనీలు గెలలకు ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలావుంటే.. ప్రభుత్వ జీవో ప్రకారం గత 4 నెలల్లో కొనుగోలు చేసిన ఆయిల్‌పామ్ గెలలకు బకాయిల ధరలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ నేపథ్యం
ఆయిల్‌పామ్ గెలలకు ధర నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 19న జీవో నంబర్ 22ను జారీ చేసింది. గత నవంబర్ నుంచి ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు పామాయిల్ గెలల్లో వచ్చే నూనె శాతాన్ని (ఓఈఆర్) 18.682గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ జీవోపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
రైతులకు రూ.200 కోట్ల లాభం
ఓఈఆర్ ఒక శాతం పెరిగితే టన్ను గెలలకు సుమారు రూ.1,190 వరకు అదనంగా ధర వస్తుంది. గత ఏడాది 15 లక్షల టన్నుల ఆయిల్‌పామ్ గెలల దిగుబడి రాగా.. ఈ ఏడాది 16 లక్షల టన్నులు రావొచ్చని అంచనా. ప్రస్తుత జీవో ప్రకారం ధర నిర్ణయిస్తే రైతులకు ఈ ఏడాది రూ.200 కోట్ల మేర అదనంగా ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఓఈఆర్ 17.6 శాతాన్ని బట్టి కంపెనీలు ధర నిర్ణయిస్తుండగా.. ఇకపై 18.682 శాతం ప్రకారం ఇవ్వాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి, పట్టుదల వల్లే తమ సమస్యలు పరిష్కారమయ్యాయని నేషనల్ ఆయిల్‌పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ నేతలు క్రాంతి కుమార్‌రెడ్డి, బొబ్బా రాఘవరావు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment