సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఆయిల్‌పామ్‌ను 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఆయిల్ ఫెడ్ పరిధిలో ఉన్న ఆయిల్‌పాం సాగు బాధ్యతను కొత్తగా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో 10 ప్రైవేట్ కంపెనీలకు వివిధ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించింది.
2022–23 వ్యవసాయ సీజన్‌లో 1.78 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించింది. కానీ ఆయిల్‌పామ్ విత్తనాలు సిద్ధంగా ఉన్నా, సాగుకు రైతులను ప్రోత్సహించడంలో ఉద్యానశాఖ విఫలమైందన్న ఆరోపణలున్నాయి. దీంతో రూ.కోట్లు పోసి విదేశాల నుంచి కొనుగోలు చేసిన లక్షలాది మొక్కలు నర్సరీల్లో వృథాగా పడివున్నాయి. మొలక విత్తనాలను మలేషియా, కోస్టారికా, ఇండోనేషియా, థాయ్‌లాండ్ తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అవి నిర్ణీత కాలం వరకే ఉంటాయి. అప్పటివరకు వాటి నిర్వహణ ఖర్చుతో కూడిన వ్యవహారం. భూమి అందుబాటులోకి రాకపోవడంతో నర్సరీలు నిర్వహిస్తున్న కంపెనీలు తమకు నష్టం వస్తుందంటూ గగ్గోలు పెడుతున్నాయి.
ఇప్పటివరకు 45 వేల ఎకరాల్లోనే సాగు
2022–23 సంవత్సరంలో 27 జిల్లాల్లో 1.78 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు 1.08 లక్షల ఎకరాల వరకు మాత్రమే రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 45,172 ఎకరాల్లో మాత్రమే డ్రిప్ సౌకర్యం కల్పించి ఆయిల్‌పామ్ మొలక విత్తనాలు వేశారు. అంటే ఇంకా 1.33 లక్షల ఎకరాల్లో మొలక విత్తనాలు వేయాల్సి ఉంది. జగిత్యాల జిల్లాలోనైతే 9 వేల ఎకరాలు లక్ష్యం కాగా, ఒక్క ఎకరాలో కూడా ఆయిల్‌పామ్ సాగు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
కరీంనగర్ జిల్లాలో 10 వేల ఎకరాలు లక్ష్యం కాగా, 43 ఎకరాల్లోనే విత్తనాలు వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16,862 ఎకరాలు లక్ష్యం కాగా, 9,062 ఎకరాల్లో విత్తనాలు వేశారు. ప్రస్తుతం ఆయిల్‌ఫెడ్ సహా వివిధ కంపెనీల వద్ద లక్ష ఎకరాలకు సరిపడా ఆయిల్‌పామ్ మొలక విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ఎకరానికి 57 మొలక విత్తనాల చొప్పున 57 లక్షల విత్తనాలు ఆయా నర్సరీల్లో వృథాగా ఉన్నాయి.
భూమిని గుర్తించడంలో వైఫల్యం
ఉద్యానశాఖ సాగు కోసం ఇంకా 70 వేల ఎకరాలను గుర్తించాల్సి ఉంది. అదీగాక గుర్తించిన 1.08 లక్షల ఎకరాలకుగాను 50వేల ఎకరాలకుపైగా భూములకు డ్రిప్ సౌకర్యం కల్పించలేదు. డ్రిప్ సౌకర్యం కల్పించాలంటే రైతులకు ఉద్యానశాఖ సబ్సిడీ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు నూటికి నూరు శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందజేస్తుంది.
కాబట్టి జీఎస్టీతో కలుపుకొని ఒక్కో రైతు ఐదారు వేల రూపాయలు చెల్లించాలి. ఆ మేరకు రైతుల నుంచి డ్రిప్ వాటాను రాబట్టడంలో ఉద్యానశాఖ వైఫల్యం కనిపిస్తోంది. మరో 70 వేల ఎకరాలను గుర్తించడంలోనూ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జిల్లాకు ముగ్గురు నలుగురు చొప్పున మాత్రమే ఉద్యానశాఖ అధికారులుంటారు. వారు భూమిని గుర్తించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. ఈ బాధ్యత వ్యవసాయశాఖలోని ఏఈవోలకు పూర్తిస్థాయిలో అప్పగిస్తే వేగంగా లక్ష్యం నెరవేరేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment