Tips to Control Whiteflies in Coconut and Palm Oil Farming - Sakshi
Sakshi News home page

కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటల్లో తెల్లదోమ సమస్యకు ఇలా చెక్‌!!

Published Tue, Oct 19 2021 3:21 PM | Last Updated on Wed, Oct 20 2021 5:55 PM

How To Control Whitefly Infestation In Coconut And Palm Oil Farming - Sakshi

దక్షిణాది రాష్ట్రాల్లో కొబ్బరి, ఆయిల్‌ పామ్‌ తోటలకు రూగోస్‌ వైట్‌ ఫ్లై (సల్ఫిలాకార తెల్లదోమ) గత కొన్నేళ్లుగా పెనుముప్పుగా మారింది. తోటల్లో ముందుగానే బదనికల (రెక్కల పురుగుల)ను వదలటం, తదితర పద్ధతుల్లో నియంత్రణకు ప్రభుత్వ పరిశోధనా సంస్థల శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. తెల్లదోమ ఉధృతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే, రూగోస్‌ కన్నా ప్రమాదకరమైన తెల్లదోమ సంతతికి చెందిన బొండార్స్‌ నెస్ట్‌ ఫ్లై కూడా కొబ్బరి తోటలను ఆశిస్తోంది. తెల్లదోమ కన్నా ఇదే∙ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. దీని ఉధృతి పైకి కనిపించదు కానీ నష్టం ఎక్కువే

30% వరకు పంట నష్టం   
తొలుత కొబ్బరి, ఆయిల్‌ పామ్‌కు పరిమితమైన తెల్లదోమ.. తరువాత అరటి, పనస, జామ వంటి చెట్లను మాత్రమే కాకుండా నర్సరీలలోని అలంకరణ మొక్కలను సైతం ఆశిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం కొంత తగ్గుతున్నా అక్టోబరు నుంచి దీని ఉధృతి పెరుగుతుంది. జూన్‌ నెలాకరు వరకు తోటలకు నష్టం ఎక్కుగా ఉంటుంది. తెల్లదోమ వల్ల గడచిన మూడేళ్లలో కొబ్బరిలో సుమారు 30 శాతం దిగుబడి కోల్పోయినట్టు అంచనా. కాయ సైజు కూడా తగ్గింది. తెల్లదోమ ఆశించిన ఆయిల్‌ పామ్, అరటి, పనస తదితర చెట్లు బలహీనపడుతున్నాయి. దిగుబడిలో తగ్గుదల కనిపిస్తున్నది. వర్షాకాలంలో తెల్లదోమ ఉధృతి తగ్గుతుంది. అందుకని, దీని వల్ల పెద్దగా నష్టం లేదని కొందరు రైతులు ఉదాసీనంగా ఉంటున్నారు. కానీ వాస్తవంగా రూగోస్‌ తెల్లదోమ సోకితే పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది.

చదవండి: మార్నింగ్‌ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరాలైంది!!

బదనికలతో సమవర్థవంతంగా కట్టడి
అంబాజీపేటలోని డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన పరిశోధనా స్థానంలో తెల్లదోమపై పరిశోధనలు సత్ఫలితాలనిస్తున్నాయి. తెల్లదోమ నివారణకు వేపనూనె, గంజి ద్రావణం పిచికారీ చేయడం, పసుపురంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికన్నా సూడోమల్లాడ ఆస్టార్‌ (డ్రై  కోక్రై  సా) అనే రకం బదనికలు సమర్ధవంతంగా తెల్లదోమను నివారిస్తున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. 

ఈ బదనికలకు తెల్లదోమ ఒక్కటే మంచి ఆహారమని గుర్తించారు. ఈ బదనికల గుడ్లను తీసుకువెళ్లి తోటల్లో చెట్లపై అక్కడక్కడా పిన్‌ చేస్తే తెల్లదోమ అదుపులో ఉంటున్నదని శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానం బయోల్యాబ్‌లో బదనికలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ ఏటా 45 లక్షల వరకు బదనికలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని రైతులకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. వీటిని ఆంధ్రప్రదేశ్‌ రైతులే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలకు చెందిన యూనివర్శిటీలు, ఉద్యాన, వ్యవసాయ శాఖలు, రైతులు తీసుకెళ్తున్నారు. కావాలని అడిగిన వారందరికీ బదనికలను ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. డిమాండ్‌ అధికంగా ఉండడాన్ని గుర్తించి తాడేపల్లిగూడెం వద్ద వెంకట్రామన్నగూడెంలోని డా. వైఎస్సార్‌ విశ్వవిద్యాలయం ఆవరణలో, శ్రీకాకుళం జిల్లా సోంపేట లోనూ ఈ ఏడాది నుంచి బదనికల ఉత్పత్తిని ప్రారంభించటం విశేషం. 

చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!!

బదనికల ఉత్పత్తిపై పలు సంస్థలతో ఎంవోయూలు
తెల్లదోమ నియంత్రణకు ప్రభుత్వం, డా. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాయి. బదనికలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వీటిని ఇప్పటి వరకు ఉద్యాన విశ్వవిద్యాలయమే ఉత్పత్తి చేస్తున్నది. బదనికలను మరింత విస్తృతంగా రైతులందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రైవేట్‌ సంస్థలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాల ద్వారా కూడా ఉత్పత్తి చేయించేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు ఆయా సంస్థలతో ఉద్యాన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాలు (ఎంవోయు)లు సైతం చేసుకుంది. 

బదనికలు విస్తృతంగా రైతులకు అందించాలని వర్సిటీ భావించింది. బదనికలను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, సహకార సంఘాలకు, పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్తలకు, ప్రైవేటు సంస్థలకూ అందిస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలతో వర్శిటీ ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థల నుంచి కూడా రైతులు బదనికలను పొంది, సకాలంలో తోటల్లో వదిలితే తెల్లదోమ నియంత్రణ సాధ్యమవుతుంది. 

ప.గో. జిల్లాకు చెందిన గోద్రేజ్‌ కంపెనీ, గోపాలపురానికి చెందిన ఎస్‌ఎస్‌డీ ఎంటర్‌ప్రైౖజెస్, తాడేపల్లిగూడెం సమీపంలోని త్రిబుల్‌ ఎక్స్‌ కంపెనీ, తమిళనాడుకు చెందిన బాలాజీ నిమ్మ, క్రిష్టా బయాక్స్, ఎకో కేర్‌ ఎంవోయు చేసుకున్నారు. అలాగే, తూ. గో. జిల్లా అంబాజీపేటలోని గోదావరి ఇంటిగ్రేటెడ్‌ ఫార్మర్స్‌ ట్రేడింగ్‌ అండ్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ (గిఫ్ట్‌), దేవగుప్తం ప్రాధమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం కూడా ఎంవోయులు చేసుకొని, లాబ్‌లు ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభమైతే రైతులకు బదనికలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తాయి.  

బదనికల ఉత్పత్తికి బయోల్యాబ్‌ నెలకొల్పిన దేశంలోనే తొలి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ‘గిఫ్ట్‌’ అరుదైన ఘనత సాధించనుంది. ఉద్యాన శాఖ సహకారంతో డిసెంబరు మొదటి వారం నుంచి బదనికలను ఉత్పత్తి చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని ‘గిఫ్ట్‌’ చైర్మన్‌ కొవ్వూరి త్రినాద్‌రెడ్డి (94402  04323) అన్నారు. తెల్లదోమ నివారణకు కోనసీమ రైతులకు నాణ్యమైన వేప నూనె, జీవన ఎరువులు, బదనికలతోపాటు హిస్సారియా కల్చర్‌నూ అందిస్తామన్నారు. 

ఆధృతిని బట్టి బదనికలు వదలాలి
సూడోమల్లాడ ఆస్టార్‌ (డ్రై  కోక్రై  సా) అనే రకం బదనికల (రెక్కల పురుగుల) గుడ్లను రూగోస్‌ తెల్లదోమ సోకిన కొబ్బరి, పామాయిల్‌ చెట్ల ఆకులపై రైతులు పిన్‌ చేసుకోవాలి. ఆ గుడ్ల లో నుంచి వెలువడే బదనికలు తెల్లదోమ గుడ్లను తింటూ ఉధృతిని అరికడతాయి.  తోటల్లో తెల్లదోమ ఉధృతిని బట్టి చెట్ల ఆకులపై బదనికల గుడ్లను పెట్టుకోవాలి. ఆకుకు ఐదు నుంచి పది రూగోస్‌ తెల్లదోమ వలయాలు ఉంటే రెండు గ్లుడ్లు చాలు. పది హేను రోజుల వ్యవధిలో రెండుసార్లు పెడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ రకం బదనికలు బొప్పాయి, మందార చెట్టు మీద ఆశించే రసం పీల్చే పురుగులు పేనుబంక, పిండినల్లిని కూడా తింటున్నాయి. పాలీహౌస్‌లలో కూడా ఇవి సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. వెయ్యి గుడ్లను రూ.150కు పరిశోధనా స్థానం రైతులకు అందజేస్తుంది. 

– డాక్టర్‌ ఎన్‌.బి.వి.చలపతిరావు, 
ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర నిపుణులు, 
డా. వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన పరిశోధనా స్థానం, 
అంబాజీపేట 08856244436/243711

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement