సాక్షి, హైదరాబాద్: ఆయిల్ పామ్ ధరలు గణనీ యంగా తగ్గాయి. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, కరోనా నేపథ్యంలో ఆగస్టు వరకు ఆయిల్ పామ్‌కు అధిక ధరలు పలికాయి. అయితే గత నెల నుంచి ఈ పంట ధరలు గణనీయంగా తగ్గాయి. మరో పక్క ఇతర వంట నూనెల ధరల్లో కూడా తగ్గుముఖం కనిపించింది.
ఈ ఏడాది జూన్‌లో టన్నుకు రూ. 22,765 పలికిన ఆయిల్ పామ్ ధర సెప్టెంబర్ ఒకటి నుంచి రూ. 12,995కు పడిపోయింది. వాస్తవానికి ఆయిల్ పామ్ ధర టన్నుకు రూ.10 వేలు లభిస్తే అదే మహాభాగ్యం అనే పరిస్థితి మూడేళ్ల క్రితం వరకు ఉండేది. 2015లో టన్ను ధర గరిష్టంగా రూ.6,811 పలికింది. 2018లో తొలిసారిగా రూ. 10 వేలు దాటింది. 2020లో గరిష్ట ధర రూ.12,800 పలుకగా 2021లో అమాంతం టన్నుకు రూ.19,114కు చేరింది.
తర్వాత అది రూ.22,765 వరకు చేరుకుంది. ఏడేళ్లలో టన్ను ధర ఏకంగా మూడు రెట్లకుపైగా పెరగడం విశేషం. దీంతో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆయిల్ పామ్ సాగువైపు దృష్టి సారించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 52 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. 2022–23లో రెండున్నర లక్షల ఎకరాల్లో సాగు చేపట్టాలనేది సర్కారు లక్ష్యం. ఈ నేపథ్యంలో ఆయిల్ పామ్ ధరలు పతనం కావడం వల్ల తమకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.
అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల వల్లే ఆయిల్ పామ్ గెలల ధర పడిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మూడు నెలల వ్యవధిలో టన్నుకు దాదాపు రూ.10 వేలకు పైగా ధర పడిపోయి రూ.12,995 వద్ద ఆగిపోయింది. మున్ముందు ఇంకా తగ్గే పరిస్థితి కనిపిస్తోందని ఆయిల్‌ఫెడ్ వర్గాలు అంటున్నాయి. ఆయిల్‌ఫెడ్ వర్గాల లెక్కల ప్రకారం పామాయిల్ ధర కిలోకు గతంలో రూ.160 నుంచి రూ.170 వరకు పలకగా ఇప్పుడది రూ.90కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment